ఆయుష్మాన్ భారత్ పథకం తొలి లబ్ధిదారు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
- సరోజ్ సింగ్, పీయూష్ నాగ్‌పాల్
- బీబీసీ ప్రతినిధులు

హరియాణా రాష్ట్రానికి చెందిన కరిష్మా వయసు 8 నెలలు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పుట్టిన తొలి బిడ్డ ఆమె. అందుకే, ఆమె ప్రచారానికి కేంద్ర బిందువైంది. మరి, ఇప్పుడు ఈ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్ కార్డు ఉపయోగపడుతోందా?
ప్రస్తుతం కరిష్మా ఆరోగ్యం బాగా లేదు. గత 15 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గింది. ఆమె చికిత్స కోసం తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వైద్య బీమా వర్తిస్తుంది.
2018 ఆగస్టు 15న కరిష్మా పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు.
అయితే, తమ ఊరికి దగ్గరలో ఈ పథకం కింద వైద్యం అందించే ఆస్పత్రులు లేకపోవడంతో తాము ప్రస్తుతం తరచూ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని కరిష్మా తల్లి మౌసమి అంటున్నారు.
"ఇంతకుముందు కరిష్మాకు జబ్బు చేసినప్పుడు చాలా ఖర్చయింది. నిన్న, మొన్న కూడా ఆస్పత్రికి తీసుకెళ్లాం. ప్రభుత్వాస్పత్రికి పొద్దున వెళ్తే, మా వంతు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. రోజంతా వృథా అవుతుంది. దాంతో, ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లక తప్పట్లేదు. ప్రతిసారీ మందులకే 300 -350 రూపాయలు ఖర్చవుతున్నాయి. ఆ ఖర్చులు మా చేతి నుంచే పెట్టాల్సి వస్తోంది, ఈ కార్డుతో ఏ లాభమూ లేదు" అని కరిష్మా తల్లి మౌసమి అంటున్నారు.
వీడియో: ఆయుష్మాన్ భారత్ పథకం తొలి లబ్ధిదారు ఈ చిన్నారి
ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరంలేని చిన్న చిన్న చికిత్సలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదని వీరికి తెలియదు.
"బస్సులో 22 కిలోమీటర్లు వెళ్లాలి. బస్సు కోసం గంటల కొద్దీ వేచిచూడాలి. ఈ పథకం వర్తించే ప్రైవేటు ఆస్పత్రి మాకు దగ్గర్లో ఉంటే, ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం మాకు సులువవుతుంది. మా పెద్ద కొడుకు పుట్టినప్పుడు నా భార్యకు ఆపరేషన్ చేశారు. ఆ ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది" అని కరిష్మా తండ్రి అమిత్ వివరించారు.
ఆయుష్మాన్ భారత్ పథకం అన్ని ఆస్పత్రులకు వర్తించదు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, కొన్ని ప్రైవేటు పెద్దాస్పత్రుల్లో మాత్రమే ఈ పథకం కింద చికిత్స చేయించుకునే వీలుంటుంది.
ఈ పథకం వర్తించే ఆస్పత్రులు కరిష్మా వాళ్ల ఊరికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దాంతో, వీళ్లు దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్నారు.
మరో విషయం ఏమిటంటే, ఆయుష్మాన్ భారత్ పథకం కార్డు లేకున్నా కరిష్మా పుట్టినప్పుడు వీళ్లు ఏమాత్రం డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదని వైద్యులు చెప్పారు.
" కరిష్మా తల్లి ప్రసవం కోసం వస్తే ఎలాగైనా మేం ఆమెకు చికిత్స చేయాల్సిందే. ఆమె సాధారణ పేషెంట్‌గా వచ్చి ఉంటే, వారి నుంచి పైసా కూడా వసూలు చేసేవాళ్లం కాదు. వారు ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులు కాబట్టి ఆ పథకం కింద ప్రభుత్వం నుంచి ఆస్పత్రికి రూ.9,000 వచ్చాయి. లేకుంటే జనని సురక్ష యోజన కింద ప్రసవం ఉచితంగా చేసేవాళ్లం" అని కర్నాల్ పట్టణంలోని కల్పనా చావ్లా హాస్పిటల్ డైరెక్టర్ డా. సురేంద్ర కశ్యప్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: బీజేపీ ర్యాలీగా వైరల్ అవుతున్న ఈ ఫోటో నిజమేనా...
- రీపోలింగ్ ఏ ఏ సందర్భాల్లో నిర్వహిస్తారు? రీపోలింగ్ ఎన్ని రకాలు?
- మసీదుల్లో పురుషులతో కలిసి మహిళల నమాజ్‌కు అనుమతించాలంటూ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- మోదీ ఈ మహిళల కాళ్లు కడిగారు.. మరి, వారి జీవితాలు ఏమైనా మారాయా
- అభినందన్ బీజేపీకి మద్దతు పలికారా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు.. సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)