కేసీఆర్ తెలంగాణను ఎలా సాధించారంటే... బయోపిక్ తీస్తున్న వర్మ-ప్రెస్ రివ్యూ

రాంగోపాల్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జీవిత చరిత్ర ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని ఆయన ఈ చిత్రంలో చూపించనున్నారు.

గురువారం ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను వర్మ ట్విటర్‌లో విడుద‌ల చేశారు. ఈ సినిమాకు `టైగ‌ర్ కేసీఆర్‌` అని పేరు పెట్టారు. కింద `ది అగ్రెసివ్ గాంధీ`, `ఆడు తెలంగాణ తెస్త‌నంటే అంద‌రూ న‌వ్విండ్రు` అని క్యాప్ష‌న్, ట్యాగ్‌లైన్ పెట్టారు.

ఇది కేటీఆర్(టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు) తండ్రి బ‌యోపిక్ అని, ఆంధ్రుల‌ పాల‌న‌లో అణిచివేత‌కు గురైన తెలంగాణ ప్ర‌జ‌ల కోసం కేసీఆర్ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించారో ఈ సినిమాలో చూపించ‌బోతున్నామని ఆయన చెప్పారు.

ఎన్టీఆర్‌, ల‌క్ష్మీపార్వ‌తి జీవిత‌క‌థ ఆధారంగా వ‌ర్మ తెర‌కెక్కించిన‌ `ల‌క్ష్మీస్ ఎన్టీయార్‌` ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

కొత్త మెట్రో: బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్‌ వరకు

హైదరాబాద్‌ మహానగరంలోని కీలక ప్రాంతాలను కలిపే మూడో దశ మెట్రో రైలు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోందని, 29 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ కొత్త లైను కోసం దిల్లీ మెట్రో రైలు సంస్థ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిటైల్డు ప్రాజెక్టు రిపోర్టు-డీపీఆర్‌) రూపొందిస్తోందని ఈనాడు తెలిపింది.

బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్‌ వరకు తీసుకొచ్చి ప్రస్తుత మెట్రో లైనులో కలిపేలా డీపీఆర్‌ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) తోడ్పాటు అందించబోతున్నాయి.

మూడో దశ మెట్రో ఎలా ఉంటుందంటే- బీహెచ్‌ఈఎల్‌ దగ్గర మెట్రోరైలు ఎక్కితే చందానగర్‌ మీదుగా ఆల్విన్‌ క్రాస్‌ రోడ్డు వరకు జాతీయ రహదారిలో ప్రయాణం సాగుతుంది. తర్వాత హఫీజ్‌పేట వైపు తిరుగుతుంది. కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, కాజగూడ, విస్పర్‌వ్యాలీ, టోలీచౌక్‌, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌ మీదుగా లక్డీకాపూల్‌ చేరుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రోలైనులో కలుస్తుంది.

మెట్రో మొదటి దశలో 72 కిలో మీటర్ల పొడవున లైను నిర్మించాల్సి ఉండగా 56 కిలో మీటర్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే మియాపూర్‌-ఎల్బీనగర్‌, హైటెక్‌ సిటీ నుంచి నాగోలు కారిడార్‌లో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి.

రెండో దశలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 22 కిలో మీటర్ల పొడవున మెట్రో లైనును నిర్మించడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. డీపీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై రేపోమాపో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఒకే రోజు 2.6 లక్షల మంది ప్రయాణం

హైదరాబాద్ మెట్రో రైలు మరో రికార్డు నెలకొల్పిందని నమస్తే తెలంగాణ పేర్కొంది. ఏప్రిల్ 17న ఒకే రోజు 2.6 లక్షల మంది మెట్రోలో ప్రయాణించినట్లు మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారని చెప్పింది.

హైటెక్‌సిటీ మార్గం అందుబాటులోకి వచ్చాక రోజూ 2.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి వారం 4 వేల మంది ప్రయాణికులు పెరుగుతున్నారని చెప్పారు. 2.6 లక్షల్లో 9 వేల పేపర్‌టికెట్లు ఐపీఎల్ కోసం విక్రయించినట్లు తెలిపారు. 2.6 లక్షల మంది ప్రయాణికుల్లో ఐపీఎల్ చూడటానికి వెళ్లే ప్రయాణికులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

హైటెక్‌సిటీ, దుర్గం చెరువు స్టేషన్ల నుంచి 12 ఐటీ కంపెనీలు షటిల్ బస్సులు నడుపుతున్నాయని ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. దుర్గం చెరువు స్టేషన్ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా ఉచిత షటిల్ బస్సులను ఎల్ అండ్‌టీ మెట్రోరైలు గురువారం ప్రారంభించిందని తెలిపారు.

ఒంటిమిట్టలో వైభవంగా కల్యాణోత్సవం

కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారని సాక్షి తెలిపింది. ఒంటిమిట్ట క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచి 10 గంటల మధ్య ఈ వేడుక జరిగింది.

ఫొటో సోర్స్, instagram/ncbn.official

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దంపతులు సంప్రదాయంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

శ్రీరాముని కల్యాణ కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో లక్ష్మీకాంతం పర్యవేక్షించారు.

రాత్రిపూట శ్రీరాముడి కల్యాణం నిర్వహించే సంప్రదాయం ఒంటిమిట్టలో మాత్రమే ఉంది.

విద్యుత్‌ ఉద్యోగుల విభజన మళ్లీ మొదటికి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల విభజన సమస్య మళ్లీ మొదటికొచ్చిందని ఈనాడు రాసింది.

ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి నాలుగేళ్ల కిందట రిలీవ్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిని చేర్చుకోవడానికి ఏపీ సంస్థలు నిరాకరించడంతో కొందరు సుప్రీంకోర్టుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని జస్టిస్‌ ధర్మాధికారి అధ్యక్షతన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.

పలు దఫాలుగా రెండు రాష్ట్రాల సంస్థల అధికారులతో ఈ కమిటీ విచారణ జరిపింది. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులందరినీ ఎక్కడివారక్కడ పనిచేయడానికి తాత్కాలికంగా ఆర్డర్‌ సర్వ్‌ పేరుతో ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న రాష్ట్రస్థాయి ఉద్యోగులందరి నుంచి 'ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారు' అనే ఆప్షన్‌ తీసుకోవాలని తాజాగా కమిటీ ఆదేశాలిచ్చింది.

వచ్చే నెల 27న ధర్మాధికారి కమిటీ మరోసారి సమావేశమై ఉద్యోగుల పంపిణీ అంశంపై విచారణ జరుపుతుంది. ఈ కమిటీ ఇచ్చే ఆదేశాలను తమ ఆదేశాలుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలోనే తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్

త్వరలోనే రూ.50 నోటు నూతన సిరీస్‌ త్వరలో చలామణిలోకి రానుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిందని సాక్షి తెలిపింది.

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే ఈ కొత్త సిరీస్‌తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)