అయిదోసారీ ఆడపిల్లే పుట్టిందని భార్యను చంపేశాడు

పంజాబ్, మహిళ

ఫొటో సోర్స్, COURTESY: FAMILY

అయిదోసారీ కూతురే పుట్టిందని, మగబిడ్డ పుట్టలేదనే కారణంతో ఒక పంజాబీ తన భార్యను చంపేశాడు.

నాలుగున్నర నెలల పసికందు అయిన ఐదో కుమార్తెను, ఎనిమిది నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న మిగతా నలుగురు కూతుళ్లను అతడు ఒక గదిలో పెట్టి తాళం వేసి, నిద్రపోతున్న భార్యను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సిక్కుల పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన ఆనంద్‌పుర్ సాహిబ్‌కు దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఝింజ్రీ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

"ఆడశిశువుల జననం కారణంగా గృహహింసకు పాల్పడే ఘటనలు పంజాబ్‌లో అసాధారణమేమీ కాదు. కానీ ఈ ఘటన మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. షాక్‌లో ఉన్న ఆ పిల్లలు మా వైపు అమాయకంగా చూస్తున్నారు. వాళ్ల భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతోంది" అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్ గుర్జీత్ సింగ్ చెప్పారు.

అయిదో సంతానంగా కూతురు పుట్టడంపై మనస్తాపం చెంది తన భార్య అనితా రాణి(35)ని తానే చంపానని నిందితుడు రాకేశ్ కుమార్ (43) ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, COURTESY: FAMILY

ఫొటో క్యాప్షన్,

రాకేశ్ కుమార్ (45), అనితా రాణి (35)

పంజాబ్‌లో స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరం చాలా ఎక్కువ. ఈ రాష్ట్రంలో ఆడశిశువుల జననానికి వ్యతిరేకంగా భ్రూణహత్యలు సర్వసాధారణంగా జరుగుతూ వస్తున్నాయి. అధికారుల కఠిన చర్యలతో ఇటీవలి కాలంలో మాత్రం కొంత తగ్గాయి.

2011 గణాంకాల ప్రకారం స్త్రీ-పురుష నిష్పత్తిలో జాతీయ సగటు కన్నా పంజాబ్ చాలా వెనకబడి ఉంది.

జాతీయ సగటు ప్రకారం ప్రతి వెయ్యి మంది మగవారికి 940 మంది చొప్పున స్త్రీలు ఉండగా, పంజాబ్‌లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 895 మంది మాత్రమే మహిళలు ఉన్నారు.

"ఐదుగురు కుమార్తెలను ఎలా పోషించాలి, కొడుకు ఎందుకు పుట్టలేదు" అనే ఆలోచనలతో ఆందోళన చెందానని రాకేశ్ కుమార్ చెప్పాడని ఇన్‌స్పెక్టర్ గుర్జీత్ సింగ్ వెల్లడించారు.

"అన్నిసార్లూ కూతుళ్లే పుట్టడంపై నా తోబుట్టువును రాకేశ్ ఎప్పుడూ తప్పుబడుతూ ఉండేవాడు. కానీ ఇంత పనిచేస్తాడని ఎన్నడూ అనుకోలేదు'' అని అనిత సోదరి సరబ్జీత్ చౌర్ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఫొటో సోర్స్, COURTESY: FAMILY

ఫొటో క్యాప్షన్,

తన సోదరితో అనితా రాణి (పాత చిత్రం)

సరబ్జీత్ రాకేశ్ తమ్ముడిని పెళ్లాడారు. వీళ్ల ఇళ్లు కొన్ని మీటర్ల దూరంలోనే ఉంటాయి.

రాకేశ్ ఇటీవలే టైర్లు పంక్చర్ చేసే దుకాణం తెరిచాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ అతడు పనిచేసేది చాలా తక్కువని, పూట గడవడం కుటుంబానికి కష్టంగా ఉంటోందని ఆవేదన వ్యక్తంచేశారు.

అతడిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

''నా సోదరిని చంపినందుకు రాకేశ్‌ను జీవితాంతం జైల్లో పెట్టాలి'' అని సరబ్జీత్ కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)