పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ సినీ నటుల ప్రచారంపై వివాదం

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశీ నటులతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ప్రచారం
పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల కోసం ఇద్దరు బంగ్లాదేశీ నటులతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ప్రచారం చేయించడంపై వివాదం రాజుకుంది.
ఆ ఇద్దరిలో ఒకరైన ఫిర్దోస్ అహ్మద్ భారత ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పటికే దేశం విడిచివెళ్లిపోయారు.
బంగ్లాదేశ్‌లో మంచి జనాదరణ కలిగిన ఫిర్దోస్ అహ్మద్ గత ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓ రోడ్‌షోలో పాల్గొన్నారు. టీఎంసీ అభ్యర్థి కన్హయ్యలాల్ అగ్రవాల్‌కు ఓట్లు వేయాలని స్థానికులను అభ్యర్థించారు.
ఆయనతో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన నటులు కొందరు ఈ కార్యక్రమంలో కనిపించారు.
ఈ రోడ్‌షో ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చాయి.
వెంటనే ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయాన్ని ఆశ్రయించింది.
తాత్కాలిక బిజినెస్ వీసాలపై వచ్చే విదేశీయులకు 12 నిర్దిష్ట కార్యకలాపాలను చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉన్నట్లు వీసా నిబంధనల్లో స్పష్టంగా ఉందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏ విధంగానూ ఆ కార్యకలాపాల పరిధిలోకి రాదని బీజేపీ ఈసీకి రాసిన లేఖను ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
అత్యున్నత చట్టసభకు జరిగే ఎన్నికల ప్రక్రియలో విదేశీయుడు జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధమని బీజీపే అభ్యంతరం తెలిపినట్లు పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
'ఆ వర్గం ఓట్ల కోసమే'
రాయ్‌గంజ్ లోక్‌సభ స్థానంలో 50 శాతానికి పైగా ముస్లింలు ఉన్నారని భాజపా అంటోంది. వర్గం ప్రాతిపదికగా ఓట్లను కూడగట్టేందుకే బంగ్లాదేశీ నటులను టీఎంసీ ప్రచారానికి తీసుకువచ్చిందని ఆరోపిస్తోంది.
రాయ్గంజ్లో బీజేపీ తరఫున దేవ్‌శ్రీ చౌధరీ పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర విభాగానికి ఆమె ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు.
సినిమా షూటింగ్ కోసమని వీసా తీసుకుని ఫిర్దోస్ భారత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తాము ఈసీకి ఫిర్యాదు చేశామని దేవ్‌శ్రీ చెప్పారు. టీఎంసీ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆమె అన్నారు.
''దీదీ (టీఎంసీ అధ్యక్షురాలు మమత బెనర్జీ) ఈ రోజు బంగ్లాదేశీయులతో ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు. రేపు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కూడా తీసుకువస్తారా?'' అంటూ బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు.
ఫొటో సోర్స్, DEVSHREE CHOWDHURY / FACEBOOK
బీజేపీ నాయకురాలు, దేవ్‌శ్రీ చౌధరి
స్పందించని టీఎంసీ నేతలు
ఫిర్దోస్ ప్రచార వివాదం తర్వాత టీఎంసీ నాయకులు ఈ వ్యవహారం గురించి బహిరంగంగా ఏ వ్యాఖ్యలూ చేయడం లేదు.
ఈ విషయంపై స్పందన కోసం కన్హయ్యలాల్తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఘటన గురించి తనకు ఎలాంటి సమాచారమూ తెలియదని ఆయన సమాధానమిచ్చారు.
''ఎన్నికలు సమీపిస్తున్నాయి. నా ప్రచార బాధ్యతలను నేనే చూసుకుంటా. సినీనటులతో ప్రచారం చేయించాల్సిన అవసరమేమీ నాకు రాలేదు. ఇప్పుడూ అంతే'' అని కన్హయ్యలాల్ అన్నారు.
సోషల్ మీడియాలో ప్రచారమైన చిత్రాల్లో ఫిర్దోస్‌తో పాటు కన్హయ్యలాల్ కూడా కనిపించారు. కానీ, ఈ విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు.
ఫిర్దోస్ వీసా నిబంధనలను ఉల్లంఘించారా అన్నదానిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ రీజనల్ ఆఫీస్ (ఎప్ఆర్ఆర్ఓ)ను భారత హోంశాఖ కోరింది.
ఫిర్దోస్ సినిమా షూటింగ్ పేరుతో వీసా తీసుకుని భారత్‌కు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయనకు దేశం నుంచి వెళ్లిపోవాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఆయన బంగ్లాదేశ్ వెళ్లిపోయారు.
ఫిర్దోస్ సినీనటుడిగా బంగ్లాదేశ్‌తోపాటు పశ్చిమ బెంగాల్లోనూ ప్రాచుర్యం పొందారు. పశ్చిమ బెంగాల్ సినీ పరిశ్రమలోనే ఆయన సినీ కెరీర్ ఆరంభమైంది.
ఈ వివాదంపై ఫిర్దోస్ ఇంతవరకూ ఎక్కడా బయటకు స్పందించలేదు.
ఫొటో సోర్స్, GAZI NOOR/FACEBOOK
బంగ్లాదేశ్ నటుడు గాజీ నూర్
దమ్దమ్లోనూ..
అయితే, ఈ వ్యవహారం పూర్తిగా సద్దుమణగకముందే బంగ్లాదేశ్‌కు చెందిన మరో నటుడు గాజీ నూర్ పశ్చిమ బెంగాల్‌లోని దమ్‌దమ్ లోక్‌సభ నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఘటన వెలుగులోకి వచ్చింది.
టీఎంసీ అభ్యర్థి సౌగతా రాయ్ తరఫున ప్రచారం చేస్తూ ఆయన కనిపించారు.
ఈ విషయంపైనా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.
అయితే బంగ్లాదేశీ నటులు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తప్పేమీ కాదని టీఎంసీ నేత మదన్ మిత్రా అన్నారు.
''రాష్ట్రవాసులకు బంగ్లాదేశ్‌తో విడదీయరాని అనుంబంధం ఉంది. అది ఈనాటిది కాదు. 1971 యుద్ధంలో వారికి మేం అండగా ఉన్నాం'' అని వ్యాఖ్యానించారు.
దమ్‌దమ్‌లో గాజీ నూర్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవారిలో మదన్ మిత్రా కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- మసీదుల్లో పురుషులతో కలిసి మహిళల నమాజ్‌కు అనుమతించాలంటూ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- మోదీ ఈ మహిళల కాళ్లు కడిగారు.. మరి, వారి జీవితాలు ఏమైనా మారాయా
- అభినందన్ బీజేపీకి మద్దతు పలికారా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు.. సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- సముద్రంలోని ఇంట్లో కాపురం చేస్తున్న ప్రేమజంటకు మరణ శిక్ష పడనుందా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)