వీళ్ల గ్రీన్ మేనిఫెస్టోలో ఏముంది?

వీళ్ల గ్రీన్ మేనిఫెస్టోలో ఏముంది?

వాతావరణ మార్పులతో తలెత్తుతున్న కాలుష్యం, ప్రకృతి విపత్తుల కారణంగా భారత్‌లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2017లో భారత్‌లో కేవలం వాయు కాలుష్యం కారణంగానే దాదాపు 12.4 లక్షల మంది ప్రాణాలు విడిచారు.

అయినప్పటికీ రాజకీయ చర్చల్లో మాత్రం పర్యావరణ పరమైన అంశాలకు ఎప్పుడూ తగినంత చోటు దక్కడం లేదు. అందుకే, ముంబయిలో 27 స్వచ్ఛంద సంస్థలతో కూడిన ఒక బృందం ఈ ధోరణిని మార్చాలని ప్రయత్నిస్తోంది.

"యునైటెడ్ ఫర్ చేంజ్" అనే బ్యానర్‌తో ముంబయికి చెందిన కార్యకర్తలు, పౌరులు కలిసి ఒక గ్రీన్ మేనిఫెస్టో తయారు చేశారు. రోజురోజుకీ పెరిగిపోతున్న పర్యావరణ సమస్యలపై దృష్టి పెట్టాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

" పర్యావరణ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టేలా చెయ్యాలనేదే మా ప్రయత్నం. పర్యావరణం మన జీవితాలకు సంబంధించింది. అందుకే రాజకీయ వాదప్రతివాదాల్లో ఇవి కూడా భాగం కావాలి" యూర్ ఎన్విరాన్‌మెంట్ సొసైటీ సభ్యుడు రోహిత్ జోషి అన్నారు.

అడవుల నరికివేతను అడ్డుకుని, పర్యావరణాన్ని కాపాడేందుకు నాయకులు కృషి చేయాలని ఆదివాసీ కార్యకర్త ఆశా భోయే కోరుతున్నారు.

"ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో విచ్చలవిడిగా అడవులను నరికివేస్తున్నారు. అది ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తోంది. పర్యావరణానికి హాని చేస్తున్న పరిశ్రమలను, ప్రాజెక్టులను అటవీ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలి" అని ఆమె అంటున్నారు.

"మహాసముద్రాలు, కాల్వలు, మడ అడవులు, చిత్తడి నేలలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఆహారం, ఉపాధి లభించాలంటే వీటిని సంరక్షించుకోవడం చాలా అవసరం" అని స్థానిక స్థానిక మత్స్యకారుడు అన్నారు.

అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని దెబ్బతీసే ఆలోచనలను, ప్రకృతి వనరుల మీద ఆధారపడి జీవించే ప్రజలను నిర్వాసితుల్ని చేసే విధానాలను పాలకులు విడనాడాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.

"నగరాన్ని బాగు చేయాలన్నా, పౌరులకు రక్షణ కల్పించాలన్నా ప్రకృతిని కాపాడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. కానీ, రాజకీయ పార్టీలేవీ దీన్ని తమ అజెండాలో భాగం చేయడం లేదు" అని అటవీ సంరక్షకులు అమృత భట్టాచార్య విమర్శించారు.

"ఎటు చూసినా అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి అనే నినాదమే వినిపిస్తోంది. కానీ, పర్యావరణ అంశం మాత్రం అజెండాలో అట్టడుగు భాగాన ఉంది" అని ఘర్ బచావో ఘర్ బనావో ఆందోళన్ సభ్యుడు బిలాల్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మన వ్యవస్థ నిర్మాణంలో భాగంగా అడవులన్నీ ప్రభుత్వ ఆస్తిగా మారిపోయాయి. ప్రభుత్వాన్ని నడిపించేది రాజకీయ నాయకులు. కాబట్టి, వాళ్లు అడవుల్ని బేరానికి పెట్టేవాళ్లుగా కాకుండా, వాటి సంరక్షుకులుగా మారాల్సిన అవసరం ఉందని ఈ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)