శృంగారం తర్వాత పెళ్లి చేసుకోకుండా మాట తప్పితే అత్యాచారమేనా?

  • గీతా పాండే
  • బీబీసీ ప్రతినిధి
సింబాలిక్ ఇమేజ్

ఫొటో సోర్స్, Getty Images

ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని తన ప్రియురాలికి మాటిచ్చాడు. ఆ తరువాత వారిద్దరూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నారు. కానీ, ఆ వ్యక్తి మాట మార్చాడు. పెళ్లి చేసుకోనన్నాడు. ఇప్పుడు వారిద్దరి మధ్య జరిగిన శృంగారాన్ని అత్యాచారంగా పరిగణిస్తారా?

ఈ ప్రశ్నకు భారత సుప్రీం కోర్టు 'అవును' అనే సమాధానం ఇస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లో ఈ తరహా కేసులో ఓ వైద్యుడిని దోషిగా తేలుస్తూ ఓ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మహిళతో లైంగిక బంధాన్ని కొనసాగించిన ఆ వైద్యుడు ఆ తర్వాత మాట తప్పి మరొకరిని వివాహం చేసుకున్నట్లు తేలడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆయనకు ఉందన్న నమ్మకంతో సదరు మహిళ సెక్స్‌కు అంగీకారం తెలిపింది కాబట్టి దాన్ని నిజమైన అంగీకారంగా పరిగణించలేమని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎమ్ఆర్ షా వ్యాఖ్యానించారు.

శృంగారం విషయంలో భారత్ ఇంకా చాలా వరకూ సంప్రదాయ విధానాలనే పాటిస్తోంది. కన్యత్వానికి విలువ ఎక్కువ. ఎవరైనా మహిళ పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొన్నట్లు బయటపడితే ఆమెకు వివాహమవ్వడం కష్టం కావొచ్చు.

ఈ కేసులో నిందితుడికి ఆమెను పెళ్లి చేసుకునే 'ఉద్దేశం అసలే లేద'ని న్యాయమూర్తులు అన్నారు. ''మభ్యపెట్టి జరిపిన శృంగారాన్ని అంగీకారంతో కూడిందిగా పరిగణించకూడదు'' అని వ్యాఖ్యానించారు.

అయితే, ఆ వైద్యుడికి కింది కోర్టు వేసిన పదేళ్ల జైలు శిక్షను ఏడేళ్లకు తగ్గించారు.

ఇది అరుదైన కేసేమీ కాదు. ప్రభుత్వ నేర సమాచార రికార్డుల ప్రకారం 2016లో ''పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం'' ద్వారా జరిగిన అత్యాచారాలు 10,068 ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇలాంటి కేసులు 7,655 నమోదయ్యాయి.

ఈ మధ్య కాలంలోని కొన్ని 'పెళ్లి హామీ' కేసులు

  • 2019 ఏప్రిల్‌లో కర్నాటకలో ఇలాంటి కేసులో నిందితుడిని కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. పెళ్లికి ముందు బంధంలో ఉన్న విద్యావంతులైన మహిళలు.. సంబంధాలు బెడసికొట్టాక తమపై జరిగినది అత్యాచారమని అనలేరని కోర్టు పేర్కొంది. నిందితుడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
  • 2017లో సహోద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో కేరళలో ఓ సీనియర్ పాత్రికేయుడు అరెస్టయ్యారు. పోలీస్ నివేదికల ప్రకారం ఆరోపణలు చేసిన మహిళ, నిందితుడు ఏడాదికి పైగా బంధంలో ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన ఆయన తర్వాత మనసు మార్చుకున్నారు.
  • 2016లో దిల్లీలో స్కాట్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తనను ఐదు నెలల పాటు ఆయన లైంగికంగా వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో ఆయన బంధాన్ని తెంచేసుకున్నారని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

'పరిశీలనలో జాగ్రత్త'

అయితే ఇలాంటి కేసులను పరిశీలించేటప్పడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ట్రయల్ కోర్టులకు సూచించారు.

''బాధితురాలిని ఆ వ్యక్తి నిజంగానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? లేక ముందు నుంచీ దురుద్దేశాలతో ఉండి కోరిక తీర్చుకునేందుకే మోసపూరిత హామీ ఇచ్చారా? అన్నది జాగ్రత్తగా పరిశీలించాలి'' అని వ్యాఖ్యానించారు.

అంటే దీని అర్థం.. మహిళను పెళ్లి చేసుకునే ఉద్దేశం ముందుగా తనకు నిజంగానే ఉందని, ఆ తర్వాత మనసు మార్చుకున్నానని వ్యక్తి నిరూపించుకోగలిగితే అది అత్యాచారం కాదు. ఆరంభం నుంచీ ఆ వ్యక్తికి దురుద్దేశాలున్నాయని తేలితేనే అది అత్యాచారం అవుతుంది.

కానీ మనసులో ఉండే ఉద్దేశాన్ని బయటకు నిరూపించడం సులువు కాదు. అందుకే ఇలాంటి కేసుల ఫలితాలు చాలా వరకు న్యాయమూర్తుల విచక్షణపై ఆధారపడి ఉంటాయి. చట్టాలు దుర్వినియోగమయ్యే అవకాశమూ ఉంది.

'పెళ్లి హామీ - అత్యాచారం' కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంపై దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా రాణి 2017లో ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

'ప్రతీకారానికి వాడుకుంటున్నారు'

బంధాలు బెడసికొట్టినప్పుడు 'ప్రతీకారం' తీర్చుకునేందుకు అత్యాచార చట్టాలను మహిళలు వాడుకుంటున్నారని ఆమె అప్పుడు అన్నారు.

''పరస్పర అంగీకారంతో జరిగిన చర్యలను కొందరు ఆ తరువాత కోపంతోనో, అసహనంతోనో అత్యాచారాలుగా చూపుతారు. ఇలా చేయడం చట్టం అసలు ఉద్దేశాన్ని కాలరాయడమే. అత్యాచారం, పరస్పర అంగీకారంతో కూడిన శృంగారం మధ్య స్పష్టమైన గీత అవసరం. 'పెళ్లి హామీ' కేసులకు ఇది మరీ ముఖ్యం'' అని ఆమె వ్యాఖ్యానించారు.

సాధారణ లైంగిక బంధాలకు అత్యాచార చట్టాలను వర్తింపజేయకూడదన్నదే చాలా మంది భారతీయుల అభిప్రాయం. ముఖ్యంగా స్వతంత్రంగా ఉండే మహిళలు ఇష్టపూర్వకంగా ఓ బంధంలో అడుగుపెడుతున్నప్పుడు వాటిని ప్రయోగించకూడదని భావిస్తున్నారు.

న్యాయవ్యవస్థలోనూ చాలా మందికీ ఇదే అభిప్రాయం ఉంది. ఇలాంటి కేసుల్లో చాలా తక్కువ మంది దోషులుగా తేలుతుండటానికి కొంతవరకూ ఇది కూడా ఓ కారణం.

అయితే, ఫిర్యాదులు చేస్తున్నవారిలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు, సామాజికంగా వెనుకబడినవారు ఎక్కువగా ఉంటున్నారన్న విషయాన్ని విస్మరించకూడదని ముంబయికి చెందిన సీనియర్ న్యాయవాది ఫ్లేవియా ఆగ్నెస్ అంటున్నారు.

''మాయమాటలతో మహిళలను శృంగారంలోకి దింపి, గర్భం దాల్చాక ఆమెను వదిలేసే ఘటనలు చాలా జరుగుతుంటాయి. పరిహారం పొందేందుకు ప్రస్తుత న్యాయ విధానంలో బాధితులకు ఉన్న ఏకైక మార్గం అత్యాచార చట్టమే అయ్యుండొచ్చు. అందుకే ఇలాంటి కేసుల్లో కఠిన జైలు శిక్షలకు బదులుగా దోషులతో నష్ట పరిహారం, పుట్టిన పిల్లల బాగోగులకు అయ్యే ఖర్చులు ఇప్పించేలా ప్రత్యేక సెక్షన్‌ను తేవాలి'' అని ఆమె సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)