రసెల్: మూడు పరుగులు తప్ప మిగతావన్నీ సిక్సర్లు, ఫోర్లే

రసెల్

ఫొటో సోర్స్, facebook/kolkataknightriders

ఐపీఎల్-2019లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. ఆండ్రూ రసెల్ విధ్వంసం సృష్టించడంతో ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల మోత మోగింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతుల్లో నాలుగు సిక్సర్లతో 100 పరుగులు చేయడంతో రాయల్ చాలెంజర్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

కానీ, ఈ మ్యాచ్ చూసిన ప్రేక్షకులు మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ రసెల్ ఆటను బాగా ఎంజాయ్ చేశారు.

మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 213 పరుగులు చేయగా, లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం అంచుల వరకు వచ్చి 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఫొటో సోర్స్, facebook/kolkataknightriders

మ్యాచ్ చేజారినప్పటికీ కోల్‌కతా నైటర్ రైడర్స్ మాత్రం తన ఆటతో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాట్స్‌మన్లు నితీశ్ రాణా, ఆండ్రూ రసెల్ ఆటతో స్టేడియం దద్దరిల్లిపోయింది.

నితీశ్ రాణా 46 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి 184.78 స్ట్రైక్ రేట్‌తో 85 పరుగులు చేయగా, ఆండ్రూ రసెల్ అంతకుమించిన స్ట్రైక్ రేట్ 260తో 65 పరుగులు చేశాడు.

రసెల్ కేవలం 25 బంతుల్లో ఈ పరుగులు సాధించాడు. తాన సాధించిన 65 పరుగుల్లో 9 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

9 సిక్సర్లు అంటే 54 పరుగులు, 2 ఫోర్లు అంటే 8 పరుగులు కలిపి మొత్తం 62 పరుగులు రాబట్టాడు. 65 పరుగుల్లో 62 పరుగులు సిక్సర్లు, ఫోర్లతోనే సాధించాడు.

ఫొటో సోర్స్, facebook/kolkataknightriders

ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన రసెల్ అనంతరం మరో ఓవర్‌లోనూ వరుసగా మూడు సిక్స్‌లు కొట్టడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధ్యమే అన్నంతగా ఆ జట్టు అభిమానుల్లో ఉత్సాహం ఏర్పడింది.

ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 24 పరుగులు చేస్తే విజయం సాధిస్తారన్న పరిస్థితుల్లో ఓ సిక్సర్ బాదినా ఆ తరువాత రసెల్ అవుట్ అయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో మ్యాచ్‌ను కోల్పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)