రోహిత్ శేఖర్‌: ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్‌డీ తివారీ కుమారుడి హత్య కేసు.. భార్యను ప్రశ్నిస్తున్న పోలీసులు

తివారీ, రోహిత్ శేఖర్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2014లో రోహిత్ శేఖర్‌ను తివారీ తన కుమారుడిగా అంగీకరించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ కుమారుడి రోహిత్ శేఖర్‌ది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలిన తర్వాత దిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

కేసు విచారణలో భాగంగా రోహిత్ భార్యను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ శనివారం ఉదయం తెలిపింది.

గొంతు నులమడం, ఊపిరి ఆడకుండా చేయడం వల్ల రోహిత్ చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలిందని ఏఎన్‌ఐ పేర్కొంది. శుక్రవారం కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల(సీఎఫ్‌ఎస్‌ఎల్) బృందం దిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉన్న రోహిత్ ఇంటికి వచ్చి ఆధారాలను సేకరించిందని తెలిపింది.

ఆయన ఈ నెల 16న చనిపోయారు. హత్య కేసు గురువారం నమోదైంది.

కాగా ఈ కేసులో రోహిత్ తల్లి ఉజ్వల తన కోడలిపై అనుమానం వ్యక్తంచేశారు. పెళ్లయిన తొలి రోజు నుంచి రోహిత్, ఆయన భార్య మధ్య సఖ్యత లేదని ఆమె అన్నారంటూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

తివారీ ఏపీ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే...

తన తండ్రి తివారీయేనని నిరూపించేందుకు రోహిత్ గతంలో సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. 2007-09 మధ్య తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే, రోహిత్ తాను ఆయన కుమారుడినంటూ ముందుకు వచ్చారు. దీన్ని తివారీ ఖండించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తల్లిదండ్రులు ఉజ్వల, తివారీలతో రోహిత్ శేఖర్

తివారీపై 2008లో రోహిత్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో తివారీకి డీఎన్‌ఏ పరీక్షలు జరిపి రోహిత్ తండ్రి ఆయనేనని నిర్ధరించారు.

తివారీ తొలుత కాదంటూ వచ్చినా 2014లో రోహిత్‌ను తన కుమారుడిగా అంగీకరించారు.

అనంతరం కొద్ది నెలలకే శేఖర్ తల్లి ఉజ్వల శర్మను ఆయన పెళ్లి చేసుకొని భార్యగా స్వీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ వివాహం చేసుకునేనాటికి తివారీ వయసు 88 సంవత్సరాలు.

తివారీ అనారోగ్యంతో నిరుడు అక్టోబరు 18న కన్నుమూశారు. ఆయన పుట్టినరోజు కూడా అదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)