లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’

విజయ్ ప్రకాశ్ ఖండేకర్

ఫొటో సోర్స్, OMKAR KHANDEKAR

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ, కొందరు స్వతంత్ర అభ్యర్థులు వెలుగులోకి వస్తుంటారు. ప్రజాస్వామ్య దేశంలో పోటీ చేసే అవకాశాన్ని వినియోగించుకుంటుంటారు. అలా... ఎన్నికల్లో 24 సార్లు పోటీ చేసి ఓడిపోయి, ఇరవై ఐదోసారి పోటీకి సిద్ధమైన వ్యక్తి గురించి ఓంకార్ ఖండేకర్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

పుణేలోని శివాజీ నగర్‌లో విజయ్ ప్రకాశ్ ఖండేకర్ చాలా ఫేమస్. 73ఏళ్ల విజయ్ ప్రకాశ్ గత రెండు నెలలుగా తన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

''ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పార్టీలతో ముడిపడిన రాజకీయాలొక్కటే మార్గం కాదు అని ప్రజలకు చెప్పడమే నా ఉద్దేశం'' అని విజయ్ అంటారు.

''నాలాంటి స్వతంత్ర అభ్యర్థులను దేశానికి అందివ్వాలని నా కోరిక. దేశంలో అవినీతిని అంతం చేయడానికి అదొక్కటే మార్గం.''

ఎంపీ అభ్యర్థిగా విజయ్ పోటీ చేస్తున్న నియోజకవర్గానికి మూడో విడతలో భాగంగా ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయ్... ఏదో ఒక రోజు తాను దేశ ప్రధాని అవుతానని ఆశిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే, భారత పౌరులందరికీ 17వేల రూపాయలు ఇస్తానని అంటున్నారు. అలా ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఇతరత్రా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం.

1980 దశకం చివరివరకూ విజయ్ మహరాష్ట్ర విద్యుత్ శాఖలో పని చేసేవారు. ఇప్పుడు పుణే వీధుల్లో ఒక బండి తోసుకుంటూ కనిపిస్తున్నారు. గతంలో తన బండిపై, చందాలు ఇవ్వాలన్న బోర్డు కనిపించేదని స్థానికులు చెప్పారు.

కానీ ఇప్పుడు ఆ బోర్డుపై 'బూటు గుర్తుదే విజయం' అని ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం విజయ్ ఖండేకర్‌కు బూటు గుర్తును కేటాయించింది.

ఫొటో సోర్స్, OMKAR KHANDEKAR

రోడ్డుపై ప్రచారం చేస్తున్నపుడు చాలా మంది ఆయన్ను పట్టించుకోరు. కొందరు దగ్గరకొచ్చి, సెల్ఫీలు తీసుకోవచ్చా అని అడుగుతారు. సోషల్ మీడియాలో ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని ఆయన కూడా సెల్ఫీల కోసం ఇష్టంగా ఒప్పుకుంటారు.

మండుటెండలో ప్రచారం చేస్తున్న ఈ బక్కపలచని ముసలాయనను చూసి చాలామంది ఎగతాళి చేస్తారు.

కానీ, విజయ్ ఖండేకర్... స్థానిక ఎన్నికల నుంచి పార్లమెంట్ వరకు, భారత రాజకీయ విధానంలోని అన్ని ఎన్నికల్లో 24సార్లు పోటీ చేసి ఓడిపోయారని వారికి తెలియదు.

దేశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వందలాది స్వతంత్ర అభ్యర్థుల్లో విజయ్ ఒకరు. 2014 ఎన్నికల్లో 3వేల మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తే, గెలిచింది కేవలం ముగ్గురు మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images

1957 ఎన్నికల్లో 42మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. ఇది చాలా అరుదు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల నుంచి లెక్కవేస్తే, ఇప్పటిదాకా మొత్తం 44,962మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. కానీ వారిలో గెలిచింది మాత్రం 222మంది మాత్రమే.

స్వతంత్ర అభ్యర్థులు గెలవడం చాలా కష్టం. రాజకీయ పార్టీలకున్న వనరులు వీరికి ఉండవు. భారత్‌లో మొత్తం 2,293 రాజకీయ పార్టీలు రిజిస్టరై ఉన్నాయి. వీటిలో 7 జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

ఎన్నికల నిబంధనల ప్రకారం, ఈవీఎం మిషీన్‌పై అభ్యర్థుల వరుస క్రమంలో మొదట జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు, తర్వాత ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, వారి కింద స్వతంత్రుల పేర్లు ఉంటాయి.

ఈ విషయం గురించి విజయ్ మాట్లాడుతూ, 'వరుస క్రమంలో అందరికంటే కిందున్న అభ్యర్థికే మీ ఓటు' అని ప్రజలను కోరుతున్నారు. వరుసక్రమంలో తన పేరు అందరికంటే చివర ఉండటానికి తన ఇంటి పేరును జ్న్యోషో(Znyosho)గా మార్చుకున్నారు.

స్వతంత్ర అభ్యర్థులందరికింటే చివర ఉండాలని తన ప్రయత్నం. అక్షర క్రమంలో చివర అయితే వరుస క్రమంలో కూడా చివరగా ఉండాలని ఆయన ఆలోచన.

ఫొటో సోర్స్, Getty Images

స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసేవారు భిన్నరకాలు. కొందరు ఓట్లు చీల్చడానికి పోటీ చేస్తే, కె.పద్మరాజన్‌ లాంటివారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం పోటీ చేస్తారు. పద్మరాజన్ ఇంతవరకూ 170కుపైగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా పద్మరాజన్ ఎన్నికల బరిలోఉన్నారు. ఈమధ్య పద్మరాజన్ మాట్లాడుతూ, 'ఈ ఎన్నికల్లో గెలిస్తే, నాకు గుండెపోటు వస్తుందేమో...' అన్నారు.

ఇలాంటి స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేయకుండా నిషేధం విధించాలని కూడా ఒక ప్రతిపాదన ఉంది కానీ అది కార్యరూపం దాల్చలేదు. రానురానూ దేశంలో స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది కానీ, గెలుపు శాతం మాత్రం పెరగడం లేదు.

రాజకీయ పార్టీలతో పోలిస్తే, స్వతంత్ర అభ్యర్థులకు కొన్ని విధానపరమైన సమస్యలున్నాయని 'అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్' వ్యవస్థాపకుడు జయ్‌దీప్ ఛోకర్ అన్నారు. రాజకీయ పార్టీలకున్న ఆదాయపన్ను మినహాయింపులు స్వతంత్ర అభ్యర్థులకు ఉండవు అని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

''మార్పు కోసం సీరియస్‌గానే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఉన్నారు. కానీ వారికి అందే విరాళాల్లో పరిమితి, ఆదాయపన్ను మినహాయింపులు లేకపోవడం, ఒక వ్యక్తిపై కాకుండా పెద్దపెద్ద రాజకీయ పార్టీల పట్ల ప్రజల మక్కువ... లాంటిం అంశాలు స్వతంత్ర అభ్యర్థులపై ప్రభావం చూపుతాయి'' అని జయ్‌దీప్ అన్నారు.

తాను గెలవనని విజయ్‌కు ఓ స్పష్టత ఉంది. ఇన్నేళ్లూ తన ప్రచారం కోసం, పెద్దల నుంచి సంక్రమించిన వారసత్వ భూమిని, ఒక ఇంటిని అమ్మేశారు.

ప్రస్తుతం తన ఆదాయం, 1,921రూపాయల పెన్షన్ మాత్రమేనని నామినేషన్ సందర్భంగా ఆయన వెల్లడించారు.

ఓడిపోతానని తెలిసినా, తన ప్రయత్నాన్ని విరమించేదిలేదని విజయ్ ప్రకాశ్ ఖండేకర్ అంటున్నారు. ఈవిషయమై మాట్లాడుతూ ఏమన్నారంటే,

''రాజకీయ పార్టీల ఇనుప కత్తికి, నా పేపర్ కత్తికి మధ్య ఈ పోరాటం. కానీ నేను ప్రయత్నించడం మానను. బహుశా ఇవే నాకు చివరి ఎన్నికలు కావొచ్చు. కానీ ఈసారి పరిస్థితి ముందులా ఉండదని భావిస్తున్నా.''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)