సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. భారీ కుట్ర ఉందన్న సీజేఐ

జస్టిస్ రంజన్ గొగోయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జస్టిస్ రంజన్ గొగోయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఆరోపణలు చేయగా, వీటిని జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు.

"న్యాయవ్యవస్థ స్వతంత్రతకు చాలా తీవ్రమైన ముప్పు ఎదురవుతోంది. (ఈ ఫిర్యాదు వెనక) న్యాయవ్యవస్థను అస్థిరపరిచే భారీ కుట్ర ఉంది'' అని ఆయన చెప్పారు.

శనివారం సెలవు రోజైనప్పటికీ ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అత్యవసర విచారణ జరిపిందని సీనియర్ జర్నలిస్టు సుఫా మొహంతి తెలిపారు. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని ఇతర న్యాయమూర్తులు.

ఫిర్యాదు చేసిన మహిళ వెనక ఓ బలమైన శక్తి ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులు పనిచేయాల్సి వస్తే, మంచివారెవరూ ఈ బాధ్యతలను చేపట్టరని చెప్పారు.

ఇది దేశ ప్రజానీకానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయమని, అందువల్ల దీనిపై విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శనివారం సుప్రీంకోర్టులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వునూ జారీచేయలేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు, ఈ నిరాధార ఆరోపణలపై వార్తలు అందించే విషయంలో సంయమనం పాటించాలని మీడియాకు సూచించింది.

నేరచరిత్ర కారణంగా సదరు మహిళ నాలుగు రోజులు జైల్లో ఉన్నారని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. వ్యవహార తీరును సరిచేసుకోవాలని ఆమెకు పోలీసులు సూచించారని చెప్పారు.

జస్టిస్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని సుప్రీంకోర్టు సదరు మాజీ ఉద్యోగిని తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఆరోపణలతో మొత్తం 22 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు శుక్రవారం (ఏప్రిల్ 19) ఆమె లేఖ రాశారు.

ఈ విషయాన్ని కొన్ని ఆన్‌లైన్ మీడియా సంస్థలు పబ్లిష్ చేశాయి.

ఆ మహిళ రాసిన లేఖలో ఏముందంటే..

తాను 2014 మే 1 నుంచి 2018 డిసెంబరు 21 వరకు సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్‌గా పనిచేశానని ఆమె తన లేఖలో చెప్పారు.

"డిసెంబరులో నన్ను ఉద్యోగంలోంచి అర్ధంతరంగా తొలగించారు. అదే నెలలో దిల్లీ పోలీసు విభాగంలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నా భర్త, ఆయన సోదరుడిని సస్పెండ్ చేశారు. 2018 అక్టోబరులో సుప్రీంకోర్టులో గ్రూప్-డీ కేటగిరీలో ప్రధాన న్యాయమూర్తి విచక్షణ కోటా కింద ఉద్యోగం పొందిన నా భర్త మరో సోదరుడిని కూడా ఈ ఏడాది జనవరిలో ఏ కారణం చెప్పకుండా తొలగించారు. మార్చి 3న నాపై ఒక పసలేని, తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పించేందుకు 2017లో సుప్రీంకోర్టు ప్రాంగణంలో హరియాణాలోని ఝజ్జర్‌కు చెందిన నవీన్ అనే వ్యక్తి నుంచి నేను రూ.50 వేల అడ్వాన్సు తీసుకొన్నాననే ఆరోపణలపై దీనిని నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రాతిపదికగా అదే రోజు (మార్చి 3) రాత్రి నన్ను అరెస్టు చేశారు. నా భర్తను అరెస్టు చేయకపోయినా, ఆయన్ను పోలీసు కస్టడీకి తీసుకొని కొట్టారు. నన్ను ఒక రోజు పోలీసు కస్టడీలో, ఇంకో రోజు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. తర్వాత నేను బెయిలు పొందాను. తర్వాత నా బెయిలు రద్దుకు పోలీసులు దరఖాస్తు దాఖలు చేశారు" అని ఆమె చెప్పారు.

"జస్టిస్ గొగోయ్ లైంగిక ఆసక్తి పట్ల నేను సానుకూలత వ్యక్తంచేయనుందుకే నన్ను, నా కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారు. నా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థించడం తప్ప నాకు మార్గం లేదు. నా ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఆమె తెలిపారు.

సీనియర్ న్యాయవాది రెబెకా మమ్మెన్ జాన్ ఈ అంశంపై ఫేస్‌బుక్‌లో స్పందించారు.

ఫొటో సోర్స్, Facebook

"ఒక మహిళ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆరోపణల్లో నిజానిజాలు తేలాల్సి ఉంది. ఫిర్యాదుపై తదుపరి చర్యలను నిర్ణయించేందుకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక విచారణ చేపట్టి, ఈ ఫిర్యాదు వెనక కుట్ర ఉందని ఆరోపించడం ద్వారా ఫిర్యాదును పక్కనబెట్టేసినట్లైంది. మీరు నాయకత్వం వహిస్తున్న వ్యవస్థ స్వతంత్రతకు మీరే భంగం కలిగించారు" అని సీజేను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.

గత సంవత్సరం జనవరిలో సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తీరును తప్పుబడుతూ మీడియా సమావేశం నిర్వహించిన నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరు. న్యాయవ్యవస్థను సంరక్షించుకోలేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)