ఒడిశాలో నవీన్ పట్నాయక్ అయిదోసారి అధికారంలోకి వస్తారా?

  • నితిన్ శ్రీవాస్తవ
  • బీబీసీ ప్రతినిధి
కేసీఆర్, నవీన్ పట్నాయిక్

ఫొటో సోర్స్, Bjd

ఒడిశాను గత 19 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ పాలిస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి, ఒడిశా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన నవీన్ పట్నాయక్ ప్రాభవం ఇంకా అలాగే ఉందా? ఆయన సుదీర్ఘ పాలనపై ఆ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు?

భువనేశ్వర్‌ నగరం నుంచి కొద్ది దూరంలో ఓ జంట... పెరుగుతున్న ధరలు, కుటుంబ పోషణ గురించి మాట్లాడుతోంది. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మానస్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన మార్పులను దగ్గరగా పరిశీలించారు.

నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యాక తమ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మానస్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Bjd

"గతంలో ఇక్కడ చాలా కాలంపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ, వారి పాలనలో అభివృద్ధి జరగలేదు.

వాళ్లు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు. తరువాత నవీన్ పట్నాయక్ వచ్చారు.

కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి లేనందువల్లే ప్రజలు నవీన్‌ను గెలిపించుకున్నారు.

ఆయన వచ్చాక భువనేశ్వర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాలూ అభివృద్ధి చెందాయి. ప్రజల బాగోగులు పట్టించుకున్నారు" అని మానస్ వివరించారు.

వీడియో క్యాప్షన్,

నవీన్ ఈ ఎన్నికల్లో ఎందుకు అంతగా శ్రమించాల్సి వస్తోంది?

గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ మంచి మెజారిటీతో గెలిచారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పార్టీకి, రాజకీయాలకు నవీన్ ముఖచిత్రంగా మారిపోయారు.

మేము బీజేడీ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాం. ఎన్నికల సమయంలోనూ అది ఖాళీగా కనిపిస్తోంది. ఎందుకంటే హడావుడంతా నవీన్ పట్నాయక్ ఇంట్లోనే ఉంటుంది.

ఆయన ఇప్పుడు పార్టీలోనే కాదు ఒడిశాలోనే తిరుగులేని నేతగా ఉన్నారు. కానీ, తనకున్న ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికల్లో ఆయన చాలా శ్రమించాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, WITTER@NAVEEN_ODISHA

రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలతో పాటు, అసెంబ్లీలోనూ బీజేడీకి మంచి పట్టుంది. కానీ, సుదీర్ఘ పాలనలో ఆయన ఏం చేశారన్నదే అసలు ప్రశ్న.

"గత 19 ఏళ్లలో బీజేడీ అనేక అభివృద్ధి పనులు చేసింది. మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం.

యువత, మహిళలు, రైతులు అందరినీ కలుస్తున్నాం. ఒడిశా ప్రజల కోసం బిజూ జనతాదళ్ ఎంతో చేసింది" అని ఆ పార్టీ నేత మానస్ సస్మిత్ పాత్రా చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER@NAVEEN_ODISHA

అయితే, ప్రస్తుతం అంతా సవ్యంగా ఉన్నట్టయితే కనిపించడం లేదు. ప్రజల్లో కొంత ఆగ్రహం కూడా ఉంది.

"విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు... ఇవే మాకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నాలుగు సార్లు ఎన్నికైనప్పటికీ ఈ ప్రభుత్వం వీటిని పరిష్కరించలేకపోయింది" అని స్థానికుడు ప్రఫుల్ కుమార్ సాహు అన్నారు.

"ఈ ప్రాంతంలో రోడ్లు బాగానే ఉన్నాయి. కానీ, తాగునీటికి సమస్యగా ఉంది. సాగునీటి వ్యవస్థ లేదు. ఇక్కడ ఏటా ఒక పంటకే నీళ్లు వస్తున్నాయి. సాగునీటి సౌకర్యం ఉంటే 2 పంటలు పండించవచ్చు" అని సంతోష్ మొహంతి చెప్పారు.

ఫొటో సోర్స్, twitter/Naveen_Odisha

72 ఏళ్ల నవీన్ పట్నాయక్ ఈ ఎన్నికల్లో ఎందుకు అంతగా శ్రమించాల్సి వస్తోంది?

"నవీన్ పట్నాయక్‌ పట్ల కొంత వ్యతిరేకత ఉంది. ఆయన నోటి నుంచి ఈ మాట మొట్టమొదటిసారి వినవచ్చింది.

ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు మనం చాలా కష్టపడాలని తన పార్టీ శ్రేణులతో ఆయన అన్నారు.

రోడ్డు మార్గాన 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగినపుడు నాలుగు సార్లు గెలిచాను కాబట్టి ఐదోసారి కష్టపడక తప్పదని ఆయనే అంటున్నారు.

అంటే, ఈసారి తనకు కష్టాలు తప్పవన్న విషయం ఆయనకూ తెలుసు" అని భువనేశ్వర్‌కు చెందిన సీనియర్ పాత్రికేయులు కస్తూరి రే అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Bjd

వయో భారం పెరుగుతున్నప్పటికీ గత రెండేళ్లలో ఓటర్లకు దగ్గరయ్యేందుకు నవీన్ పట్నాయక్ చాలనే కష్టపడ్డారు. మరి, ఆయన శ్రమ ఫలిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొద్ది వారాలు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.