లోక్‌సభ ఎన్నికలు 2019: పదేపదే విజృంభిస్తున్న నకిలీ వార్తలు
- రియాలిటీ చెక్ బృందం
- బీబీసీ న్యూస్

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ఊపందుకుంది. వచ్చే అయిదేళ్లు అధికార పీఠంపై ఎవరుండాలో ప్రజలు నిర్ణయించే సుదీర్ఘ ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియాలో బూటకపు సమాచారం తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.
ఎన్నికలు జరుగుతున్న వేళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నకిలీ సమాచారాన్ని గుర్తించడం పెను సవాల్‌గా మారుతోంది.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న నకిలీ వార్తలను గుర్తించేందుకు పలు ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు, సోషల్ మీడియా గ్రూపులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినా, తీవ్రస్థాయిలో బూటకపు సమాచారం వ్యాప్తి చెందుతూనే ఉంది.
కొత్తగా నకిలీ వార్తలను ప్రచారం చేయడంతో పాటు, కొన్నేళ్ల క్రితం నకిలీదని తేల్చి చెప్పిన సమాచారాన్ని కూడా కొందరు ఇప్పుడు మళ్లీ వ్యాప్తి చేస్తూనే ఉన్నారు.
బీబీసీ రియాలిటీ చెక్ బృందం అలాంటి కొన్ని తప్పుదోవ పట్టించే పోస్టులను గుర్తించింది.
సోనియా గాంధీ, బ్రిటన్ రాణి
బ్రిటన్ రాణి కంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీనే సంపన్నురాలు అంటూ ఓ బూటకపు కథనం సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ అవుతోంది. అయితే, ఆ కథనంలో వాస్తవం లేదని ఆరేళ్ల క్రితమే వెల్లడైంది.
ఆర్థిక అసమానత అనేది అధిక భావోద్వేగపూరితమైన అంశంగా ఉన్న దేశంలో ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన కథనాలు ఆయా వ్యక్తుల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రతిష్ఠను అలాంటి విషయాలు తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ఈ తప్పుడు కథనం తొలుత 2012లో పత్రికల్లో వచ్చింది.
2013లో హఫ్ఫింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రపంచంలో అత్యంత సంపన్న నాయకుల జాబితాలో సోనియా గాంధీ పేరును కూడా ప్రచురించింది. కానీ, సోనియా గాంధీ ఆస్తులకు సంబంధించిన అంకెలపై ప్రశ్నలు వ్యక్తమవడంతో ఆమె పేరును తొలగించింది.
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ.. తన వ్యక్తిగత ఆస్తులు విలువ రూ.9 కోట్లుగా అఫిడవిట్‌లో ప్రకటించారు. దాని ప్రకారం, సోనియా గాంధీ కంటే బ్రిటన్ రాణి ఆస్తుల అంచనా విలువ ఎన్నో రెట్లు ఎక్కువ.
అయినా, రాణి కంటే సోనియా గాంధీనే ధనవంతురాలుగా పేర్కొంటూ తప్పుడు కథనాన్ని ఈ ఎన్నికల సమయంలోనూ పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఆ కథనాన్ని షేర్ చేశారు.
అంతేకాదు, సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ "ఆమె ఒక యువతిగా ఎలా అందంగా తయారయ్యారో చూడండి" అంటూ, ఆమె నైతిక విలువలను ప్రశ్నిస్తూ నకిలీ ఫొటోలను వ్యాప్తి చేశారు. కానీ, ఆ ఫొటోలు హాలీవుడ్ తారలవి. వారితో సోనియా గాంధీకి ఎలాంటి సంబంధం లేదు.
మోదీ విద్యార్హతలు
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన మరో కథనం సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ అవుతోంది.
తాను డిగ్రీ, పీజీ పూర్తి చేశానని మోదీ చెబుతున్నారు.
అయితే, హైస్కూల్ (పదో తరగతి)కు మించి చదవలేదని నరేంద్ర మోదీ చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఆ వీడియోను కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేస్తున్నారు.
ఓ పాత ఇంటర్వ్యూ నుంచి కత్తిరించిన వీడియో క్లిప్ అది. ఆ పూర్తి ఇంటర్వ్యూలో తాను పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు పూర్తి చేశానని మోదీ స్పష్టంగా చెప్పారు.
కానీ, పదో తరగతి పూర్తి చేశానన్న మాట వరకు మాత్రమే ఆ వీడియోను కత్తిరించి ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌లో ఇప్పటికీ వ్యాప్తి చేస్తున్నారు.
నకిలీ సర్వేలు
నకిలీ సర్వే రిపోర్టులు, తమ నేతలకు ఏవేవో పురస్కారాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు.
ప్రపంచంలోనే నరేంద్ర మోదీ అత్యుత్తమ ప్రధాన మంత్రిగా ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రకటించిందంటూ ఒక కథనం చక్కర్లు కొడుతోంది.
అది పూర్తి అవాస్తవం. యునెస్కో ఇచ్చే అవార్డుల్లో అలాంటివేమీ లేవు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోని అత్యంత అవినీతిమయమైన నాలుగో పార్టీ అంటూ బీబీసీ సర్వేలో వెల్లడైందంటూ ఓ నకిలీ కథనాన్ని కొందరు వ్యాప్తి చేస్తున్నారు.
అంతేకాదు, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని బీబీసీ అంచనావేసిందంటూ కొన్ని బూటకపు కథనాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తుందని బీబీసీ అంచనా వేసిందంటూ మరో నకిలీ పోస్టు కూడా వ్యాప్తి చెందుతోంది.
భారత్‌లో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు చేయలేదని బీబీసీ స్పష్టంగా చెప్పింది.
ఫొటో సోర్స్, Getty Images
నకిలీ వేళ్లు
ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా అనేక రకాల వదంతులు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల దొంగ ఓట్లు వేసేందుకు, ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేసేందుకు కొందరు ప్లాస్టిక్ వేళ్లు ధరిస్తున్నారంటూ బూటకపు వదంతులు వ్యాప్తి చెందాయి. ఫేస్‌బుక్, ట్విటర్‌లో కొన్ని ప్లాస్టిక్ వేళ్ల తొడుగుల చిత్రాలు షేర్ చేశారు.
ఇవే చిత్రాలను 2017లో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలప్పుడు కూడా వ్యాప్తి చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం శరవేగంగా పెరుగుతోంది.
సమస్యకు పరిష్కారం ఏంటి?
నకిలీ వార్తలను గుర్తించేందుకు కొన్ని సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.. కానీ, అది అంత సులువైన పనికాదు.
నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నా, ప్రైవేటు వేదికల్లో వాటి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదని మెల్‌బోర్న్‌కు చెందిన ప్రొఫెసర్ ఉషా రోడ్రిగెస్ అంటున్నారు. సోషల్ మీడియా, భారత్ రాజకీయాల మీద ఉషా అధ్యయనం చేస్తున్నారు.
"ఒక కథనాన్ని నమ్ముతున్నవారికి అది నకిలీదా? అన్న అనుమానం చాలావరకు రాదు. ఒక విషయం నకిలీదని తేల్చినప్పటికీ, దాన్ని మరో రూపంలో ఆయా వ్యక్తులు మళ్లీ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తారు" అని ఉషా వివరించారు.
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారమూ వాస్తవమైనదిగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
"తాము చూస్తున్నది నిజమేనని నమ్మిన వీడియోలను" వెంటనే ఇతరులతో పంచుకునేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తారని 'ఇండియా కనెక్టెడ్: మ్యాపింగ్ ది ఇంప్యాక్ట్ ఆఫ్ న్యూ మీడియా' పుస్తకం సహ రచయిత షాలినీ నారాయణ్ చెప్పారు.
నకిలీవని తేల్చిన వార్తలను నియంత్రించడంలో ఆన్‌లైన్ సెర్చింజన్లు మెరుగ్గా పనిచేయవచ్చు, కానీ ప్రైవేటు గ్రూపుల్లో ఉండేవారికి ఆ విషయం తెలియకపోవచ్చునని ఉషా అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- రియాలిటీ చెక్: అరవింద్ కేజ్రీవాల్ పోర్న్ వీడియో చూశారా, అసలు నిజమేంటి?
- ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ విజయవంతమా కాదా: రియాలిటీ చెక్
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- రియాలిటీ చెక్: బుల్లెట్ రైలు గడువులోగా పట్టాలెక్కుతుందా?
- హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
- ప్రధాని మోదీ మాట నిజమేనా? మిగతా వారికన్నా ఎక్కువ విమానాశ్రయాలు కట్టించారా?
- గ్యాస్ కనెక్షన్ ఉన్నా వీళ్లు కట్టెల పొయ్యే వాడుతున్నారెందుకు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)