ఐక్యూ తక్కువని వైద్యులు చెప్పారు... ఆ అమ్మాయే ఒలింపిక్స్‌ పతకాలు తెచ్చింది

ప్రియాంక, స్పెషల్ ఒలింపిక్స్
ఫొటో క్యాప్షన్,

స్పెషల్ ఒలింపిక్స్‌లో ప్రియాంక మూడు పతకాలు సాధించారు.

చిన్నప్పుడు మాటలు చాలా ఆలస్యంగా వచ్చాయి. చదువులోనూ వెనకబడింది. ఈ అమ్మాయిలో తెలివితేటల స్థాయి తక్కువగా ఉందని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ అమ్మాయే భారత్‌కు స్కేటింగ్‌లో మూడు పతకాలు తెచ్చిపెట్టింది.

దిల్లీకి చెందిన ఈ అమ్మాయి పేరు ప్రియాంక.

ఇటీవల యూఏఈలోని అబుదాబిలో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌ పోటీల్లో బంగారు, వెండి, రజతం... మొత్తం మూడు పతకాలు సాధించింది.

"నాకు స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. స్కేటింగ్ చేస్తుంటే నాకు గాల్లో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది" అంటుంది ప్రియాంక.

ఆ టోర్నీలో భారత్ 368 పతకాలు సాధించింది.

"నేను స్కేటింగ్‌ను టీవీలో చూశా. బాగా నచ్చింది. నేనూ చెయ్యాలనుకున్నా. నేర్చుకుంటానని అమ్మకు చెప్పాను. నేనూ దీనిలో ఎదగాలనుకున్నా" అని ప్రియాంక తెలిపింది.

వీడియో క్యాప్షన్,

స్పెషల్ ఒలింపిక్స్: మూడు పతకాలు సాధించిన ప్రియాంక

"ప్రియాంక మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు దీని గురించి చాలా కొద్దిగానే తెలుసు. కానీ, ఆమెకు పట్టుదల, తపన చాలా ఎక్కువ. అందుకే నేను ఆమెకు స్కేటింగ్ నేర్పించగలిగాను" అని ఆమెకు శిక్షణ ఇస్తున్న ప్రభాత్ శర్మ వివరించారు.

"ప్రియాంక పుట్టినప్పుడు అంతా బానే ఉంది. కానీ మాటలు చాలా ఆలస్యంగా వచ్చాయి. ఆమె మాటలు ఎవరికీ అర్థమయ్యేవి కాదు. దీంతో చదువులో కూడా వెనకబడింది. ఈ అమ్మాయి ఐక్యూ తక్కువగా ఉంది అని నాకో సర్టిఫికెట్ ఇచ్చారు. నేను భారత్ తరపున ఆడతాను అని ఓరోజు ప్రియాంక నాతో అంది. దీంతో ఆమె ఆసక్తిపై నేను దృష్టి పెట్టాను. అది ఆమె కల. అది ఎలాగైనా నెరవేరాలనుకున్నా" అని ప్రియాంక తల్లి అనురిత దివాన్ చెప్పారు.

సాధారణ పిల్లలకు ఐక్యూ 80-85 మధ్య ఉంటుంది. కానీ, ప్రియాంక ఐక్యూ 65-70 మధ్య ఉంది. ఏకాగ్రతతో ఈ క్రీడను నేర్చుకోవడం ప్రియాంకకు అంత ఈజీ ఏమీ కాలేదు. దాంతో ఆమెకోసం కోచ్ ఓ ప్రత్యేక పద్ధతిని రూపొందించారు.

"ఇలాంటి పిల్లలకు చాలా ఏకాగ్రత కావాలి. అదే పెద్ద ఛాలెంజ్. కార్ల్ సిస్టమ్ అనే ఓ పద్ధతిలో ఆమెలో ఏకాగ్రతను పెంచేందుకు ప్రయత్నించా. ఎరుపు రంగును అనుసరించాలి అనేది వాళ్లకు అర్థమయ్యేలా చెయ్యాలి. ఎరుపు రంగు యాంక్లెట్‌ (కాళ్లకు తొడుక్కునేది) తీసుకుని మళ్లీ నా దగ్గరకు రావాలి అని చెప్పేవాడిని. అలా కొన్నాళ్లకు ఆమె నా ఆదేశాలు పాటించడం మొదలెట్టింది" అని కోచ్ ప్రభాత్ శర్మ గుర్తు చేసుకున్నారు.

"పడుతూ ఉంటేనే మళ్లీ లేవగలం. దీని గురించి బాధపడకూడదు. పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేవడానికి ప్రయత్నించండి" అంటోంది ప్రియాంక.

(వీడియో : గుర్‌ప్రీత్ సైనీ, మనీష్ జలూయ్)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)