సీజేఐ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. విచారణ సాగాల్సిన తీరుపై ఉదయించిన ప్రశ్నలు

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌

ఫొటో సోర్స్, Reuters

భారత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. చట్ట ప్రకారం వీటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

అత్యవసరంగా త్రిసభ్య ధర్మాసన సమావేశం ఏర్పాటు చేసి తనపై వస్తున్న ఆరోపణలను గొగోయ్ ఖండించారు.

అయితే, ఇలా విచారణ చేపట్టడం లైంగిక వేధింపుల ఫిర్యాదు విషయంలో పాటించాల్సిన ప్రక్రియను ఉల్లంఘించడమే అవుతుందని చాలా మంది మహిళా న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.

లైంగిక వేధింపుల కేసుల్లో సంబంధిత వ్యక్తుల పేర్లను బయటకు వెల్లడించకూడదని, అయితే దీన్ని ఉల్లంఘిస్తూ పేర్లు బయటకు వచ్చాయని విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

గొగోయ్‌కి ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న మహిళ ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

22 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఆ మహిళ లేఖ రాశారు. తన ఆరోపణలపై విచారణ కోసం విశ్రాంత సుప్రీం న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీని వేయాలని అందులో అభ్యర్థించారు.

నిందితుడిగా భారత చీఫ్ జస్టిస్ పేరును పేర్కొనడం, గొగోయ్ త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసి ఆదేశాలు ఇవ్వడం, లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు సుప్రీంలో కమిటీ ఉన్నప్పటికీ ప్రత్యేక కమిటీ వేయాలని ఆ మహిళ కోరడం.. ఇవన్నీ ఎంతవరకూ సమ్మతమైనవి?

'పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం' ఇలాంటి ఆరోపణలపై విచారించే ప్రక్రియను స్పష్టంగా పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

లైంగిక వేధింపుల నిర్వచనం ఏంటి? నిందితుడి పేరు వెల్లడించాలా, వద్దా?

వద్దని చెప్పాక కూడా తాకడం, తాకాలని ప్రయత్నించడం, లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం, లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని కోరడం, అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపడం, లైంగికపరమైన సైగలు చేయడం.. ఇవన్నీ లైంగిక వేధింపుల కిందకి వస్తాయి.

కార్యాలయంలో గానీ, పని చేసే సమయంలో గానీ ఇలాంటి చర్యకు ఎవరైనా పాల్పడితే 'అంతర్గత ఫిర్యాదుల కమిటీ'కి ఫిర్యాదు చేయాలి.

చట్టప్రకారం.. ఆరోపణలు చేసినవారితోపాటు ఎదుర్కొంటున్నవారి వివరాలనూ విచారణ సమయంలో గోప్యంగా ఉంచాలి. ప్రస్తుత కేసులో అలాంటి కమిటీ ఇంకా విచారణ మొదలుపెట్టలేదు.

''బాధితులకు మరిన్ని సమస్యలు రాకుండా వారి పేర్లను గోప్యంగా ఉంచాలన్న నిబంధన ఉంది. నిందితుల పేర్లు బయటకు వెల్లడించకూడదన్న నిబంధన అర్థరహితం'' అని సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫిర్యాదులను విచారించే క్రమం ఇది..

పదికి మించి ఉద్యోగులు కలిగిన ప్రతి సంస్థా 'అంతర్గత ఫిర్యాదుల కమిటీ'ని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. దీనికి సంస్థలో సీనియర్‌ మహిళ అధ్యక్షత వహించాలి. మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది మహిళలే ఉండాలి. మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓకు చెందిన ఓ మహిళ కూడా కమిటీలో ఉండాలి.

ప్రస్తుత కేసులో కార్యాలయం సుప్రీం కోర్టు. అందులో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంది. అయితే అందులోని సభ్యులందరూ చీఫ్ జస్టిస్ కన్నా జూనియర్లే.

పారదర్శకమైన విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి కన్నా విచారించేవారు పదవి స్థాయిలో తక్కువగా ఉండకూడదు. అందుకే ఫిర్యాదు చేసిన మహిళ విశ్రాంత సుప్రీం న్యాయమూర్తులతో ప్రత్యేక విచారణ కమిటీని వేయాలని అభ్యర్థించారు.

ఇలాంటి కమిటీ ఏదీ వేయకముందే భారత చీఫ్ జస్టిస్ తన స్వీయ నేతృత్వంలో ఈ విషయంపై విచారణ జరిపారు. దీన్ని ఓ 'అసాధారణ చర్య'గా దిల్లీ హైకోర్టు న్యాయవాది రెబెకా మెమ్మన్ వర్ణించారు. సాధారణ పౌరులపై పనిచేసినట్లే చట్టం చీఫ్ జస్టిస్‌పైనా పనిచేయాలని అన్నారు.

''ఇలాంటి విచారణలు చేపట్టి.. మనపై వచ్చిన ఆరోపణలు మనమే విచారించకూడదన్న చట్టం మౌలిక సిద్ధాంతాలను మర్చిపోతున్నాం. ప్రతి ఫిర్యాదుపైనా నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిందే. దాని తర్వాత ఏం చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

'న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లకుండా '

అత్యున్నత పదవుల్లో ఉన్నవారిపై వచ్చే ఆరోపణలు ప్రజాప్రయోజనం దృష్ట్యా బయటకు వెల్లడించాల్సిన అవసరం ఉందని వృందా అభిప్రాయపడ్డారు. ''న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు, పారదర్శకత కోసం పూర్తి సమాచారాన్ని బహిరంగపరచాలి'' అని అన్నారు.

చీఫ్ జస్టిస్ పదవి అత్యంత సున్నితమైందని, దాని స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని రెబెకా చెప్పారు. అయితే, ఫిర్యాదులపై న్యాయపరమైన ప్రక్రియల ప్రకారం విచారణ జరపడం అనివార్యమని వ్యాఖ్యానించారు.

చట్టప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ రెండు పక్షాల వాదనలు విని, ఫిర్యాదు సరైందా, కాదా అన్న విషయాన్ని తేల్చుతుంది. ఒక్క పక్షం మాటలు విని నిర్ణయించడం కుదరదు. ఫిర్యాదు సరైనదని తేలితే నిందితుడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ గానీ, తీసియేవడం గానీ చేయొచ్చు. బాధితురాలికి పరిహారం కూడా ఇప్పించవచ్చు.

తాము ఉద్యోగం చేసే చోట ఉంటూనే దోషికి శిక్ష పడేలా చేసేందుకు మహిళలకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. జైలు, పోలీసులు కాకుండా సంస్థలోనే మరో మార్గం ద్వారా న్యాయం పొందే అవకాశం వారికి ఉంటుంది. దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా సహకరిస్తుంది.

ఒకవేళ విషయం తీవ్రమైందని అనుకుంటే బాధితురాలు పోలీసులను కూడా ఆశ్రయించవచ్చు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)