ఉద్యోగం మానేసి 10 నీటి కుంటలను శుభ్రం చేసిన యువకుడు

కాలుష్య కాసారంగా మారిన నీటి కుంటలను పునరుద్ధరించేందుకు ఓ యువకుడు నడుం బిగించాడు. ఒకటి కాదు, రెండు కాదు... పది కుంటలను శుభ్రం చేశాడు.
పైన కనిపిస్తున్నది దిల్లీ పరిసర ప్రాంతమైన గ్రేటర్ నోయిడాలోని డాబ్రా కుంట.
మూడేళ్ల క్రితం ఈ కుంట దుర్గంధంతో నిడిపోయి ఉండేది. దాని సమీపంలోకి వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
కానీ, 2019 నాటికి దాని స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు వెనకున్నది స్థానిక యువకుడు రామ్‌వీర్ తన్వార్.
"ఈ నీటి కుంట మూడు నాలుగేళ్ల క్రితం ఓ చెత్త డంపింగ్ యార్డులా ఉండేది. మేము చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవాళ్లం. అప్పుడు ఎంతో శుభ్రంగా ఉన్న కుంట, రానురాను దుర్గంధమైపోయింది. అందరూ దీనిని ఒక మురుగునీటి గుంటగా చూసేవారు" అని రామ్‌వీర్ చెబుతారు.
పది కుంటలను శుభ్రం చేసిన యువకుడు
రామ్‌వీర్ తన్వార్ వృత్తిపరంగా ఇంజినీర్. ఉద్యోగం వదిలేసి గ్రేటర్ నోయిడా ప్రాంతంలో మురికిమయమైన నీటి కుంటలను బాగుచేసే పని ప్రారంభించారు.
"ఈ కుంటలో ఎలాంటి కాలుష్యం ఉంది? ఎంత చెత్త ఉంది? అనేది విశ్లేషించేవాడిని. ఎలాగైనా శుభ్రం చేయాలని అనుకున్నా. అయితే, బురద బాగా పేరుకుపోయింది. అందులో ఎవరూ అడుగుపెట్టలేరు. దాన్ని తొలగించేందుకు యంత్రాలు అవసరమయ్యేవి, దాంతో ఖర్చు పెరుగుతుండేది. కొన్నాళ్లకు స్థానికులు నాతో చేతులు కలపడం ప్రారంభించారు. ఆర్థిక సాయం కూడా చేశారు."
"నేను ఉద్యోగం వదిలేసి ఈ పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, చాలా మంది వారించారు. కుటుంబాన్ని ఎలా చూసుకుంటావు? అని ప్రశ్నించేవారు. కొన్నిసార్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి" అని రామ్‌వీర్ గుర్తుచేసుకున్నారు.
రామ్‌వీర్ గత పదేళ్లలో చెత్తకుప్పలుగా తయారైన 10 కుంటలను శుభ్రం చేశారు.
"నేనో, యంత్రాలో ఇప్పుడు కుంటను శుభ్రం చేసి వెళ్లిపోగానే, మళ్లీ కొన్నాళ్లకు ఎవరైనా వచ్చి శుభ్రం చేస్తారులే అన్నట్లుగా ప్రజలు ఆలోచిస్తారు. ఈ పనిలో అందరూ చేతులు కలిపినప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది" అంటారు రామ్‌వీర్.
ఇప్పుడు చాలామంది నడక కోసం ఈ కుంట వద్దకు రావడమే కాదు, ఇందులోని నీరు వ్యవసాయానికి కూడా పనికొస్తోంది.
ఈ కుంట వల్ల ప్రజలకు ఉపాధి దొరకడమే కాదు, భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది.
"ఈ ఉద్యమంలో మేము విజయవంతం అయ్యామని అనుకుంటున్నా. గతంలో ప్రతికూలంగా ఆలోచించినవారు, ఇప్పుడు సానుకూలంగా మారిపోయారు" అని చెప్పారు రామ్‌వీర్.
ఇవి కూడా చదవండి.
- మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- ‘కులాంతర వివాహం చేసుకుంటే టెర్రరిస్టుల్లా చూస్తున్నారు’
- మసీదుల్లో పురుషులతో కలిసి మహిళల నమాజ్‌కు అనుమతించాలంటూ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)