లోక్‌సభ ఎన్నికలు 2019: లఖ్‌నవూలో రాజ్‌నాథ్ సింగ్‌కు పోటీ ఇచ్చేదెవరు

  • అనంత్ ప్రకాశ్
  • బీబీసీ ప్రతినిధి
లక్నోలో గెలిచేదెవరు

ఫొటో సోర్స్, FACEBOOK/RAJNATHSINGH/PRAMOD KRISHNAM/POONAM SINHA

బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ గత మంగళవారం లఖ్‌నవూ లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ వేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్ ఇదే సీటుకు ఆచార్య ప్రమోద్ కృష్ణంకు టికెట్ ఇచ్చింది. ఇక ఎస్పీ-బీఎస్పీ కూటమి పూనమ్‌ సిన్హాను తమ అభ్యర్థిగా బరిలోకి దించింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ సిన్హా మంగళవారం నుంచే ఆ పార్టీ సభ్యురాలు అయ్యారు. ప్రస్తుతం ఆమె లఖ్‌నవూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు ఈ త్రికోణ పోటీలో లఖ్‌నవూ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనే ప్రశ్న ఎదురవుతోంది.

లఖ్‌నవూ ఎవరిని ఎన్నుకుంటుంది

లఖ్‌నవూ లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కంచుకోటగా భావిస్తారు.

1991లో అటల్ బిహారీ వాజ్‌పేయి భారీ విజయం అందుకున్నప్పటి నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌నాథ్ సింగ్ భారీ మెజారిటీతో గెలవడం వరకూ ఈ స్థానం బీజేపీ ఖాతాలోకే వెళ్తూ వస్తోంది.

మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో లఖ్‌నవూ ప్రజలు లాల్జీ టండన్‌ను తమ ఎంపీగా ఎన్నుకున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/RAJNATH SINGH

గత లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణా జోషిని 2 లక్షల 72 వేల ఓట్లతో ఓడించారు.

కానీ ఎస్పీ-బీఎస్పీ కూటమి లఖ్‌నవూలో ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతోందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవలే ప్రకటించారు.

ఇప్పుడు పూనమ్ సిన్హా లఖ్‌నవూ ప్రజల మనసు గెలిచుకుని రాజ్‌నాథ్ సింగ్‌కు పోటీ ఇవ్వగలరా అనే ప్రశ్న ఎదురవుతోంది.

ఫొటో సోర్స్, Air

పూనమ్ సిన్హా రాజకీయ ప్రయాణం

జోధా అక్బర్ లాంటి సినిమాల్లో పనిచేసిన పూనమ్ సిన్హా అంతకు ముందెప్పుడూ ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదు.

కానీ పూనమ్ అభ్యర్థిత్వం గురించి మాత్రం గత కొంతకాలంగా లఖ్‌నవూలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.

దాని గురించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ సునీతా ఎరాన్ "ఇటీవల శత్రుఘ్న్ సిన్హా, అఖిలేష్ యాదవ్‌ భేటీ అయినప్పుడు పూనమ్ సిన్హాను లఖ్‌నవూ నుంచి ఎన్నికల్లో బరిలోకి దింపుతారనే వార్తలొచ్చాయి. ఎందుకంటే ఆమె భర్త కాయస్థ జాతికి చెందినవారు. అందుకే కాయస్థ ఓటర్లతోపాటు ముస్లిం ఓటర్లను ఆకర్షించవచ్చని భావించి ఆమె పేరును నిర్ణయించి ఉండచ్చు. కానీ ఒక అభ్యర్థిగా పూనమ్ చాలా బలహీనమైన కాండిడేట్. ఆమె లఖ్‌నవూలో ఇప్పటివరకూ ఎలాంటి పనులూ చేయలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, SOCIETY

లఖ్‌నవూ జనాభాలో కాయస్థ ఓటర్లు పది శాతం ఉన్నారు. ఈ వర్గంలోని నాలుగు శాతం సింధీ సామాజిక వర్గం వారే. పూనమ్ సిన్హా హైదరాబాద్ సింధీ సమాజానికి చెందినవారు. ఆమె శత్రుఘ్న్ సిన్హాను పెళ్లి చేసుకున్నారు.

అందుకే, కాయస్థ, సింధీ ఓటర్లను ఆకట్టుకోవడానికే సమాజ్ వాదీ పార్టీ పూనమ్ సిన్హాను అభ్యర్థిగా నిలబెట్టినట్టు అనిపిస్తోంది.

ఇక్కడ అంతకు ముందు ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అందుకే ఆ పార్టీ ఈ లోక్‌సభ స్థానంలో ఇక్కడ కొత్త గ్రౌండ్ వెతకడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

"కానీ ఎస్పీ-బీఎస్పీ పూనమ్ సిన్హాను అభ్యర్థిగా దించి ఒక విధంగా రాజ్‌నాథ్ సింగ్‌కు సాయం చేశాయి" అని సీనియర్ జర్నలిస్ట్ సునీతా ఎరాన్ అన్నారు.

ఎందుకంటే పది శాతం ఓట్ల కోసం బయటి నుంచి వేరే ఎవరినో తీసుకొచ్చి అభ్యర్థిగా నిలపడం అనేది ఒక విధంగా ఎన్నికల బరిలో ముందే ఓటమిని ఒప్పుకోవడం లాంటిదే.

ఫొటో సోర్స్, FACEBOOK/KALKIDHAMSHRIPARMODKIRSHN

కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ కృష్ణం బలం ఎంత

ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య ప్రమోద్ కృష్ణం విషయానికి వద్దాం. ఆయన్ను ఒక మతగురువులా చూస్తారు.

అంతకు ముందు ఆయన కాంగ్రెస్ టికెట్ మీదే సంభల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ తన ప్రచారం కోసం ఆయన మోనికా బేదీని కూడా పిలిపించారు. కానీ, సంభల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ ఓటమిపాలైంది.

అలాంటప్పుడు లఖ్‌నవూ లాంటి కీలకమైన స్థానంలో రాహుల్ గాంధీ మరోసారి ప్రమోద్ కృష్ణంను ఎందుకు బరిలోకి దించారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

లక్నో లోక్‌సభ స్థానంలో ఉన్న బ్రాహ్మణ ఓటు బ్యాంకే దీనికి కారణం అని సీనియర్ జర్నలిస్ట్ రామదత్త త్రిపాఠీ భావిస్తున్నారు.

"గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రీటా బహుగుణ జోషీ బీజేపీలో చేరిపోయారు. అలాంటప్పుడు వారికి ఒక విధంగా అభ్యర్థుల లోటుంది. ఇటు లఖ్‌నవూ కాంగ్రెస్ క్యాడర్‌లో ఉన్న నేతల్లో ఎవరిపైనా నమ్మకం ఉంచలేని పరిస్థితి. అందుకే కాంగ్రెస్ ఒక మతగురువు గుర్తింపు ఉన్న వ్యక్తికి తమ టికెట్ ఇచ్చింది. దీనికొక కారణం ఉండచ్చు" అన్నారు.

కాంగ్రెస్ ఈ స్థానంలో ప్రమోద్ కృష్ణంకు ఉన్న మతగురువు గుర్తింపు ద్వారా బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. కానీ దీనితోపాటు లఖ్‌నవూలో కృష్ణం ఎలాంటి పనులూ చేయలేదన్నది కూడా వాస్తవం.

లఖ్‌నవూ లోక్‌సభ సీటుకు ఐదో దశలో మే 6న ఓటింగ్ జరగనుంది. ఇక్కడ ఏ పార్టీ వ్యూహం పనిచేసింది, ఎవరి వ్యూహం బెడిసికొట్టింది అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)