లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేఐ గొగోయ్ ముందుకు రానున్న ముఖ్యమైన కేసులివే

జస్టిస్ రంజన్ గొగోయ్

ఫొటో సోర్స్, Reuters

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రానున్న రోజుల్లో ఎన్నో కీలక కేసులపై విచారణ నిర్వహించాల్సి ఉంది.

"ప్రధాన న్యాయమూర్తికి ఇదో లిట్మస్ పరీక్ష లాంటిది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆయన ఎన్నో ప్రముఖ కేసుల్లో విచారణ చేపట్టాల్సి ఉంది" అని అంతర్జాతీయ న్యాయవాది, న్యాయ నిపుణుడు డాక్టర్ సూరత్ సింగ్ అన్నారు.

"రానున్న రోజులు సీజేఐకు చాలా కఠినమైనవి. ఇది ఆయనకో లిట్మస్ పరీక్ష లాంటిది. మోదీ బయోపిక్, రాహుల్ గాంధీపై పరువునష్టం దావా, ఎన్నికలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఆయన ఎన్నో ముఖ్యమైన కేసుల్లో విచారణ చేపట్టాల్సి ఉంది" అని డాక్టర్ సూరత్ సింగ్ దిల్లీలోని సీనియర్ లీగల్ రిపోర్టర్ సుచిత్ర మొహంతీతో అన్నారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

రానున్న కొద్ది రోజుల్లో సీజేఐ రంజన్ గొగోయ్ విచారణ చేపట్టాల్సి ఉన్న కొన్ని ముఖ్యమైన కేసులు

  • రఫేల్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసు
  • ప్రధాని మోదీ బయోపిక్‌పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్
  • తమిళనాడులో ఎన్నికలను వాయిదా వేయించడానికి భారీ స్థాయిలో ఓటర్లకు నగదు పంపిణీ చేశారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్
  • అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమైనవని సీజేఐ గొగోయ్ శనివారం నాడు త్రిసభ్య బెంచ్‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నిర్థరించారు.

గతంలో తనతో కలసి పనిచేసిన మహిళ తనపై వేధింపుల ఆరోపణలు చేయడాన్ని జస్టిస్ గొగోయ్‌ తప్పుబట్టారు. 20 ఏళ్లపాటు న్యాయవ్యవస్థలో పనిచేసిన తనకు బ్యాంక్ బాలెన్స్ రూ.6.80 లక్షలు, తన పీఎఫ్ ఖాతాలో దాదాపు రూ.40 లక్షలు మాత్రమే ఉన్నాయని అన్నారు. తనకు వ్యతిరేకంగా కొందరికి ఏమీ దొరక్కపోవడంతో ఓ మహిళను అడ్డం పెట్టుకుని వారు తనపై ఆరోపణలు చేశారని చెప్పారు.

"న్యాయవ్యవస్థ స్వతంత్రతకు చాలా తీవ్రమైన ముప్పు ఎదురవుతోంది. (ఈ ఫిర్యాదు వెనక) న్యాయవ్యవస్థను అస్థిరపరిచే భారీ కుట్ర ఉంది'' అని ఆయన అన్నారు.

ఫిర్యాదు చేసిన మహిళ వెనక ఓ బలమైన శక్తి ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులు పనిచేయాల్సి వస్తే, మంచివారెవరూ ఈ బాధ్యతలను చేపట్టరని చెప్పారు.

నేరచరిత్ర కారణంగా సదరు మహిళ నాలుగు రోజులు జైల్లో ఉన్నారని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. వ్యవహార తీరును సరిచేసుకోవాలని ఆమెకు పోలీసులు సూచించారని చెప్పారు.

జస్టిస్ రంజన్ గొగోయ్

ఫొటో సోర్స్, Getty Images

జస్టిస్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ ఆరోపణలతో మొత్తం 22 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు శుక్రవారం (ఏప్రిల్ 19) ఆమె లేఖ రాశారు.

ఈ విషయాన్ని కొన్ని ఆన్‌లైన్ మీడియా సంస్థలు పబ్లిష్ చేశాయి.

గత సంవత్సరం జనవరిలో సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తీరును తప్పుబడుతూ మీడియా సమావేశం నిర్వహించిన నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరు. న్యాయవ్యవస్థను సంరక్షించుకోలేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)