సీజేఐ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు: ఈ కేసు #MeToo కంటే పెద్దది. ఎందుకంటే..

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
జస్టిస్ రంజన్ గొగోయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జస్టిస్ రంజన్ గొగోయ్

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై ఒక మహిళ పెట్టిన లైంగిక వేధింపుల కేసులో ఇప్పుడు మహిళా న్యాయవాదుల సంఘం, విమెన్ ఇన్ క్రిమినల్ లా అసోసియేషన్, ఒక పత్రికా ప్రకటన జారీ చేశాయి.

హోదా, బలంలో చాలా వ్యత్యాసం ఉండడం వల్ల ఆరోపణలపై విచారణ చేసే సమయంలో ప్రధాన న్యాయమూర్తిని ఆ పదవిలో ఉంచకూడని తమకు అనిపిస్తోందని అందులో తెలిపారు.

ఆ మహిళ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఒక జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు.

ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిగే ప్రక్రియను, నిబంధలను ఇదే కోర్టు నిర్ణయించింది. కానీ, ప్రస్తుతం అది వాటిని అమలు చేయడం లేదు.

లైంగిక వేధింపులను అడ్డుకోడానికి రూపొందించిన చట్టం 'సెక్సువల్ హరాస్‌మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్)- 2013'ను ఉదహరిస్తూ ఇప్పుడు ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలనే కాదు, ప్రధాన న్యాయమూర్తిని విచారణ సమయంలో పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వస్తోంది.

"న్యాయస్థానానికి చీఫ్‌గా ఉన్న వ్యక్తి దాని పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆయనను పదవి నుంచి తప్పించడం తప్పనిసరి" అని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ డిమాండుపై మహిళా న్యాయవాదులే కాదు, వెయ్యి మందికి పైగా ప్రజలు కూడా సంతకాలు చేశారు.

లైంగిక వేధింపులపై #MeToo ఉద్యమం జరిగినప్పుడు, గతేడాది అక్టోబర్‌లో కేంద్ర మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

20 మంది మహిళా జర్నలిస్టులు అక్బర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఏషియన్ ఏజ్‌తో పాటు మరికొన్ని పత్రికలకు సంపాదకుడిగా ఉన్నప్పుడు ఎంజే అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ మహిళలు ఆరోపించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణ, న్యాయవ్యవస్థ ముందు పెద్ద పరీక్ష లాంటిది. ఇది రహస్యంగా పేరు చెప్పకుండా సోషల్ మీడియాలో చేసిన ఫిర్యాదు కాదు. చట్ట ప్రకారం అఫిడవిట్‌తో పాటు న్యాయం కావాలంటూ కోర్టులో చేసిన అప్పీల్. ఈ కేసు విచారణ రానున్న కాలాలకు ఒక మైలురాయిగా మారుతుంది.

"ఈ కేసు విచారణ కోసం అత్యంత విశ్వసనీయత ఉన్న వారితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు బాధ్యత. అలా జరగలేదంటే ఇది సుప్రీంకోర్టు విశ్వసనీయతనే తగ్గించేస్తుంది" అని ఇందిరా జైసింగ్ అన్నారు.

పత్రికా ప్రకటనలో ఈ కేసు విచారణపై ఇప్పటివరకు న్యాయస్థానం తీసుకున్న చర్యలపై కూడా విమర్శించారు. "విచారణ అంశాన్ని లైంగిక వేధింపుల కోణం నుంచి వేరే దిశలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని" ఆరోపించారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

జస్టిస్ రంజన్ గొగోయ్

న్యాయవ్యవస్థ దుర్వినియోగం

సుప్రీంకోర్టులో ఇప్పటివరకూ జరిగిన విచారణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రధాన న్యాయమూర్తికి జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణ చేసినప్పుడు, దానిపై విచారణకు ఆదేశించడానికి బదులు శనివారం ఒక బెంచ్ ఏర్పాటు చేసి అత్యవసర విచారణ చేపట్టారు. దీనికి స్వయంగా ప్రధాన న్యాయమూర్తే అధ్యక్షత వహించారు.

ఈ అంశాన్ని, 'న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రజా ప్రయోజన విషయంగా' పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు వ్యవహరాలు, లీగల్ కేసుల విషయాలపై సీనియర్ జర్నలిస్ట్, రచయిత మనోజ్ సిన్హా చాలా కాలంగా రిపోర్ట్ చేస్తున్నారు.

ఈ అంశంపై బీబీసీతో మాట్లాడుతూ... తొందరపాటులో విచారణ చేసినపుడు నిర్ధారిత ప్రక్రియను పాటించలేదన్నారు.

బెంచ్‌లో తన వారిని చేర్చుకున్న ప్రధాన న్యాయమూర్తి 'తమకు సంబంధించిన కేసుల్లో ఎవరూ జడ్జి కాలేరు' అనే సిద్ధాంతాన్ని ఉల్లంఘించారు.

‘సీజేఐని ఇరికించే కుట్ర’

ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ని లైంగిక వేధింపుల కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్ బైన్స్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

దీనిని మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, రోహింగ్టన్ నారిమన్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం సుమోటో కేసుగా స్వీకరించింది.

ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

తన న్యాయపరమైన అధికారాలను దుర్వినియోగం చేస్తూ సీజేఐ బాధితురాలిని దోషిగా నిర్ణయించడమే కాదు, ఆమె "క్రిమినల్ నేపథ్యాన్ని" ఉదహరిస్తూ ఫిర్యాదుదారును అవమానించారు కూడా.

ఫిర్యాదుదారుకు గానీ, వారి ప్రతినిధులకు గానీ తమ వాదన వినిపించే అవకాశమే ఇవ్వలేదు అన్నారు.

లైంగిక వేధింపుల వివరణాత్మక ఫిర్యాదును న్యాయవ్యవస్థ స్వతంత్రతపై జరిగిన దాడిగా చేప్పేందుకు చేసే ప్రయత్నంతో కేసును అణగదొక్కాలని చూస్తున్నట్టు తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన బెంచ్ ముందు రాజకీయంగా చాలా సున్నితమైన కేసులు ఉండడంతో.. సెలవు రోజున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పడం వల్లే స్పెషల్ విచారణ జరిగిందనేది చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది.

ఆదివారం రోజు సీజేఐ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, సంజీవ్ ఖన్నాలతో ఏర్పాటైన స్పెషల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తర్వాత సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

ఈ ఆదేశాల్లో సీజేఐ రంజన్ గొగోయ్ పేరు లేదు.

ప్రధాన న్యాయమూర్తి ఈ సమస్య నుంచి తనను తాను బయటపడేసుకోవడం కోసం మెహతా, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌పై ఆధారపడడం న్యాయవ్యవస్థ స్వతంత్రకు మంచిది కాదు.

ఆ మహిళ 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లేఖ రాశారు. తన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

సుప్రీంకోర్టులో లైంగిక వేధింపుల కేసుల్లో విచారణ కోసం ఏర్పాటు చేసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఈ కేసును విచారణ చేయలేకపోతోంది.

అయితే, "ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి మిగతా జడ్జిలను ఒప్పించే నైతిక బాధ్యత కమిటీ అధ్యక్షురాలు, న్యాయమూర్తి ఇందూ మల్హోత్రాపై ఉంది" అని ఇందిరా జైసింగ్ అన్నారు.

"బాధిత మహిళ వైపు నిలిచి న్యాయ ప్రక్రియలో ఆమెకు సాయం చేయడం యజమాని బాధ్యత అని చట్టం కూడా చెబుతోంది" అని ఆమె చెప్పారు.

ఫిర్యాదు చేసిన మహిళకు న్యాయం అందుతుందా, లేదా నిర్ణయించే బంతి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిల పరిధిలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)