బలమైన నాయకత్వమా, ప్రజాస్వామ్యమా -భారత ఓటర్లు ఏం కోరుకుంటున్నారు

  • సౌతిక్ బిశ్వాస్
  • బీబీసీ ప్రతినిధి
రెండు ఫొటలతో ఒక వ్యక్తి

ఫొటో సోర్స్, EPA

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎర్డోగన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాదిరి ప్రధాని నరేంద్ర మోదీ కూడా బలమైన నాయకుడా? 2019 లోక్‌సభ ఎన్నికలను, అధ్యక్ష పాలనలో మాదిరి తన పనితీరుపై రెఫరెండంగా మార్చడంలో ఆయన విజయవంతమవుతారా?

2014లో చాలా మంది ఆశించినట్లుగా విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను మోదీ తీసుకురాలేదనే అసంతృప్తి జనంలో ఉందా? చరిష్మాగల దీటైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల వరుసగా రెండోసారి ఆయనే అధికారాన్ని చేపట్టగలరా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం ఆమోదయోగ్యమైన రాజకీయం కాదా? పెరుగుతున్న జాతీయవాదం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తోందా?

ఈ ప్రశ్నలతోపాటు మరెన్నో అంశాల గురించి రుచిర్ శర్మ తన తాజా పుస్తకం 'డెమొక్రసీ ఆన్ ద రోడ్'‌లో చాలా ఆసక్తికరంగా రాశారు. ఆయన ఒక అంతర్జాతీయ పెట్టుబడిదారు, రచయిత, ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక కాలమిస్టు.

ఫొటో సోర్స్, Getty Images

'ఆ వాదన వాస్తవ విరుద్ధం'

1998 నుంచి భారత్‌లో ఎన్నికల సమయంలో 27 సార్లు ఆయన దేశవ్యాప్తంగా పర్యటించారు. భారత్‌లోని 29 రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాల్లో తిరిగారు.

జనాభా అధికంగా ఉన్న, రాజకీయంగా ముఖ్యమైన 10 రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లే పర్యటించారు.

ఇటీవల రుచిర్ శర్మ భారత పర్యటన సందర్భంగా ఆయన్ను కలిసి మాట్లాడాను.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య అనివార్యతలనే బంధనాలు లేని బలమైన నాయకుడిని ప్రజలు కోరుకొంటున్నారని సర్వేలు కొన్నిసార్లు చెబుతుంటాయి.

భారత ఎన్నికల వాస్తవ సరళిని చూస్తే, ఈ వాదన వాస్తవం కాదనిపిస్తోందని రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు. అంత దీటుగా కనిపించని, అహంకారంలేని నాయకుల వైపే భారతీయులు మొగ్గు చూపుతుంటారని చెప్పారు.

"భారతీయుల ప్రజాస్వామ్య కాంక్ష బలమైనది. ఎవరైనా నాయకుడు అహంకారంతో వ్యవహరిస్తే, ప్రజలు గద్దె దించుతారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే- అసాధారణ వైవిధ్యమున్న ఈ దేశంలో ఒకే నాయకుడు సుదీర్ఘకాలం ఆధిపత్యం సాగించడం కష్టం" అని రుచిర్ శర్మ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP

భారత్ ఎంత వైవిధ్యమైన దేశమంటే ఒక బహుళ జాతి సంస్థ, 29 భారత రాష్ట్రాలను తిరిగి 14 ఉప ప్రాంతాలుగా వర్గీకరించి చూస్తుందని, ఎందుకంటే భారత్‌లో ప్రజల అభిరుచులు, అలవాట్లు, భాషలు అనేక రకాలుగా ఉంటాయని ఆయన వివరించారు.

"భారత ప్రజాస్వామ్య నిజమైన బలం భిన్నత్వంలోనే ఉంది" అని రుచిర్ శర్మ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ తనను తాను బలమైన నాయకుడిగా చెప్పుకొంటున్నప్పటికీ, నిజానికి భారత ప్రజానీకం కోరుకొనేది బలమైన నాయకులను కాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.

"ఈ ఎన్నికలను మోదీ, మిగతా నాయకుల మధ్య పోటీగా చూస్తున్నారు. బలమైన నాయకుల పట్ల భారతీయుల ఆసక్తి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉండటంపై రెఫరెండంగా చూస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో జరిగే వేర్వేరు పోటీలుగా సాగే అవకాశమే ఎక్కువ" అని రుచిర్ శర్మ విశ్లేషించారు.

ఆయన వాదనకు తగిన బలం చేకూర్చే వాస్తవాలూ ఉన్నాయి. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా, 160కి పైగా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం సాధిస్తున్నాయి. అంటే మొత్తం స్థానాల్లో దాదాపు మూడో వంతు సీట్లను ఇవే గెలుచుకొంటున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి దశలో కేవలం 35 సీట్లే వీటికి దక్కేవి.

ఇదో ప్రధానమైన మార్పు అని, దీనివల్లే భారత సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రస్థాయి ప్రాంతీయ లేదా ఉప జాతీయ(సబ్ నేషనల్) ఎన్నికల సమాహారంగా మారిపోయాయని ప్రముఖ సెఫాలజిస్టు, జర్నలిస్టు ప్రణయ్ రాయ్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP

2014 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 280కి పైగా స్థానాలు తెచ్చుకోవడం చరిత్రాత్మకమైన విజయం. కానీ చాలా మంది దృష్టిలో అది అనూహ్యమైన పరిణామం.

"2014లో మోదీ హవా ఉన్నప్పుడు సాధించినట్లుగానే ఈసారి కూడా బీజేపీ మూడో వంతు ఓట్లు తెచ్చుకోగలదు, కానీ మెజారిటీ సీట్లు కోల్పోతుంది" అని రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు. దీనికో కారణమేమిటంటే సాధారణంగా అధికార పక్షాలు మళ్లీ విజయం సాధించవు, ప్రతిపక్షాలు విజయం సాధిస్తాయని చెప్పారు.

బహుముఖ పోటీ ఉన్న రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో చాలా సందర్భాల్లో కేవలం మూడో వంతు ఓట్లతోనే పార్టీలు మెజారిటీ సీట్లను సాధిస్తుంటాయి.

1977 నుంచి 2002 మధ్య పెద్ద, మధ్యస్థ రాష్ట్రాల్లో నూటికి 70 సందర్భాల్లో పాలక పక్షాలు ఓడిపోయాయని ప్రణయ్ రాయ్ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు పరిస్థితులు మారాయని, పాలక పక్షాలు తిరిగే ఎన్నికయ్యే అవకాశాలు 50 శాతం ఉన్నాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

'అధికారం దక్కించుకోవడం చాలా కష్టం'

భారత రాజకీయాల్లో అధికారాన్ని దక్కించుకోవడం చాలా కష్టమని, దక్కిన అధికారం నిలబడేదీ తక్కువ కాలమేనని ప్రణయ్ రాయ్ అధ్యయనంలో స్పష్టమైంది.

అభ్యర్థులు కులం, కుటుంబం, ధరల పెరుగుదల, సంక్షేమం, అభివృద్ధి, అవినీతి లాంటి అంశాల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొన్ని ఆధిపత్య కులాలవారు ఓటర్లలో 10 నుంచి 20 శాతం మంది ఉంటారు.

అత్యధిక రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రధానాంశం.

ప్రజల్లో మోదీ తాము ఆశించినంత సంస్కరణవాది కాదనే అసంతృప్తి నిజంగానే ఉందా అనే సందేహాలనూ రుచిర్ శర్మ వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, AFP

భారత రాజకీయ డీఎన్ఏలోనే మౌలికంగా సామ్యవాద(సోషలిస్ట్), రాజ్యవాద(స్టేటిస్ట్) భావనలు ఇమిడి ఉన్నాయని రుచిర్ శర్మ వ్యాఖ్యానించారు.

"ఇక్కడ క్రమబద్ధమైన స్వేచ్ఛా మార్కెట్ సంస్కరణలకు ఓటర్లలోగాని, రాజకీయ ప్రముఖుల్లోగాని మద్దతు ఉండదు. మంచి ఆర్థిక విధానాలు ఎప్పటికైనా ఎన్నికల్లో సుస్థిరమైన గెలుపు వ్యూహాలుగా మారుతాయనే సూచనలు కనిపించడం లేదు'' అని ఆయన వివరించారు.

భారత్‌లో సంస్కరణలను సాధారణంగా ఆచితూచి, బహిరంగ విధానాలు లేకుండా అమలు చేస్తుంటారని, లేదా సంక్షోభాలు వస్తేనే వాటిని చేపడుతుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతున్న జాతీయవాదం, మత రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయనే ఆందోళన నిరాధారమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌లో భిన్నత్వం చాలా ఎక్కువని, ఇక్కడ ప్రజాకర్షక జాతీయవాదంతో ఆధిపత్యం చలాయించడం సాధ్యం కాదని తెలిపారు. జాతీయవాదం నుంచి ముప్పు ఏర్పడకుండా నిలువరించగల ప్రాంతీయవాద భావనలు దేశంలో ఉన్నాయన్నారు.

"2019 ఎన్నికలు రెండు వేర్వేరు రాజకీయ లక్ష్యాలను భారతీయుల ముందుంచుతున్నాయి. ఒకటేమో దేశంలోని భిన్నత్వాన్ని గుర్తించి, గౌరవించాలనే లక్ష్యం. మరొకటి- ఈ భిన్నత్వాన్ని పరిగణనలోకి తీసుకోని విరుద్ధమైన భావన" అని రుచిర్ శర్మ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)