కిరణ్ బేడీని ఇందిరా గాంధీ లంచ్‌కు ఎందుకు ఆహ్వానించారు? BBC Fact Check

  • ఫ్యాక్ట్ చెక్ బృందం
  • బీబీసీ న్యూస్
ఇందిరతో కిరణ్ బేడీ

ఫొటో సోర్స్, SM GRAB

ఫొటో క్యాప్షన్,

ఇందిరతో కిరణ్ బేడీ

1982లో అప్పటి ప్రధాని ఇందిర కారు నిబంధనలకు వ్యతిరేకంగా పార్క్ చేసినందుకు మొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ తీసుకెళ్లారని, ఆ తర్వాత బేడీని ఇందిర లంచ్‌కు ఆహ్వానించారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో ఇందిర గాంధీతో పాటు డైనింగ్ టేబుల్ పక్కనే కిరణ్ బేడీని కూడా చూడొచ్చు.

"ఇందిర గాంధీ లాంటి నేతలు చాలా అరుదు. నిబంధనలకు వ్యతిరేకంగా కారు పార్క్ చేసినందుకు ప్రధాని కారుకే చలానా విధించిన కిరణ్ బేడీని అభినందించడానికి ఇందిర స్వయంగా తన కార్యాలయానికి భోజనానికి పిలిచారు" అని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అనే పేరుతో ఉన్న ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, SM GRAB

'నైతికతకు అహంకారానికి మధ్య తేడా ఇది' అంటూ ఇందిరకు, మోదీకి పోలికలు తెస్తూ ఈ చిత్రం విస్తృతంగా ప్రచారమవుతోంది.

ఈ అంశాన్ని కిరణ్ బేడీ-ఇందిరాగాంధీ ఘటనతో పోల్చుతూ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ ఫొటోనూ ఫేస్‌బుక్, ట్విటర్‌లలో వేలాదిమంది షేర్ చేసుకున్నారు.

ఫొటో సోర్స్, SM GRAB

1982లో దిల్లీ పోలీసులు నో పార్కింగ్ జోన్‌లో ఉన్న ఇందిర కారుకు చలానా విధించి, తీసుకెళ్లారు. ఆ సమయంలో కిరణ్ బేడీ ట్రాఫిక్ విభాగంలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు.

ఈ ఫొటో నిజమే కానీ దానితో కలిపి పేర్కొన్న సందర్భం మాత్రం నిజం కాదు అని మా పరిశీలనలో తేలింది. 1982 నాటి ఘటనకు, ఈ ఫొటోకు ఎలాంటి సంబంధం లేదు.

ఈ ఫొటో ఎప్పుడు తీశారు?

"ఇందిరాగాంధీతో గడిపిన క్షణాలు.. 1975లో రిపబ్లిక్ డే పరేడ్‌కు నేతృత్వం వహించిన నన్ను చూసిన ఇందిర బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారు" అంటూ కిరణ్ బేడీ 2014లో ఈ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు.

ఇది జరిగిన ఏడేళ్ల తర్వాత అంటే 1982లో, కారును తీసుకెళ్లిన ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, Twitter/@thekiranbedi

"ఇదంతా అసత్యం. ఈ చిత్రం 1975నాటిది. 1982లో తీసింది కాదు. ఓ పురుషుల బృందానికి నేను రిపబ్లిక్ డే పరేడ్‌లో నేతృత్వం వహించడాన్ని చూసిన ఇందిర నన్ను అల్పాహారానికి పిలిచారు. ఓ మహిళ దిల్లీ పోలీస్ కంటింజెంట్‌ను ముందుండి నడిపించడాన్ని చూసి ఆమె చాలా సంతోషించారు. అలా చేసిన మొదటి మహిళను నేనే" అని బేడీ బీబీసీతో చెప్పారు.

అప్పడు బేడీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్నారు.

"నన్నే కాదు. నాతో పాటు మరో ముగ్గురు నలుగురు మహిళా ఎన్‌సీసీ కేడెట్లను కూడా ఇందిర ఆహ్వానించారు. 'ఐ డేర్' పేరుతో రాసిన నా ఆత్మకథలో కూడా ఈ అంశాన్ని నేను ప్రస్తావించా" అని కిరణ్ బేడీ స్పష్టం తెలిపారు.

ఇందిర కారును బేడీ తీసుకెళ్లారా?

ఇందిర కారుకు తాను చలానా విధించలేదని బేడీ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు.

"ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పాను. ఇందిరా గాంధీ కారును తీసుకెళ్లింది నేను కాదు. అప్పటి ఎస్ఐ నిర్మల్ సింగ్ ఆ పని చేసి, ఆ తర్వాత నాకు సమాచారం ఇచ్చారు. ఆయన బాధ్యతలు ఆయన నిర్వహించారు. నేను కూడా నా బాధ్యతగా ఆయనకు మద్దతు తెలిపాను" అని బేడీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

బేడీ నాకు పూర్తి మద్దతునిచ్చారు: నిర్మల్ సింగ్

"శాఖా పరమైన విచారణలు సర్వసాధారణం. కానీ ఈ అంశం డీసీపీ బేడీ వద్దకు వెళ్లింది. ఆమె నాకు పూర్తి మద్దతు తెలిపారు. నా క్రెడిట్‌ను ఆమె తీసుకోలేదు. ఈ గొప్పదనం అంతా పోలీసులదే" అని ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మల్ సింగ్ వెల్లడించారు.

ఈ వైరల్ ఫొటోలో చెబుతున్నట్లుగా రాజకీయంగా వస్తున్న ప్రశంసల గురించి బేడీ దగ్గర ప్రస్తావించగా... "రాజకీయంగా వచ్చే పొగడ్తలు, వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత నన్ను గోవాకు బదిలీ చేశారు తెలుసా. 1982లో ఆసియా క్రీడల తర్వాత ఈ బదిలీ జరిగింది. నా కుమార్తెకు ఎయిమ్స్ నుంచి వైద్య సహాయం అవసరం, దానికోసం దిల్లీలోనే ఉండాలి అని చెప్పాను. కానీ వాళ్లు వినలేదు. నన్ను బలవంతంగా బదిలీ చేశారు" అని వివరించారు.

"నా బదిలీకి ఎలాంటి కారణం లేదు. నేనిక్కడికి వచ్చి కేవలం ఒకటిన్నరేళ్లైంది. కారును తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ప్రధానికి బాగా దగ్గరి వ్యక్తులైన ఎంఎల్ ఫొటేదార్, ఆర్‌కే ధవన్ నన్ను అడిగారు. నా కుమార్తె ఆరోగ్య పరిస్థితి గురించి ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లి నిజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం కావడం విచారకరం" అని కిరణ్ బేడీ అన్నారు.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)