తెలంగాణ ఇంటర్ ఫలితాలు: ‘‘సాఫ్ట్‌వేర్‌లో లోపాలు.. కోడింగ్, డీకోడింగ్‌లో సమస్యలు’’

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతంపై సాంకేతిక లోపాల ప్రభావం లేదని ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో వివరాలను మీడియాకు వెల్లడించిన విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

"ఇంటర్మీడియట్ ఫలితాలలో తప్పులు దొర్లాయి. ఫలితాలు వెల్లడించడంలో తప్పులు దొర్లాయి. సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉండడంతో సమస్యలు వచ్చాయి. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో పెద్ద తేడా లేదు. 530 మంది జాగ్రఫీ విద్యార్థులకు ప్రాక్టికల్ మార్కులు డిస్ప్లే కాలేదు. అది గుర్తించిన బోర్డు కొద్ది గంటల్లోనే సవరించింది" అని జనార్ధన్ రెడ్డి తెలిపారు.

"ఓఎంఆర్ షీట్ల బబ్లింగ్ సరిగా జరగలేదు. కొందరికి ప్రాక్టికల్ మార్కులు యాడ్ కాలేదు. చివరి నిమిషంలో సెంటర్ల మార్పు వల్ల కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయి. జంబ్లింగ్‌లో కూడా కొన్ని తప్పులు జరిగాయి" అని ఆయన అన్నారు.

"సాఫ్ట్‌వేర్ లోపంతో కోడింగ్, డీకోడింగ్‌లో కొంత సమస్య తలెత్తింది. బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. ఫెయిలయిన వారు రీవాల్యూయేషన్ కోసం డబ్బులు చెలించి ఉంటే వారి డబ్బులు తిరిగి ఎలా ఇవ్వటం అనేది తెలియచేస్తాం" అని తెలిపారు.

అయితే రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ చేసేటప్పుడు అందరు జాగ్రత్తగా చేయాలని, హ్యూమన్ ఎర్రర్ అసలు లేకుండా చేయాలని ఆయన కోరారు.

"డేటా ప్రొసెస్ చేసిన సంస్థతో ఎలాంటి అగ్రిమెంట్ ఇంకా జరగలేదు. ఆ సంస్థకు ఒక్క పైసా చెల్లించలేదు. ఫలితాల వెల్లడి తరవాతే అగ్రిమెంట్ అని ఆ సంస్థకు ముందే స్పష్టత ఇచ్చాం. ఇకపై తప్పులు దొర్లకుండా నిబంధనలు కఠినతరం చేస్తాం. క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా న్యాయ నిపుణుల సలహాతో విధివిధానాలు ఖరారు చేస్తాం. మానవ తప్పిదాల వల్లనే 99 మార్కుల బదులు 00 అని రావడం లాంటి తప్పులు దొర్లాయి" అని జనార్దన్ రెడ్డి అన్నారు.

త్రిసభ్య కమిటీలో ఎవరెవరు ఉన్నారు?

టిఎస్‌టిఎస్ ఎండి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ వేసింది. వెంకటేశ్వర రావుతో పాటు హైదరాబాద్ బిట్స్‌కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ నిశాంత్‌లు ఇందులో సభ్యులు.

సాఫ్ట్‌వేర్ సంస్థ ఎవరిది?

ఈ ఏడాది మార్కులను ప్రకటించే టెండర్‌ను 'గ్లోబరినా' అన్న కొత్త ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. దీని మూలంగానే ఇలా అవకతవకలు జరిగాయని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు విద్యామండలి అధికారులు.

ఫొటో సోర్స్, fb

ఫలితాలపై వివాదం ఇదీ...

ఏప్రిల్ 18న ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తరువాత తెలంగాణ పోలీసు అధికారుల అంచనా ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏటా ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు సర్వ సాధారణమైపోయాయి. గత ఏడాది ఫలితాలు వెలువడ్డాక రెండు నెలల వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 60 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం తెలిపింది.

అయితే, ఈసారి పరీక్ష ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగి ఉంటాయన్న అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే బుధవారం సీఎం కేసీఆర్ దీనిపై సమీక్ష జరిపి ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలలో ఫెయిలైన 3.28 లక్షల మంది విద్యార్థులకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంవత్సరం కోల్పోకుండా ఈ ప్రక్రియంతా వీలైనంత వేగం పూర్తికావాలన్నారు.

ఫొటో క్యాప్షన్,

నవ్య తెలుగు పేపర్ 2లో ఫెయిల్ అయినట్లుగా చూపిస్తున్న చిత్రం

ఎన్నో పొరపాట్లు

కాగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల తరువాత తెలంగాణలో మునుపెన్నడూ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

పరీక్షకు హాజరైనా గైర్హాజరైనట్లుగా చూపించి ఫలితాలలో ఫెయిల్ అని కొందరికి రాగా.. మరి కొందరి విషయంలో మొదటి సంవత్సరం మంచి మార్కులతో టాపర్లుగా నిలిచిన వారు కూడా రెండో సంవత్సరం ఇంటర్‌లో ఫెయిల్ అయ్యినట్టు ఫలితాలు వచ్చాయి.

ఇందుకు ఉదాహరణ మంచిర్యాలకు చెందిన నవ్య. ఇంటర్ మొదటి సంవత్సరంలో మండల టాపర్. కానీ రెండో సంవత్సరం ఇంటర్ లో తెలుగు సబ్జెక్టులో సున్నా మార్కులు రావటంతో ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి. అయితే రీకౌంటింగ్ చేయగా అదే తెలుగు సబ్జెక్టులో వందకు 99 మార్కులు వచ్చాయి.

ఫొటో క్యాప్షన్,

నవ్య

"ఒక్కసారిగా తోటి విద్యార్థులు ముందు సిగ్గుగా అనిపించింది. అలా ఎలా ఫెయిల్ అవుతాను అనిపించింది. కానీ ఒక్క క్షణం నిజమేనేమో అనిపించింది. ఇప్పుడు మళ్లీ సవరణ చేసి 99 మార్కులు అని చెప్పారు. కానీ ఆ రోజున నేను ఆవేశంలో ఏమైనా చేసుకొని ఉంటే ఇవాళ నేను పాస్ అని తెలిసినా ఏమి ఉపయోగం ఉండేది. ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది. మాలాంటి పేద విద్యార్థులు భవిష్యత్తుతో ఇలా ఎలా చెలగాటం ఆడుతున్నారు అధికారులు" అని ప్రశ్నించారు నవ్య.

దీంతో విద్యార్థుల తల్లి తండ్రులు హైదరాబాద్ లోని విద్యాభవన్ బయట ఆందోళనకు దిగారు. ముంతాజ్ శుక్రవారం నుండి రోజూ హైదరాబాద్ లోని విద్యాభవన్ కి వస్తున్నారు.. కానీ అధికారుల నుంచి ఏ సమాధానం దొరకడం లేదని చెబుతున్నారామె.

"మా అబ్బాయి రెండో సంవత్సరం ఇంటర్ పరీక్షలు రాసాడు. మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివాడు. మొదటి సంవత్సరంలో మాథ్స్ పేపర్ లో ఫుల్ మార్కులు వచ్చాయి. ఇప్పుడు రెండో సంవత్సరంలో ఒక మాథ్స్ పేపర్ లో ఆరు మార్కులు మాత్రమే వచ్చాయి. అది ఎలా సాధ్యం? రీవాల్యూయేషన్ కి పెట్టుకోండి అంటున్నారు. డబ్బులు చెట్లకి కాస్తున్నాయా? ఏదో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నాము"అని తమ సమస్య తెలిపారు.

అయితే ఇదే పరిస్థితి మరో తల్లి ఝాన్సీది కూడా. వాళ్ల అబ్బాయికి ఫిజిక్స్ లో ఫెయిల్ అని ఫలితాలు వచ్చాయి. "నేను సింగిల్ మదర్. నాకు ముగ్గురు పిల్లలు. టెన్త్ లోను, కాలేజీలోను టాప్ టెన్ లో ఉన్న మా అబ్బాయి ఎలా ఫెయిల్ అవుతాడు? రిజల్ట్స్ చూసుకొని షాక్‌లో ఉన్నాడు మా అబ్బాయి. వాడు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అన్న భయంతో మా ఇంట్లో వాళ్లందరము 24 గంటలు వాడితోనే ఉంటున్నాము. డిఫెన్స్ సర్వీసెస్ కి వెళ్ళాలి అనుకున్నాడు. ఇప్పుడు మరి ఆ ఎగ్జామ్స్ కి అప్ప్లై చేసుకోవాలో లేదో పాలుపోవట్లేదు నాకు" అన్నారు ఝాన్సీ.

ఫొటో క్యాప్షన్,

ఝాన్సీ

వీరిద్దరే కాదు హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు అనేక మంది విద్యార్థులు తల్లి తండ్రులు తమ భవిష్యత్తు ఏమిటా అన్న ఆందోళనతో ఉన్నారు.

అయితే ఇంటర్మీడియట్ విద్యామండలి మాత్రం తప్పులు జరిగాయన్న వార్తలు అవాస్తవమని తెలిపింది.

"విద్యార్థులకు అనుమానాలు ఉంటె రీవెరిఫికేషన్ కి రూ. 600 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకుంటే, జవాబు పత్రం ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం ఉంది. లేక పోతే రీకౌంటింగ్ కి 100 రూ చెల్లించి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆందోళన చెందవలసిన అవసరం లేద"ని విద్యామండలి కార్యదర్శి అశోక్ ఒక పత్రిక ప్రకటన ద్వారా శనివారం తెలిపారు.

ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 27 వరకు ఈ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పెట్టుకోవచ్చు.

అయితే సోమవారం ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి మాట్లాడుతూ ఇంటర్ బోర్డుపై వస్తున్న అపవాదులు, అసత్య ప్రచారాలు నిజం కావు అని చెబుతూనే.. నవ్య విషయంలో తప్పిదం జరిగిందని తెలిపారు.

"ఫలితాల విడుదల సక్రమంగానే జరిగింది.. సమయానికి ఓఎంఆర్ షీట్లు అందలేదు.. అలాంటి ముగ్గురి మార్కుల షీట్లు కరెక్ట్ చేసాం. ఓఎంఆర్ షీట్ లిపి పార్ట్ త్రీలో బబ్లింగ్ సిస్టం ఉంటుంది. నవ్య విషయంలో 99బదులు 0కు బబ్లింగ్ చేసారు. ఎగ్జామినర్ తప్పిదం వల్లే జరిగింది నవ్య మెమోల్లో మార్కులు తప్పుగా వచ్చాయి. ఇది చాలా పెద్ద తప్పిదం.. మెమో ఇస్తాం.. ఫైన్ కూడావేస్తాం. మీడియాలో వచ్చిన కథనాలుకు స్పందించి నవ్య పేపర్ ను కరెక్ట్ చేశాం" అని అధికారి తెలిపారు. కానీ ఆబ్సెంట్ అయినా పాసాయ్యరన్నది కరెక్ట్ కాదని తెలిపారు.

ఈ సారి మార్కులను ప్రకటించే టెండర్‌ను 'గ్లోబరినా' అన్న కొత్త ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. దీని మూలంగానే ఇలా అవకతవకలు జరిగాయని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు విద్యామండలి అధికారులు.

"ఈ ప్రొక్యుర్ ద్వారా గ్లోబరీనా హక్కులు దక్కించుకుంది. ఐటీ శాఖ అధికారులు.. ఇంటర్ బోర్డు అధికారులతో విచారణ జరిపిన తరువాతే గ్లోబరినాకు ఇచ్చాం. మూడెళ్ళు మాత్రమే వారికి అవకాశం ఉంటుంది. అవకతవకలు జరిగాయని అనుమానం వస్తే విద్యార్థులకు పేపర్ ఇస్తాం. తప్పులేదని నేననడం లేదు.. క్షేత్రస్థాయిలో తప్పులు జరిగి ఉండవచ్చు" అని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి అశోక్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

మూడు సబ్జెక్టుల పరీక్షకు హాజరు కాకపోయినా పాస్ అయినట్లు చూపిస్తున్న మార్కుల జాబితా

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం రాష్ట్ర విద్యాశాఖా కార్యదర్శి జనార్దన్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నత అధికారులతో సమీక్షించారు. ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలను తొలగించడానికి గాను టిఎస్‌టిఎస్ ఎండి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ వేశామని... వెంకటేశ్వర్ రావుతో పాటు హైదరాబాద్ బిట్స్‌కు చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ నిశాంత్‌లు ఇందులో సభ్యులుగా ఉంటారని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. "కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలతో ఈ అపోహలు సృష్టించినట్లు మా దృష్టికి వచ్చిందని" ఆయన పేర్కొన్నారు. బుధవారం ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది.

మరోవైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. "ఇది చిన్న విషయంగానే అనిపిస్తుంది. మార్కులు రాకపోతోనే, తక్కువ మార్కులు వచ్చాయనో ఆందోళనకి గురై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పిల్లలకు సున్నితమైన మనస్తత్వం ఉంటది. ఈ వయసులో కష్టపడ్డాక కూడా ఫెయిల్యూర్ ఎదుర్కోవడం అందరి వల్ల సాధ్యం కాదు. దానికి తల్లిదండ్రులు కూడా పిల్లలని ముందు నుంచే ప్రిపేర్ చేయాలి. ఒత్తిడి పెట్టడం మూలాన వచ్చేది ఏమి లేదు" అన్నారు ఓ తండ్రి రాధా కృష్ణ.

కాగా గ్లోబరీనా సంస్థ పొరపాట్ల కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణల నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు ‘బీబీసీ తెలుగు’ ఆ సంస్థను సంప్రదించింది. కానీ, వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం మంగళవారం జరిగింది. కమిటీ సభ్యులైన ప్రొఫసర్ నిశాంత్ బీబీసీతో మాట్లాడుతూ.. "ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలన్నదే కమిటీ ఆశయం. విద్యార్థుల భవిష్యత్తుకి సంబందించిన విషయం ఇది. త్వరలోనే నివేదిక ఇస్తాము. కానీ వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వటం కూడా ముఖ్యమే. కావున అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరిపి ఒక సమగ్రమైన నివేదిక ఇస్తాము. ఇప్పుడు అంతకంటే ఎక్కువ చెప్పలేము" అన్నారు.

ఫొటో క్యాప్షన్,

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం

ఇంటర్మీడియట్‌లో ఫెయిలైన 3.28 లక్షల మందికి ఉచితంగా రీవెరిఫికేషన్: కేసీఆర్

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఈ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు.

భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసరించాల్సిన విధానం ఖరారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, కాబట్టి విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన కోరారు.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీయట్ విద్యార్థుల డాటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఈ ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకు బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు.

కాగా ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)