లోక్‌సభ ఎన్నికలు 2019: మూడోదశ పోలింగ్‌లో 65 శాతం ఓటింగ్

నరేంద్ర మోదీ ఓటు

ఫొటో సోర్స్, narendramodi/twitter

దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 117 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

సాయంత్రం 5 గంటలకు 62.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. మొత్తంగా 65 శాతం పోలింగ్ నమోదైంది.

సాయంత్రం 5 గంటలకు అందిన సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 78.94 శాతం ఓటింగ్ నమోదు కాగా జమ్ముకశ్మీర్‌లో అతి తక్కువగా 12.46 శాతం పోలింగ్ రికార్డైంది.

రాష్ట్రాలవారీగా పోలింగ్(సాయంత్రం 5 గంటలకు)

పశ్చిమబెంగాల్‌లో ఘర్షణలు.. ఓటరు మృతి

పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముర్షీదాబాద్‌లో ఓటు వేయడానికి వచ్చిన ఓ యువకుడు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలకు బలయ్యాడు.

ఈ మేరకు ఏఎన్‌ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

మూడో దశలో ఎక్కడెక్కడ?

ఈ దశలో గుజరాత్(26), కేరళ(20), కర్ణాటక(14), మహారాష్ట్ర(14), అసోం(4), బిహార్(5), ఒడిశా(6), ఉత్తర్ ప్రదేశ్(10), ఛత్తీస్‌గఢ్(7), పశ్చిమ బంగ(5), డయ్యూ దమన్(1), దాదర్ నగర్ హవేలీ(1) జమ్ము-కశ్మీర్(1) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తొలుత తల్లి ఆశీర్వాదం తీసుకున్న ఆయన అనంతరం పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేశారు.

ఓటర్లంతా రికార్డు స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Pib

వాస్తవానికి మూడో దశలో 115 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాలి.

కానీ, త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానానికి జరగాల్సిన ఎన్నికలను రెండో దశ నుంచి మూడో దశకు వాయిదా వేశారు.

జమ్ముకాశ్మీర్ అనంతనాగ్ స్థానానికి కూడా ఈ దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

మూడో దశలో కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, అమిత్ షా సహా ములాయం సింగ్ యాదవ్, జయప్రద, వరుణ్ గాంథీ, శశి థరూర్, మల్లికార్జున ఖర్గే ఇతర ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఈ దశలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇటు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి బరిలో నిలిచారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఈ దశలో మొత్తం 1640 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

వీరిలో అత్యధికంగా బీజేపీ నుంచి 99 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, బీఎస్పీ నుంచి 94, కాంగ్రెస్ నుంచి 92 మంది బరిలో నిలిచారు.

మూడో దశలో 116 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటూ ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.

ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)