జేసీ దివాకర్ రెడ్డి: ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ. 8750 కోట్లు.. అంతా అవినీతి డబ్బే’ - ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 50 కోట్లు దాకా ఖర్చు పెట్టారని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు మేధావులతో కలిసి ఉద్యమిస్తానని టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.
''మేమిది చేశాం, ఇంకా ఇది చేస్తామని చెప్పుకొని ఓట్లు అడగవచ్చు. కానీ... వేల కోట్లు ఖర్చు చేసి, గెలుపోటముల కోసం ఎదురు చూడడం సరికాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశానికి వచ్చిన జేసీ అక్కడే మీడియాతో మాట్లాడారు.
''రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తగ్గకుండా... రూ.50 కోట్ల వరకు ఖర్చుపెట్టారు.
ఈ లెక్కన 175 నియోజకవర్గాలకు రూ.8,750 కోట్లు అవుతుంది. గెలుపు కోసం ఒకాయన రూ.2 వేలు ఇస్తుంటే ఇంకొకాయన రూ.2,500 ఇస్తున్నాడు.
కొంత మంది ఎవరెవరు డబ్బులిస్తారా అని ఎన్నికల కోసమే కాచుకుని కూర్చుంటున్నారు. రూ.2 వేలు ఇస్తుంటే, ప్రజలు వచ్చి రూ.5 వేలు డిమాండ్ చేశారు.
ఈ డబ్బంతా అవినీతి డబ్బే! ఇంత అవినీతి జరుగుతుంటే దేశంలో అందరూ చూస్తూ కూర్చుంటున్నారు. ఈ విధానంపై ఎవరో ఒకళ్లు నడుం బిగించాలి'' అని జేపీ వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
తప్పు ఏ ఒక్కరిదో కాదన్నారు. ఈ విధానం మార్చాల్సిన బాధ్యత నాయకులు, అధికారులు, మేధావులపై ఉందన్నారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.
''వచ్చే ఐదేళ్లలో ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నిస్తా. దీనిపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వంటి మేధావులు, సంస్కర్తలతో చర్చావేదికలు ఏర్పాటు చేస్తా" అని జేసీ చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/Gandra Venkataramana Reddy
టీఆర్ఎస్ గూటికి గండ్ర
భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ఈనాడు కథనం ప్రచురించింది.
తెలంగాణలో మరో కాంగ్రెస్ శాసనసభ్యుడు తెరాసలో చేరనున్నారని ఈనాడు తెలిపింది.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తన భార్య జ్యోతితో సోమవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు.
అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు ఈనాడు కథనంలో తెలిపారు.
కేటీఆర్‌ను కలిసిన అనంతరం గండ్ర లేఖను విడుదల చేశారు. ''జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నాను.'' అని ఆయన ఆ లేఖలో పేరొన్నారు.
టీఆర్ఎస్‌లో చేరేందుకు ముందుకొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భూపాలపల్లి నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించిన బి-ఫారాలను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అందజేసినట్లు ఈనాడు పేర్కొంది.
పార్టీ ఎమ్మెల్యేలకు, అభ్యర్థులకు ఎంపిక బాధ్యతలు ఇవ్వాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఫొటో సోర్స్, Inter board
ఏ జవాబు పత్రం అడిగినా చూపిస్తాం: తెలంగాణ ఇంటర్ బోర్డు
ఇంటర్ మూల్యాంకనం పారదర్శకంగానే జరిగిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి చెప్పినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
ఇంటర్ ఫలితాలపై వచ్చిన అపోహల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కోరారు.
ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తప్పుచేసినవారికి మెమో జారీచేయడంతోపాటు జరిమానా విధిస్తామని తెలిపారు.
ఇంటర్ బోర్డు పారదర్శకంగానే పనిచేస్తున్నదని స్పష్టంచేశారు.
ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్కడక్కడా క్షేత్రస్థాయిలో తప్పులు జరిగాయని, ముగ్గురు విద్యార్థుల మెమోల్లో తప్పులువస్తే వాటిని సవరించామని చెప్పినట్లు నమస్తే తెలంగాణ చెప్పింది.
తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, 21 వేల జవాబు పత్రాలు గల్లంతైనట్టు తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, నిజానికి ఏ ఒక్క పేపరూ గల్లంతు కాలేదని స్పష్టంచేశారు.
ఏ జవాబుపత్రం అడిగినా చూపిస్తామని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు పహారా ఉంటుందని, అందువల్ల పేపర్లు గల్లంతయ్యే అవకాశమే లేదని వివరించారు.
తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షకు హాజరుకానివాళ్లు ఉత్తీర్ణులైనట్టు, హాజరు అయినవారు ఫెయిల్ అయినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు.
అనర్హులైన అధ్యాపకులతో మూల్యాంకనం చేయించినట్టు వస్తున్న ఆరోపణలు కూడా నిరాధారాలని చెప్పారు. అర్హులైన బోర్డు అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించినట్టు తెలిపారు.
విద్యార్థులు సెంటర్ మారడంవల్లే ఏఎఫ్, ఏపీ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయని వివరించారు.
నవ్య అనే విద్యార్థిని విషయంలో చోటుచేసుకున్న పరిణామాలను అశోక్ వివరిస్తూ.. ఓఎంఆర్ షీట్లో మార్కుల స్థానంలో బబ్లింగ్ చేయడంలో పొరపాటు వల్ల 99 మార్కులు వస్తే 0 మార్కులు వచ్చినట్టు వేశారని తెలిపారు.
మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి వెంటనే జవాబు పత్రం తీసుకొచ్చి చూడగా ఆమెకు 99 మార్కులు వచ్చినట్టు తేలిందన్నారు. ఈ తప్పులకు ఎగ్జామినర్, స్క్రూటినైజర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంటనే పొరపాటును సరిదిద్ది ఆ విద్యార్థినికి సమాచారం ఇచ్చామని చెప్పారు.
ఏవైనా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని అశోక్ సూచించారు.

ఫొటో సోర్స్, facebook/Pandu Gowd's
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్
ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సాక్షి సహా అన్ని ప్రధాన పత్రికలు కథనం ప్రచురించాయి.
ఐపీఎల్-12 ఫైనల్ నిర్వహణ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం మే 12న చెన్నైలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానానికి తరలించారు.
చెన్నై చెపాక్ స్టేడియంలో మూడు స్టాండ్ల వినియోగానికి సంబంధించి అనుమతులు పొందడంలో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) విఫలం కావడంతో మార్పు తప్పనిసరైనట్లు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు.
ఈ పరిణామం డిఫెండింగ్ చాంపియన్, స్థానిక జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కొంత నిరాశ పరిచేదే.
అయితే, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడం ద్వారా చెన్నై క్వాలిఫయర్-1ను సొంత మైదానంలో ఆడే అవకాశం ఉంది.
గతేడాది విజేత జట్టుకు చెందిన మైదానం అయినందున క్వాలిఫయర్-1 వేదికను మార్చే వీలు లేకపోయింది.
మరోవైపు ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
దీనికితోడు మూడు జట్లతో కూడిన మహిళల మినీ ఐపీఎల్‌కు మే 6 నుంచి 10వ తేదీ మధ్య జైపూర్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్‌కు తోడు కొత్తగా వెలాసిటీ జట్టు ఇందులో పాల్గొననుంది.
ఇవి కూడా చదవండి:
- కిరణ్ బేడీని ఇందిరా గాంధీ లంచ్‌కు ఎందుకు ఆహ్వానించారు?
- ఈ మరుగుజ్జు గ్రహానికి పేరు పెట్టే ఛాన్స్ మీదే
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- లోక్‌సభ ఎన్నికలు 2019: లఖ్‌నవూలో రాజ్‌నాథ్ సింగ్‌కు గట్టి పోటీఇచ్చేదెవరు
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)