వేట నిషేధం: మ‌త్స్య‌కారుల‌ కుటుంబాలకు మ‌హిళ‌లే ఆధారం

వేట నిషేధం: మ‌త్స్య‌కారుల‌ కుటుంబాలకు మ‌హిళ‌లే ఆధారం

స‌ముద్రంలో వేట నిషేధం అమ‌లులోకి వ‌చ్చింది. ఏటా రెండు నెల‌ల పాటు స‌ముద్రంలో మ‌త్స్య‌ సంప‌ద ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం ఈ నిషేధాన్ని అమ‌లులోకి తెచ్చింది.

తొలుత ఒక నెల రోజుల పాటు అమ‌లు చేసిన ఈ నిషేధం క్ర‌మంగా పెంచారు. ప్ర‌స్తుతం 61 రోజులు పాటు ఉంటుంది. పుష్క‌ర కాలంగా అమ‌ల‌వుతున్న ఈ చేప‌ల వేట నిషేధం ద్వారా ల‌భించిన ఫ‌లితాల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేష‌న్ యాక్ట్ 1995 ప్ర‌కారం స‌ముద్రంలో చేప‌ల వేట‌పై ప‌లు ఆదేశాలున్నాయి. ఈ చ‌ట్టం 1997 నుంచి అమ‌లులోకి వచ్చింది. ఇక 2007 నుంచి ఏపీలో ఏటా రెండు వేస‌విలో చేప‌ల వేట‌పై నిషేధం అమ‌ల‌వుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి అమ‌లులోకి వ‌చ్చింది. జూన్ 14 వ‌ర‌కూ స‌ముద్రంలో వేట కోసం ఎటువంటి బోట్లు అనుమ‌తించ‌రు. తొలుత మెటార్ బోట్ల‌పై మాత్ర‌మే నిషేధం పెట్టిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం నాటు ప‌డ‌వ‌ల‌పై కూడా చేప‌ల వేట ను నిలిపివేశారు.

మ‌త్స్య‌సంప‌ద కాపాడుతున్నాం

చేప‌ల వేట‌ను నిషేధించ‌డం ద్వారా ఈ కాలంలో మంచి ఫ‌లితాలు సాధించామ‌ని మ‌త్స్య‌శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వీవీ రావు బీబీసీకి తెలిపారు.

"బంగాళాఖాతంలో గ‌తంలో విలువైన జీవ‌రాశులుండేవి. కానీ, రానురాను వాటి సంప‌ద త‌గ్గిపోతోంది. ముఖ్యంగా వేస‌విలో గుడ్లు పెట్టే ద‌శ‌లో వేట కార‌ణంగా పున‌రుత్ప‌త్తి ప‌డిపోతోంది. దాంతో అరుదైన జాతులు కూడా క‌నుమ‌రుగ‌వుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కూ చేప‌ల వేట నిషేధం ద్వారా గుడ్లు పెట్టే స‌మ‌యంలో ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తున్నాము. దాని ద్వారా మంచి ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్టు రికార్డులు చెబుతున్నాయి. తొలుత ఏపీలో మొద‌ల‌యిన ఈ ప్ర‌య‌త్నం ప్ర‌స్తుతం బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్న అన్ని రాష్ట్రాల‌లోనూ అమ‌లు చేస్తున్నారు. వేట నిషేధ స‌మ‌యంలో ప్ర‌భుత్వం మ‌త్స్య‌కారుల‌కు ప‌రిహారం కూడా అందిస్తూ వారి జీవ‌నోపాధికి ఆటంకం లేకుండా చూస్తోంది" అని ఆయన వివ‌రించారు.

జీవితంలో స‌గం రోజులు క‌డ‌లి కెర‌టాల‌పై ప‌య‌నం సాగించే మ‌త్స్య‌కారుల‌కు ప్ర‌స్తుతం ఏటా రెండు నెల‌ల పాటు వేట విరామం పాటించాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌డం లేదు.

తొలుత వేట నిషేధం అమ‌లు చేసేందుకు అనేక చోట్ల అధికారులు పెద్ద స్థాయిలో ఒత్తిడి తీసుకురావాల్సి వ‌చ్చేది. కానీ, ప్ర‌స్తుతం వేట నిషేధం సులువుగానే అమ‌లులోకి వ‌స్తోంది. క‌న్నెర్ర చేసిన సంద్ర‌మ్మ రూపు చూసిన మ‌త్స్య‌కారులు ప్ర‌స్తుతం అధికారుల ఆదేశాల‌ను పాటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.