ఐపీఎల్ 2019: చెన్నై సూపర్ కింగ్స్.. జట్టు సక్సెస్ సీక్రెట్ చెప్పిన ధోనీ

  • ఆదేశ్ కుమార్ గుప్తా
  • బీబీసీ కోసం
ధోనీ

ఫొటో సోర్స్, TheChennaiSuperKings/facebook

ఐపీఎల్-12లో మంగళవారం కూడా ఒకే మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో గత చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. షేన్ వాట్సన్ 96 రన్స్ సాయంతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.

176 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది.

అంతకు ముందు సన్ రైజర్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. నిర్ధారిత 20 ఓవర్లలో మనీష్ పాండే 83 నాటౌట్, డేవిడ్ వార్నర్ 57 రన్స్ సాయంతో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత తన బౌలర్లను వెనకేసుకొచ్చిన హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్.. షేన్ వాట్సన్ అలా చెలరేగి బ్యాటింగ్ చేస్తుండడంతో అతడిని ఆపడం కష్టమైపోయిందని అంగీకరించాడు.

ఈ మ్యాచ్‌లో గెలిచిన చెన్నై ఐపీఎల్‌లో తన 8వ విజయంతో 16 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకుంది.

దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ప్లేఆఫ్‌కు అంటే చివరి నాలుగు టీమ్స్‌లోకి చేరిన తొలి జట్టుగా నిలిచింది.

చెన్నై ఇప్పటివరకూ 11 మ్యాచుల్లో 8 మ్యాచ్‌లు గెలిచి కేవలం మూడింటిలో ఓడింది. ఈ విజయంతో చెన్నై గత 2 మ్యాచ్‌ల ఒత్తిడి నుంచి కూడా బయటపడింది.

ఫొటో సోర్స్, Pti

హైదరాబాద్‌పై చెన్నైకు విజయాన్ని అందించిన షేన్ వాట్సన్ చాలా రోజుల తర్వాత బ్యాట్‌తో అద్భుతం చేశాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన షేన్ వాట్సన్ తర్వాత ఐపీఎల్‌లో ఆడడం ద్వారా తనకు బిగ్ బ్యాష్ లీగ్‌లో ఆడే ప్రయోజనం లభించిందని అన్నారు.

కేవలం 53 బంతుల్లో ఆరు సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసిన షేన్ వాట్సన్, తన అద్భుత షాట్లతో అందరినీ ఆకట్టుకున్నాడు.

మొదట్ల కాస్త నెమ్మదిగా ఆడినా, తర్వాత ఒక్కసారిగా పుంజుకున్న షేన్ వాట్సన్‌ను ఆపడం హైదరాబాద్ బౌలర్లకు కష్టమైపోయింది.

ముఖ్యంగా వాట్సన్ హైదరాబాద్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్‌కు చుక్కలు చూపించాడు.

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/GETTY IMAGES

షేన్ వాట్సన్‌కు సురేష్ రైనా నుంచి మంచి అండ దొరికింది. రైనా 24 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు.

సందీప్ శర్మ వేసిన ఒకే ఓవర్లో రైనా నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టడం విశేషం. చెన్నై ఇన్నింగ్స్‌లో అది ఆరో ఓవర్.

అంతకు ముందు ఐదో ఓవర్లో చెన్నై స్కోర్ ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు. ఆరో ఓవర్ తర్వాత జట్టు స్కోర్ ఒక వికెట్ నష్టానికి 49 పరుగులకు చేరింది.

ఈ ఓవర్‌ను మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా చెప్పచ్చు. ఎందుకంటే ఆ తర్వాత చెన్నైపై ఎలాంటి ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించలేదు.

అయితే చెన్నై ప్రారంభం సరిగా లేదు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డుప్లెసి కేవలం ఒక్క పరుగుకే రనౌట్ అయ్యాడు.

మూడు పరుగులకు మొదటి వికెట్ పడిన తర్వాత వాట్సన్, సురేష్ రైనాతో కలిసి మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

మిగతా పనిని అంబటి రాయుడు(21), కేధార్ జాదవ్(11 నౌటౌట్) పూర్తి చేశారు.

హైదరాబాద్‌ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు వచ్చాయి. 3.4 ఓవర్ల వేసిన సందీప్ 54 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

తనతోపాటు స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

మనీష్ పాండే

అంతకు ముందు హైదరాబాద్ టీమ్ టాస్ ఓడి బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి దిగింది.

మంచి ఫాంలో ఉన్న జానీ బెయిర్‌స్టోను ఖాతా తెరవకముందే అవుట్ చేసిన హర్భజన్ సింగ్ చెన్నైకి ప్రారంభంలోనే జోష్ ఇచ్చాడు.

జట్టు స్కోర్ 5 పరుగుల దగ్గర బెయిర్‌స్టో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత రెండో వికెట్‌కు డేవిడ్ వార్నర్, మనీష్ పాండే 115 రన్స్ జోడించారు.

డేవిడ్ వార్నర్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 57 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో వార్నర్‌కు ఇది వరసగా ఆరో హాఫ్ సెంచరీ.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డేవిడ్ వార్నర్

ఇతడు కూడా హర్భజన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన వార్నర్ బంతి మిస్ చేయగానే ధోనీ మెరుపు వేగంతో బెయిల్స్ ఎగరగొట్టాడు.

ఆ తర్వాత చెన్నై బౌలర్లను ఎదుర్కున్న మనీష్ పాండే ఒంటరి పోరాటం చేశాడు. 49 బంతులు ఎదుర్కుని 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

సన్ రైజర్స్ నాలుగు వికెట్లకు 175 పరుగులు చేసినా అది ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ విజయాన్ని ఆపలేకపోయింది.

గత కొన్ని మ్యాచుల్లో తక్కువ పరుగులకే అవుటైన షేన్ వాట్సన్ తిరిగి ఫాంలోకి రావడంతో చెన్నై విజయం సులభమైంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన చెన్నై స్పిన్నర్ హర్భజన్ సింగ్ షేన్ వాట్సన్ ఇప్పటికీ తమ జట్టుకు చాలా కీలకమైన ఆటగాడని అన్నాడు.

గత ఐపీఎల్‌ ఫైనల్లో సెంచరీ చేసిన వాట్సన్ చెన్నైని ఒంటిచేత్తో గెలిపించాడు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

మహేంద్ర సింగ్ ధోనీ

మా సీక్రెట్ అదే.. - ధోనీ

ఇటు కెప్టెన్ ధోనీ కూడా అతడు మ్యాచ్ గెలిపించే ఆటగాడని, కొన్ని మ్యాచ్‌లలో సరిగా ఆడనంత మాత్రాన అతడిని పక్కనపెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పాడు.

ఆ తర్వాత ధోనీ మరో ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

చెన్నై విజయానికి మెరికల్లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడమే మా ట్రేడ్ సీక్రెట్ అని చెప్పిన ధోనీ, డ్రెస్సింగ్ రూంలో విఫలమైన ఆటగాళ్ల మూడ్ సరి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న స్పోర్ట్స్ స్టాఫ్‌కు కూడా ఆ క్రెడిట్ దక్కుతుందని అన్నాడు.

ఏదేమైనా ఇంతకు ముందు మ్యాచ్‌లో స్వయంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ధోనీ తను పదేళ్లు వెనక్కు వెళ్లినట్టు విమర్శకులతోనే చెప్పించాడు.

ఇటు ఈ ఏడాది జూన్ 17కు 38వ ఏట అడుగుపెట్టనున్న షేన్ వాట్సన్ కూడా తాజా మ్యాచ్‌లో మైదానంలో మెరుపులు మెరిపించి జట్టును ప్లేఆఫ్ చేర్చాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)