శ్రీలంకలో పేలుళ్లు... ఏపీలో తనిఖీలు : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
పేలుళ్ల నేపథ్యంలో కొలంబోలో గస్తీ కాస్తున్న శ్రీలంక భద్రతా బలగాలు
శ్రీలంక పేలుళ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించిందని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనం ప్రచురించింది. అందులో..
సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలోని 9 జిల్లాల్లోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో మంగళవారం బాంబ్ స్క్వాడ్, పోలీస్ డాగ్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని, ఏపీకి ఎలాంటి ప్రమాదం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు చెప్పారని కూడా ఆంధ్రజ్యోతి పేర్కొంది.
అమ్మో శ్రీలంకకా!
శ్రీలంక పేలుళ్లతో, తమిళనాడులో తలదాచుకుంటున్న శ్రీలంక శరణార్థులు భయకంపితులయ్యారు. స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్న వారంతా బాంబు పేలుళ్ల అనంతరం వెనకడుగు వేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 107 శరణార్థ శిబిరాల్లో 61 వేల మంది శరణార్థులున్నారు. వీరంతా ఈలం యుద్ధ సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు తమిళనాడు వచ్చారు.
చేపల వేటపై ఎక్కువగా ఆధారపడే శరణార్థులు, స్వదేశానికి తిరిగి వెళితే మంచి జీవితం సాగించవచ్చని మొన్నటివరకు ఆశగా ఉన్నారని, ఈ పేలుళ్లతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయని శరణార్థుల పునరావాస సంస్థ వ్యవస్థాపకుడు తందైసెల్వ కుమారుడు ఎస్‌సీ చంద్రహాసన్ అన్నారంటూ ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
‘సునామీ వస్తే చేతులెత్తేస్తారా?’
సునామీ వస్తే చేతులెత్తేస్తారా? అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి చురకలంటించిందంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
‘సునామీ లాంటిది వస్తే ఏం చేయలేమని చేతులు ఎత్తేసి నిస్సహాయత వ్యక్తం చేస్తారా, మా బాధ్యత కాదని వదిలేస్తారా? ఇంటర్మీడియట్ బోర్డులో సమస్య ఉందని చెబుతున్నప్పుడు దానిని పరిష్కరించే చొరవ చూపాలి. సిబ్బంది లేరనో.. సరైన యంత్రాంగం లేదనో చెప్పి బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడొద్దు’ అని హైకోర్టు తెలిపింది.
‘సుమారు తొమ్మిది లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తే అందులో పరీక్ష తప్పిన మూడు లక్షల మంది పేపర్లను యుద్ధప్రాతిపదికపై తిరిగి వాల్యుయేషన్ చేసేందుకు ఏకంగా రెండు మాసాల సమయం కావాలా.. తొమ్మిది లక్షల మంది విద్యార్థుల పేపర్లను ఒకే ఒక్క నెలలో వాల్యుయేషన్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు తన ముందున్న సంక్షోభాన్ని పరిష్కరించాల్సిందే..’ అని తెలంగాణ హైకోర్టు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల బాగోతంపై తీవ్ర స్థాయిలో స్పందించింది.
‘ఇంటర్ పరీక్ష తప్పిన మూడు లక్షల మంది విద్యార్థుల సమస్యను ఏవిధంగా పరిష్కరించదలిచారో మీనమేషాలు లెక్కించే పద్ధతిలో కాకుండా బాధ్యతతో విద్యార్థుల మానసిక వేదన, వారి తల్లితండ్రుల ఆందోళన కోణంలో చూసి ఈ నెల 29లోగా చెప్పి తీరాలి’ అని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లను సరిగ్గా వాల్యుయేషన్ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని హైకోర్టు పేర్కొంది.
ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారించాలని కోరారు.
దీనిని మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్య్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ పిల్‌ను విచారించింది.
‘క్లిష్ట సమయాల్లోనే పనిచేసే సమర్ధతను నిరూపించాలి. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రమూకలు దాడి చేస్తే 58 ఏండ్ల వయసులో ఉన్న అగ్నిమాపక అధికారి ఆ విపత్తు నివారణ చర్యలు ప్రారంభించారు. పది రోజుల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల సమస్యను ఎందుకు పరిష్కరించలేరో ఆలోచన చేయండి. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించే మార్గాలతో 29న హైకోర్టుకు తెలియజేయండి..’ అని డివిజన్ బెంచ్ పేర్కొన్నట్లు నవతెలంగాణ పత్రిక పేర్కొంది.
ఫొటో సోర్స్, facebook
'గోవిందుడి కిరీటాలు కరిగించేశాడు'
తిరుపతి గోవిందరాజస్వామి కిరీటాలను ఓ దొంగ కరిగించేశాడంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...
దొంగలించిన గోవిందరాజస్వామి కిరీటాలను బంగారు ముద్దగా మార్చి చెన్నైలో విక్రయించేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు అందిన సమాచారంతో రేణిగుంట వద్ద మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా కు చెందిన నిందుతుడు ఆకాష్ ప్రతాప్ సరోడిని అదుపులోకి తీసుకున్నారు.
అతని నుంచి సుమారు రూ.42,35,385 విలువ చేసే బంగారు ముద్దను, ఐఫోన్ 7ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను మంగళవారం తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇతను 16 ఏండ్ల వయసు నుంచే పలుచోరీలు చేస్తు విలాసాలకు అలవాటు పడ్డాడు. ఇతనిపై మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు.
గోవిందరాజస్వామి ఆలయంలోకి వెళ్లిన నిందితుడు ఉప ఆలయమైన కల్యాణ వెంకటేశ్వరుని ఉత్సవ విగ్రహాలపైనున్న బంగారు కిరీటాలను కాజేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
అదే రోజు రాత్రి టీటీడీ రెండో సత్రంలో ఓ వ్యక్తి నుంచి ఐఫోన్ 7 ఎస్‌ను దొంగిలించాడని, ఫిబ్రవరి 2న ఉదయం మళ్లీ ఆలయంలోకి వెళ్లి పూజారి లేని సమయంలో 3 కిరీటాలను దొంగతనం చేశాడన్నారు.
వాటిని ఒకదానిపై మరొకటి పెట్టి జేబులో వేసుకుని అక్కడి నుంచి రేణిగుంట వద్ద ఉన్న వైన్‌షాపుకు చేరుకున్నాడు. అక్కడున్న ముళ్లపొదల్లో ఐఫోన్‌ను దాచిపెట్టి నాందేడ్‌కు వెళ్లిపోయాడని తెలిపారు.
ఆ కిరీటాల్ని తన స్నేహితుడు సాయంతో అక్కడే అమ్మే ప్రయత్నం చేసినా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని కరిగించి చెన్నైలో అమ్మేందుకు సిద్దమయ్యాడన్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట సమీపంలోని వైన్‌షాపు వద్దఉన్న ముళ్లపొదల్లో దాచిపెట్టిన ఐఫోన్ కోసం వస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తిరుపతి ఎస్పీ అన్బురాజ్ మీడియాతో అన్నారని నవతెలంగాణ పత్రిక పేర్కొంది.
ఫొటో సోర్స్, narendramodi/twitter
ప్రధాని మోదీపై ఇందూరు రైతుల పోటీ
ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి స్థానం నుంచి ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలని ఇందూరు రైతులు నిర్ణయించినట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
ఎర్రజొన్నకు మద్దతు ధర, పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలోకి దిగిన ఇందూరు రైతులు, తమ డిమాండ్లపై దేశవ్యాప్త చర్చ జరగాలని మరోసారి పోటీకి సిద్ధమయ్యారు.
ఇప్పటికే 50 మంది పోటీకి సమాయత్తమైనట్లు తెలంగాణ పసుపు రైతుల సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. గురువారం ఆర్మూర్ నుంచి 'చలో వారణాసి' కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు చెప్పారు.
ఈ నెల 29 వరకు అక్కడ నామినేషన్లకు గడువు ఉన్నందున ఈలోగా అక్కడికి చేరుకొని నామినేషన్లు వేయనున్నట్లు తెలిపారు. మద్దతుగా తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన పసుపు రైతులు వారి నేత పీకే దైవ శిగామణి ఆధ్వర్యంలో తరలివస్తున్నారని, వీరు కూడా నామినేషన్లు వేయనున్నారని చెప్పారు.
పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ కోసమే నామినేషన్లు వేస్తున్నామని, వేరే ఉద్దేశాలేమి లేవని చెప్పారు. ఏ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని వెల్లడించారు. తమ డిమాండ్‌కు మద్దతివ్వాలని ప్రధాన పార్టీలను కలుస్తామని చెప్పారు.
నిజామాబాద్‌లో రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవితను లక్ష్యంగా చేసుకొని ప్రచారం నిర్వహించటం వల్ల, అసలు లక్ష్యం పక్కదారి పట్టిందన్నారు. కవిత పసుపు బోర్డు కోసం కృషి చేసినా.. భాజపా ప్రభుత్వం ఆ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టిందన్నారు.
నిజామాబాద్ నుంచి పోటీ చేయటం తేలికైన పనే. కానీ ఇతర రాష్ట్రంలోని నియోజకవర్గంలో పోటీ.. అదీ ప్రధాని బరిలో ఉండే స్థానంలో నామినేషన్లు వేస్తే తమ డిమాండ్‌పై దేశవ్యాప్త చర్చ జరుగుతుందనే వ్యూహంతోనే రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కుమార్తె బరిలో ఉన్న చోట పోటీ ద్వారా రాజకీయ వర్గాల్లో కదలిక వచ్చిందని భావించిన వీరు.. తదుపరి అస్త్రంగా వారణాసిని ఎంచుకున్నట్లు ఈనాడు దినపత్రిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- శ్రీలంక పేలుళ్లు: 290 మంది మృతి... 'టిఫిన్ తినడం ఆలస్యం కాకపోతే నేను కూడా..'
- మోదీకి జేజేలు కొడుతూ పాకిస్తాన్లో ర్యాలీ.. నిజమేనా
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
- ప్రధానమంత్రి హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారి తనిఖీ చేయొచ్చా...
- లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)