లైంగిక వేధింపుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు: నాలుగు ప్రశ్నలు

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
రంజన్ గగోయ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు జడ్జిలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై ఆయన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కోర్టులోని 22 మంది జడ్జిలతో దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

బాధితురాలి డిమాండుపై విచారణ కోసం సుప్రీంకోర్టు తన 'ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ' నుంచి విడిగా ఒక ప్రత్యేక కమిటీనైతే ఏర్పాటు చేసింది.

కానీ దానికి చట్టంలో ఏర్పాటు చేసిన చాలా నిబంధనలను పాటించకపోవడంపై నాలుగు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters

మొదటి ప్రశ్న- కమిటీ సభ్యులు

ముగ్గురు జడ్జిల ఈ కమిటీలో సీనియర్ హోదాలో ప్రధాన న్యాయమూర్తి తర్వాత స్థానంలో ఉండే జస్టిస్ బాబ్డే, జస్టిస్ రమణ, వీరితోపాటు ఒక మహిళా జడ్జి ఇందిరా బెనర్జీ ఉన్నారు.

ఈ జడ్జిలందరూ ప్రధాన న్యాయమూర్తికి జూనియర్లు.

ఏదైనా ఒక సంస్థ యజమానిపై అందులో పనిచేసేవారు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినప్పుడు, దాని విచారణను 'సెక్సువల్ హరాస్‌మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్ 2013 ప్రకారం సంస్థ లోపలే ఏర్పాటు చేసిన 'ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ'కి బదులు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే 'లోకల్ కంప్లైంట్స్ కమిటీ'కి అప్పగిస్తారు.

ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు అత్యున్నత పదవిలో ఉన్నారు. అందుకే బాధిత మహిళ కూడా విచారణ కమిటీలో రిటైర్డ్ జడ్జిలు ఉండాలని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images

రెండో ప్రశ్న - కమిటీ అధ్యక్షుడు

చట్టం ప్రకారం లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారించడానికి ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నత పదవిలో పనిచేస్తున్న ఒక మహిళ ఉండాలి.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి జస్టిస్ బాబ్డే అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయనకు ప్రధాన న్యాయమూర్తే ఈ పని అప్పగించారు.

ఫొటో సోర్స్, Reuters

మూడో ప్రశ్న- కమిటీలో మహిళా ప్రాతినిధ్యం

చట్ట ప్రకారం విచారణ కోసం ఏర్పాటు చేసిన 'ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ'లో మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది మహిళలు ఉండాలి.

ప్రస్తుత కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వారిలో కేవలం ఒకే ఒక మహిళ (మూడింట ఒక వంతు) ఉన్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ మిగతా ఇద్దరు సభ్యుల కంటే జూనియర్.

ఫొటో సోర్స్, Getty Images

నాలుగో ప్రశ్న- కమిటీలో స్వతంత్ర ప్రతినిధి

చట్ట ప్రకారం విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మహిళల కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థకు సంబంధించిన ఒక సభ్యుడు ఉండాలి.

కమిటీలోకి ఒక స్వతంత్ర ప్రతినిధిని తీసుకురావడానికి ఈ నిబంధనను పెట్టారు.

ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణల విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో స్వతంత్ర ప్రతినిధి ఎవరూ లేరు.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ ముగ్గురు సభ్యుల కమిటీ శుక్రవారం లైంగిక వేధింపుల ఫిర్యాదుపై విచారణ ప్రారంభించనుంది.

ఇటు ఉత్సవ్ బైంస్ అనే ఒక న్యాయవాది ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేసిన మహిళ కేసు వాదించడానికి, ఆమె తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి తనకు లంచం ఇవ్వజూపారని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

ఇదంతా ప్రధాన న్యాయమూర్తితో రాజీనామా చేయించేలా ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని ఆయన చెబుతున్నారు.

ఉత్సవ్ బైంస్ వాదనలపై వేరే బెంచ్ ద్వారా విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)