అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా గురించి మోదీ ఏమన్నారు

ఫొటో సోర్స్, Ani
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. వార్తా సంస్థ ఏఎన్ఐ కోసం అక్షయ్ చేసిన 67 నిమిషాల ఈ ఇంటర్వ్యూను దేశంలోని చాలా చానళ్లు ప్రసారం చేశాయి.
ప్రధాన మంత్రి నివాసంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మోదీని ఆయన దినచర్య, ఆహార అలవాట్లు, ఇష్టాయిష్టాలు, బాల్యం గురించి ప్రశ్నలు అడిగారు.
ఈ ఇంటర్వ్యూకు రాజకీయాలతో సంబంధం లేదని అక్షయ్ కుమార్ చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా జరుగుతున్న ఇంటర్వ్యూ ఇవ్వడం తనకూ బాగుందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. చాలా మంది ప్రధాన మంత్రి వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తున్నారు. అందుకు అనుగుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు విమర్శలూ కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా మంది ఎన్నికల సమయంలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల కూడా రాజకీయ ప్రభావం ఉండొచ్చని అంటున్నారు.
వైశాలీ అనే ట్విటర్ యూజర్ "ఇలా మోదీ తనను తాను ప్రచారం చేసుకుంటున్నారు. మనల్ని మనం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు" అన్నారు.
శశాంక్ కూడా అలాంటి పోస్టే పెట్టారు.
ఆయన "ఈ ఇంటర్వ్యూ కంటే మోదీపైన తీసిన సినిమాను రీలీజ్ చేసుంటే బాగుండేది. అసలు దేశంలో ఏం జరుగుతోంది" అని రాశారు.
ఫొటో సోర్స్, Ani
ట్వింకిల్ ట్వీట్స్ చూస్తుంటాను
అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రిని "మీరు మామిడిపండు కోసుకుని తింటారా లేక టెంకతోనే తింటారా", "జలుబు చేస్తే మీరు ఏం తీసుకుంటారు" లాంటి ప్రశ్నలు కూడా అడిగారు.
మీరెప్పుడైనా ప్రధాన మంత్రి కావడం గురించి అనుకున్నారా అని అక్షయ్ అడిగిన ప్రశ్నకు మోదీ "ఎప్పుడూ అనుకోలేదు. ఎవరికైనా అలాంటి ఫామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే వారి మనసులో ఆ కోరిక రావడం సహజమే. నాది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్. నాకు మామూలు ఉద్యోగం దొరికినా మా అమ్మ చుట్టుపక్కలవారి నోరు తీపి చేసుండేది. అందుకే నా దృష్టిలో ఇదంతా అనుకోకుండా జరిగింది" అన్నారు.
ప్రధాన మంత్రి అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా గురించి చేసిన వ్యాఖ్యపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఆయన "నేను సోషల్ మీడియా కచ్చితంగా చూస్తుంటా, దానివల్ల నాకు బయట ఏం జరుగుతోందో తెలుస్తుంది. నేను మీదే కాదు, ట్వింకిల్ ఖన్నా ట్విటర్ అకౌంట్ కూడా చూస్తుంటా. ఆమె తన కోపం అంతా నాపై చూపించడం వల్ల మీ కుటుంబంలో చాలా ప్రశాంతత ఉంటుందని నాకు అనిపిస్తోంది" అన్నారు.
దీనిపై ట్వింకిల్ ఖన్నా కూడా స్పందించారు.
ఆమె "నేను దీనిని పాజిటివ్‌గా తీసుకుంటున్నాను. ప్రధాన మంత్రికి నేనెవరనేది తెలీడమే కాదు, ఆయన నా రచనలు కూడా చదువుతున్నారు" అన్నారు.
అక్షయ్ కుమార్ ఆయన్ను ఇంత పెద్ద ఇంట్లోకి మీ కుటుంబాన్ని తీసుకురావాలని మీకు అనిపించదా అని కూడా అడిగారు. దానికి ప్రధాని చాలా చిన్న వయసులోనే అన్నీ వదిలేశానని, తన జీవితం 'డిటాచ్డ్' అయిపోయిందని చెప్పారు.
మోదీ అక్షయ్‌తో ఒకసారి నేను మా అమ్మను పిలిపించాను. కానీ నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తావు అనేవారు. నేను కూడా ఆమెకు సమయం కేటాయించలేకపోయేవాడ్ని. రాత్రి 12 గంటలకు వచ్చినపుడు, నేనేం చేస్తున్నానో అని మా అమ్మకు అనిపించేది.
ఫొటో సోర్స్, Ani
మమత నాకు కుర్తా-స్వీట్లు పంపించేవారు
అక్షయ్ ప్రధానిని ప్రతిపక్షాల్లో మీకెవరైనా స్నేహితులు ఉన్నారా అడిగారు. దానికి మోదీ చాలా మంది స్నేహితులున్నారు. ప్రతి ఏటా మేం అప్పుడప్పుడూ కలుస్తాం అని కూడా చెప్పారు.
"ఒక పాత విషయం ఉంది. అప్పటికి నేను ముఖ్యమంత్రి కూడా కాలేదు. నేను, గులాం నబీ పిచ్చాపాటీ మాట్లాడుకునేవాళ్లం. మీరెలాంటి ఫ్రెండ్స్ అని ఎవరో అడిగితే, గులాం నబీ మంచి సమాధానం ఇచ్చారు" అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని అక్షయ్‌తో.. మీరు నమ్మలేని విషయం ఒకటుంది. బహుశా దానివల్ల నాకు ఎన్నికల్లో నష్టం కూడా జరుగుతుందేమో. కానీ మమతా దీదీ ఇప్పటికీ నాకు ఏడాదిలో ఒకటి రెండు కుర్తాలు ఇచ్చి వెళ్తారు అని ప్రధాని ఇంకో విషయం కూడా చెప్పారు.
"బంగ్లాదేశ్ పర్యటనలో ప్రధాన మంత్రి షేక్ హసీనాతో బెంగాలీ స్వీట్స్ గురించి చర్చ జరిగింది. దాంతో ఆమె ఇప్పటికీ ఢాకా నుంచి నాకు స్వీట్లు పంపిస్తుంటారు. ఆ విషయం మమతా దీదీకి తెలీడంతో ఆమె కూడా ఏడాదిలో అప్పుడప్పుడూ స్వీట్లు పంపిస్తుంటారు" అన్నారు.
ట్విటర్ యూజర్ సాకేత్ రంజన్ దానిపై "మమతా దీదీ పంపించిన కుర్తా నేషనలిస్ట్, కానీ మమతా దీదీ యాంటీ-నేషనల్" అన్నారు.
@VTibdewala అనే ట్విటర్ యూజర్ ‘‘ఈ ఇంటర్వ్యూలోభక్తులకు ఏదైనా దొరికినా, జనాలకు పనికొచ్చేది మాత్రం ఏం లేదు" అని రాశారు.
తన పనితీరుపై మాట్లాడిన ప్రధాని బలవంతంగా రుద్దినంత మాత్రాన కచ్చితమైన క్రమశిక్షణ అలవడదు. నా జీవితమంతా మానవ వనరులపైనే ఉంది. మనం అబద్ధాలు చెప్పి ఎక్కువ రోజులు ప్రజలను ప్రభావితం చేయలేం అన్నారు.
ఫొటో సోర్స్, Ani
జోక్ చెప్పిన ప్రధాని
హ్యూమర్ విషయానికి వస్తే ప్రధాని తను బాల్యంలో అందరినీ ఎలా నవ్వించేవారో చెప్పారు. కానీ "ఇప్పుడు ప్రతి విషయానికీ వేరే అర్థం వెతుకుతారని అందుకే భయం వేస్తుందని. సోషల్ మీడియా బదులు ఈ టీఆర్పీ వాళ్లే ఎక్కువ చేస్తారు" అన్నారు.
నా క్యాబినెట్ మీటింగ్‌లో నేను స్నేహపూరిత వాతావరణం ఉండేలా చూసుకుంటాను. వాళ్లకు జోక్స్ చెబుతూ ఉంటాను.
ప్రధాన మంత్రి అక్షయ్ కుమార్‌కు ఒక జోక్ కూడా చెప్పారు. ఆయన "ఒకసారి మా దగ్గరకు రైలొచ్చింది. పైన ఒక యాత్రికుడు పడుకుని ఉన్నాడు. ఏ స్టేషన్ వచ్చింది అన్నాడు. ఎవరో పావలా ఇస్తే చెబుతానన్నాడు. అతను చెప్పాల్సిన అవసరం లేదులే, అహ్మదాబాదే అయ్యుంటుంది అన్నాడు" అన్నారు.
ప్రధాన మంత్రి ఒక సోషలిస్టు నేతపై కూడా ఒక జోక్ చెప్పారు. "ఒకసారి నేను పుణె స్టేషన్లో దిగా. నడిచివెళ్తున్నా. ఒక ఆటో వాడు మెల్లమెల్లగా నాతో వస్తున్నాడు. నేను అతడిని అడిగితే, మీరు కూచోరా, మీరు సోషలిస్టా అన్నాడు. నేను కాదు. నేను అహ్మదాబాదీని అన్నా. అంటే సోషలిస్టులు చూపులకోసం స్టేషన్లో దిగి ఆటో ఎక్కేవాళ్లు కాదు. కాస్త దూరం వెళ్లాక ఎక్కేవాళ్లు. వీళ్లు కష్టపడతారని అనిపించడానికి అలా చేసేవాళ్లు" అన్నారు.
తను మూడున్నర గంటలే నిద్రపోతానన్న మాట నిజమేనని ప్రధాని చెప్పారు. "నా స్నేహితులందరూ నన్ను అదే అడుగుతారు. ఒబామా నన్ను కలిసినా అలా ఎందుకు చేస్తారు అని ఆశ్చర్యపోతారు. మేం మంచి స్నేహితులం. ఆయన నన్ను 'నువ్వు' అంటూ మాట్లాడతారు. నువ్విలా ఎందుకు చేస్తావు అని ఆయన నన్ను అడుగుతారు. కానీ నా బాడీ సైకిల్ అలా ఎందుకయ్యిందో తెలీదు. అంత సేపు పడుకుంటే నా నిద్ర పూర్తవుతుంది. కళ్లు రుద్దుకోవడం, ఒళ్లు విరుచుకోవడం ఉండదు. లేవగానే నా పాదాలు నేలమీదకు వచ్చేస్తాయి" అన్నారు.
అయితే దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది ఒబామా ఇంగ్లీషులో నువ్వు అని ఎలా అంటారో అని అడిగారు.
@RealHistory అనే ట్విటర్ హ్యాండిల్లో "ఒబామా: హలో నరేంద్ర్, హౌ ఆర్ తూ" అని రాశారు.
మోదీ ఇంటర్వ్యూ గురించి ముందే చెప్పిన అక్షయ్
అక్షయ్ కుమార్ మంగళవారం తన ట్విటర్ హ్యాండిల్లో ఈ ఇంటర్వ్యూ గురించి రెండు ట్వీట్లు చేశారు.
ఒక వీడియోతోపాటు "ఎన్నికల ప్రచారం వేడిలో ప్రధాన మంత్రికి నవ్వడానికైనా సమయం ఉంటుందని మీరెప్పుడైనా అనుకున్నారా. రేపు ఉదయం 9 గంటలకు మీకు దీనికి సమాధానం లభిస్తుంది" అని అక్షయ్ రాశారు.
ఇంకొక వీడియోతో "దేశమంతా ఎన్నికలు, రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఇదిగో బ్రీథర్.. రేపు ఉదయం 9 గంటలకు ప్రధాన మంత్రి గురించి కొంతమందికి మాత్రమే తెలిసిన విషయాల గురించి చూడండి" అని పెట్టారు.
అంతకు ముందు ఏప్రిల్ 22న అక్షయ్ కుమార్ తను కాస్త కొత్తగా చేయబోతున్నానని ట్వీట్ చేశారు. అందులో "నాకు చాలా ఉత్సాహంగా, నెర్వస్‌గా ఉంది. అప్ డేట్స్ కోసం చూస్తూనే ఉండండి".. అని పెట్టారు.
ఈ ట్వీట్ గురించి అందరూ ఊహాగానాలు చేయడంతో ఆయన రెండో ట్వీట్ చేశారు. అందులో "నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌పై చాలా ఆసక్తి కనిపించింది. దానికి ధన్యవాదాలు. కానీ ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నా, నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లైంగిక వేధింపుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు: నాలుగు ప్రశ్నలు
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
- లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- రఫేల్ తీర్పు సమీక్షపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

నరేంద్ర మోదీ ఏపీకి చేస్తానని చెప్పిందేంటి.. వాస్తవంగా చేసిందేంటి?
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తానని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలేంటి? వాటిలో నెరవేర్చినవి ఏంటి?