బిల్కిస్ బానో: పదిహేడేళ్లుగా పోరాడుతున్నా. సుప్రీం కోర్టు నాకు అండగా నిలిచింది

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, Getty Images

రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం చేతుల్లోనే వేధింపులకు గురయ్యే పరిస్థితి దేశంలో ఏ పౌరుడికీ రాకూడదని గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కీస్ బానో అన్నారు.

విద్వేషం పేట్రేగిన రోజుల్లో నైతిక విలువలను పూర్తిగా పక్కనపెట్టిన ప్రభుత్వాలు అందుకు మూల్యం చెల్లించుకోకతప్పదని వ్యాఖ్యానించారు.

గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న అల్లర్ల సమయంలో బానోపై సామూహిక అత్యాచారం జరిగింది.

బానో కళ్ల ముందే ఆమె కుటుంబానికి చెందిన 14 మందిని మూకలు హత్య చేశాయి.

ఈ కేసులో తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిస్తూ.. బానోకు రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ తీర్పును ఆమె స్వాగతించారు. ప్రభుత్వాలకు ఇదో పాఠమని అన్నారు.

''మనస్సాక్షి, రాజ్యాంగం, న్యాయవ్యవస్థలపై నమ్మకం ఉంచి 17 ఏళ్లుగా పోరాడుతున్నా. సుప్రీం కోర్టు నాకు అండగా నిలిచింది. కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకునేందుకు నేను పడ్డ సంఘర్షణ, వేధన, కష్టాలను అర్థం చేసుకుంది'' అని బానో చెప్పారు.

వీడియో క్యాప్షన్,

గుజరాత్‌లో మాకు న్యాయం జరగలేదు: బిల్కిస్ బానో

కోర్టు ఇప్పించే పరిహారాన్ని తన పిల్లల చదువు, బాగోగుల కోసం వినియోగిస్తానని ఆమె అన్నారు. తనలా నష్టపోయిన మహిళలకు సాయపడేందుకూ కొంత భాగం ఉపయోగిస్తానని చెప్పారు.

న్యాయవాది కావాలన్నది తన కుమార్తె ఆశయమని, ఇతరులకు న్యాయం కల్పించేందుకు ఆమె పోరాడుతుంటే చూడాలని అనుకుంటున్నానని బానో అన్నారు.

''న్యాయపోరాటంలో సాధించిన ఈ విజయం నా ఒక్కదానిదే కాదు. తీవ్ర ఇబ్బందులకు గురై న్యాయస్థానాన్ని ఆశ్రయించలేకపోయిన మహిళలది కూడా'' అని వ్యాఖ్యానించారు.

సుప్రీం కోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్, సీబీఐతోపాటు తన కోసం పోరాడిన న్యాయవాదులకు బానో ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)