ఓటర్ ఐడీ కోసం ట్రాన్స్‌జెండర్లకు ఇన్ని ఇబ్బందులా

  • కమలేష్, మనీష్ జలూయి, సాహిబా ఖాన్
  • బీబీసీ ప్రతినిధులు
చంద్రముఖి

ట్రాన్స్‌జెండర్లు ఓటర్ ఐడీ పొందాలంటే ప్రక్రియ ఏమిటి? వారికి ఎదురవుతున్న సమస్యలేంటి? అన్నది తెలుసుకునేందుకు కొందరు ట్రాన్స్‌జెండర్లతో మాట్లాడాం. ఓటర్ కార్డు కోసం వెళ్లినప్పుడు ఎదురైన అనుభవాలను వారు మాతో పంచుకున్నారు.

ఓటర్ ఐడీ కార్డు కోసం వెళ్లినప్పుడు పురుషులను, మహిళలను అడగని ప్రశ్నలను అధికారులు తమను ఎందుకు అడుగుతున్నారని దిల్లీకి చెందిన ట్రాన్స్‌జెండర్ రామ్ కలి ప్రశ్నిస్తున్నారు.

పురుషులు ఓటర్ ఐడీ కార్డుకోసం వెళ్తే వారిని మీరు మగవారేనా? అని అధికారులు అడుగుతారా? మహిళలు వెళ్తే వారిని మీరు పూర్తిగా ఆడవారా? కాదా? అని, బిడ్డకు జన్మనివ్వగలరా? లేదా? అని అధికారులు ప్రశ్నిస్తారా? అదే ఓటర్ కార్డు కోసం మేం వెళ్తే మాత్రం.. ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారెందుకు? అని రామ్ కలి అడుగుతున్నారు.

ఒక వ్యక్తి తన ఓటర్ ఐడీ మీద ట్రాన్స్‌జెండర్ అని ఉండాలనుకుంటే ఎందుకింత కష్టం? అని ప్రశ్నిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

రామ్ కలి

"నేను పురుషుడిగా ఉన్నప్పుడు. నా ఐడీ మీద పురుషుడు అని ఉంది. మాకు థర్డ్ జెండర్‌గా గుర్తింపు వచ్చాక, దానికి సంబంధించిన హక్కులన్నీ మాకు ఉండాలి. ఓటర్ ఐడీ కోసం నేను వెళ్తే, సెక్సువల్ రీఅసైన్‌మెంట్ సర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్) సర్టిఫికెట్ చూపించాలని అడిగారు. ఆ సర్టిఫికెట్ పొందడం అంత సులువు కాదు. ఆ సర్టిఫికెట్ పొందాలంటే చాలా సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వైద్యుడు నాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చారు. అందులో నేను ట్రాన్స్‌జెండర్ లేదా స్త్రీ అని పేర్కొన్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఈ సర్టిఫికెట్ ఇస్తారు" అని రామ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్,

ఓటర్ ఐడీ కోసం ట్రాన్స్‌జెండర్లకు ఇన్ని ఇబ్బందులా

ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు కోసం పత్రాలు సంపాదించాలంటే రెండు మూడేళ్లు పడుతుందని ట్రాన్స్‌జెండర్ దీపిక చెప్పారు.

"ట్రాన్స్‌జెండర్‌గా మారాలంటే వార్తా పత్రికలో ఒక నోటీసు ఇవ్వాలి. దాని ద్వారా నేను గతంలో అబ్బాయిని, ఇప్పుడు అమ్మాయిగా మారుతున్నానని అందరికీ తెలుస్తుంది. వార్తా పత్రికలో వచ్చే నోటీసే ట్రాన్స్‌జెండర్‌కు గుర్తింపు పత్రం. ఆ నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి. అక్కడ ఏడాదిపాటు కౌన్సెలింగ్ ఇస్తారు. అనంతరం మరో రెండేళ్లు హార్మోన్ థెరపీ ఉంటుంది. అది పూర్తయ్యాక మాత్రమే అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేసి, సర్టిఫికెట్ ఇస్తారు" అని మరో ట్రాన్స్‌జెండర్ దీపిక చెప్పారు.

ఈ ఆధారాలన్నీ సంపాదించడం అంత సులువు కాదు. అందుకు చాలా సమయం, ఖర్చు అవుతుంది. గుర్తింపు పత్రం లేకపోవడంతో ట్రాన్స్‌జెండర్లు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు.

అయితే, చట్టం ప్రకారం, థర్డ్ జెండర్‌లు ఓటర్ కార్డు పొందేందుకు ఎలాంటి ఆధారం అవసరం లేదు.

"నన్ను పురుషుడిగా పేర్కొంటూ అధికారులు ఓటర్ కార్డు ఇస్తామన్నారు. అది వద్దన్నాను. నేను పురుషుడిని కాదు, ట్రాన్స్‌జెండర్‌ను. ట్రాన్స్‌జెండర్ సముదాయంలోనే ఉంటున్నాను. కాబట్టి, నాకు ట్రాన్స్‌జెండర్ కార్డే కావాలి. కానీ, అధికారి నన్ను ట్రాన్స్‌జెండర్ ప్రూఫ్ అడిగారు. నా దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. నేను ట్రాన్స్‌జెండర్‌ను అని మాత్రమే చెప్పగలను. కానీ, ఎలాంటి పత్రాలూ నా దగ్గర లేవు" అని మరో ట్రాన్స్‌జెండర్ బబ్లూ చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

బబ్లూ

దిల్లీలో ఉన్న ఓటర్లలో 75 లక్షల మంది పురుషులు, 60 లక్షల మంది మహిళలు, 837 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

"మేం ఏదైనా సమస్య గురించి చెప్పుకొనేందుకు అధికారుల వద్దకు వెళ్తే మా సమస్యలను వారు అర్థం చేసుకోరు. మా అవసరాలు ఏంటన్నది పట్టించుకోరు. నన్ను నేను ట్రాన్స్‌జెండర్‌గానే చూస్తాను, నా ఓటర్ ఐడీ మీద ట్రాన్స్‌జెండర్ అనే ఉండాలి" అని రామ్ కలి అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)