శ్రీలంక బాంబు పేలుళ్లు: ఆ దాడులను భారత్ ముందే ఎలా పసిగట్టింది?

  • జుబైర్ అహ్మద్
  • బీబీసీ ప్రతినిధి
శ్రీలంక పేలుళ్ల బాధితులు

ఫొటో సోర్స్, Getty Images

ఈనెల 21న శ్రీలంకలో జరిగిన అత్యంత హింసాత్మక బాంబు దాడులపై అక్కడి అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తుండగా, మరోవైపు రెండు వారాల ముందే భారత్ చేసిన హెచ్చరికలకు శ్రీలంక ప్రభుత్వం స్పందించి ఉంటే ఇంత విధ్వంసం జరిగేది కాదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం, శ్రీలంక అధికార వర్గాలు స్పందించి తగిన చర్యలు చేపడితే ఈ వరుస పేలుళ్లను అడ్డుకునే వీలుండేదన్న విషయం మీడియా కథనాలను చూస్తే అనిపిస్తుంది.

ఆస్ట్రేలియాకు చెందిన నిపుణురాలు లిడియా ఖలీల్ అమెరికాతో పాటు, పలు దేశాలకు ఉగ్రవాద నిరోధానికి సంబంధించి సలహాలు ఇస్తుంటారు. "శ్రీలంక దాడులు నివారించదగినవే అని, సమష్టి వైఫల్యం కారణంగానే ఈ విధ్వంసం జరిగిపోయింది" అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images

చర్చిలు, పర్యాటక ప్రాంతాలే లక్ష్యంగా శ్రీలంకలో దాడులకు కుట్రలు జరుగుతున్నాయంటూ భారత నిఘా అధికారుల నుంచి శ్రీలంక ప్రభుత్వానికి హెచ్చరికలు అందాయని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఉగ్రవాద నిరోధక నిపుణుడు, జర్నలిస్టు ప్రవీణ్ స్వామి అన్నారు.

భారత్ నుంచి రెండు వారాల ముందే నిఘా హెచ్చరికలు అందినా, శ్రీలంక అధికార వర్గాలు ఎందుకు చర్యలు చేపట్టలేదన్నది రక్షణ నిపుణులకు అంతుపట్టడంలేదు.

భారత్ అని పేరు చెప్పకుండా, ఈ ఉగ్రవాద దాడుల గురించి పొరుగు దేశం నుంచి తమకు ముందే సమాచారం వచ్చిందన్న విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం కూడా వెల్లడించింది.

"పొరుగు దేశం నుంచి మా భద్రతా అధికారులకు నిఘా సమాచారం వచ్చింది. కానీ, ఆ సమాచారాన్ని వాళ్లు నాతో పంచుకోలేదు" అని ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

నిఘా సమాచారం

రాజకీయపరమైన విషయాలను పక్కనపెడితే, రక్షణ పరమైన వ్యవహారాల్లో ఇరు దేశాల నిఘా విభాగాలు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నాయి.

"నా దృష్టిలో అది అత్యంత ధృఢమైన బంధం. రాజకీయాలను పక్కన పెడితే, నిఘా విషయంలో మాత్రం రెండు దేశాల సంస్థలు చాలా సన్నిహితంగా మెలుగుతున్నాయి. భారత గూఢచార సంస్థ 'రా' మీద కొందరు శ్రీలంక రాజకీయ నాయకులు ఆరోపణలు చేసినప్పటికీ, నిఘా విషయంలో మాత్రం ఇరు దేశాల మధ్య పరస్పరం సహకారం చాలా బలంగా ఉంది" అని ప్రవీణ్ స్వామి అంటున్నారు.

1991లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ హత్య చేసిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య నిఘా సమాచార మార్పిడి నిరంతరం సాగుతోందని దిల్లీకి చెందిన రక్షణ నిపుణులు సుశాంత్ సరీన్ అన్నారు. శ్రీలంకతో నిఘా సమాచారం పంచుకోవడం భారత్‌కు కూడా ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

"భద్రతా కారణాల దృష్ట్యా భారత గూఢచార సంస్థ 'రా' లాంటి నిఘా విభాగాలు ఎప్పుడూ పూర్తి సమాచారాన్ని విదేశాలకు ఇవ్వవు. కానీ, ఆ విషయానికి సంబంధించి ఇతర దేశాలు చర్యలు చేపట్టే విధంగా సమాచారం ఇస్తాయి. అయితే, ఇటీవలి దాడులకు ముందు శ్రీలంకకు భారత నిఘా వర్గాల నుంచి చాలా కచ్చితమైన సమాచారం వెళ్లిందని అనిపిస్తోంది" అని సుశాంత్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP

భారత్ ఎలా పసిగట్టింది?

ప్రవీణ్ స్వామి చెప్పిన వివరాల ప్రకారం, భారత్ శ్రీలంకకు అందించిన సమాచారంలో... ఎక్కడ దాడులు చేసేందుకు కుట్ర జరుగుతోంది? ఎవరు ఆ దాడికి పాల్పడే అవకాశం ఉందో వారి పేర్లు, చిరునామాలతో సహా ఉన్నాయి. ఆదివారం దాడికి పాల్పడిన వారి జాబితాలో అందులోని కొన్ని పేర్లు ఉన్నాయి.

నిఘా సమాచారం అందినా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అన్నారు.

అదలా ఉండగా, శ్రీలంకలో స్థానిక ఇస్లామిస్ట్ గ్రూపు నేషనల్ తౌహీద్ జమాత్ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న విషయాన్ని భారత్‌ ముందుగానే ఎలా పసిగట్టగలిగింది? శ్రీలంక నిఘా వర్గాలు దాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయి? అని శ్రీలంక మీడియా ప్రశ్నిస్తోంది. భారత ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కచ్చితమైన సమాచారం వచ్చినా శ్రీలంక అధికారులు దానిపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదని కూడా అక్కడి మీడియా అంటోంది.

మరి, అనుమానితులకు సంబంధించిన కచ్చితమైన వివరాలతో సహా, శ్రీలంకలో దాడులు జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని భారత నిఘా వర్గాలు ఎలా పసిగట్టాయి?

శ్రీలంకలోని ఓ ఫాం హౌజ్‌లో ఈ ఏడాది ఆరంభంలో 100 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. అది జిహాదీలకు శిక్షణ స్థలం అయ్యుంటుందని, ఆ దేశంలోని బౌద్ధ కట్టడాలపై దాడులు చేసేందుకు అక్కడ కుట్ర పన్ని ఉంటారని ప్రవీణ్ స్వామి అన్నారు. అయితే, ఆ తర్వాత భారత్, శ్రీలంక నిఘా నీడలో నేషనల్ తౌహీద్ జమాత్ గ్రూపు (ఎన్‌టీజే) లేదని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, KIERAN ARASARATNAM

మరో దేశానికి సంబంధించిన సమాచారం నిఘా సంస్థలకు దొరకడం అసాధరణమైన విషయమేమీ కాదని సరీన్ అన్నారు.

''ఓ అనుమానితుడిని ఇటీవల 'రా' విచారణ జరిపిన సమయంలో శ్రీలంకలో బాంబు పేలుళ్ల కుట్ర వెలుగుచూసిందని నేను విన్నా'' అని ఆయన చెప్పారు.

సాధారణంగా 'రా' గానీ, మరో నిఘా సంస్థ గానీ ఇలాంటి సమాచారం గురించి మాట్లాడవు.

కానీ, భారత్, శ్రీలంక నిఘా సంస్థల మధ్య ఉన్నది విశ్వాసంతో కూడిన బంధం అన్న విషయం గమనార్హం.

ఈ దాడులపై విచారణలో భారత్‌నూ శ్రీలంక భాగస్వామిగా చేసుకుంటుందా? అంటే.. ఇప్పటికే ఆ రకమైన సహకారం మొదలై ఉండొచ్చని అని సరీన్ బదులిచ్చారు.

అయితే, మీడియాకు ఈ విషయం ఎప్పటికీ తెలియకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

దాడుల్లో విదేశీ మిలిటెంట్ సంస్థల పాత్ర ఉందా అన్నది గుర్తించేందుకు వివిధ దేశాల సాయాన్ని శ్రీలంక ప్రభుత్వం కోరింది.

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ శ్రీలంకకు తోడ్పాటు అందిస్తోంది. అయితే భారత్ పేరు మాత్రం ఇంతవరకూ బయటకు రాలేదు.

భారత్ దగ్గర చాలా కచ్చితమైన సమాచారం ఉందని, విచారణలో ఆ దేశం పాత్ర అనివార్యమని సరీన్ అన్నారు. భారత్‌కు కూడా అది ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు.

చాలా పొరుగు దేశాలతో నిఘా, భద్రతపరమైన సహకారాన్ని భారత్ ఇటీవల పటిష్ఠం చేసుకుంది. సౌదీ అరేబియా, యూఏఈలతో భద్రతపరమైన సహకార ఒప్పందాలను మోదీ ప్రభుత్వం కుదుర్చుకుంది.

''80 లక్షల దాకా భారతీయులు సౌదీ, యూఏఈల్లో ఉంటున్నారు. వారిలో కొందరు తీవ్రవాద భావాలున్న ముస్లింలలా, సలాఫీలుగా మారుతుంటారు. జాతీయ భద్రత కోసం ఈ మూడు దేశాలు సహకరించుకోవడం అవసరం'' అని సరీన్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP

ఐఎస్ నుంచి ముప్పు ఉందా?

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది. అందులో చేరినవారు తిరిగి సొంత దేశాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. స్వదేశాల్లో వారు అలజడులకు కారణం కావొచ్చు.

పొరుగు దేశాలు బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంకల్లో జిహాదీల కదలికలు 'భారత్‌పై తదుపరి భారీ దాడులకు ఇది ముందు దశ' గా పనిచేయొచ్చన్న భారత్ ఆందోళనలను తాజా పరిణామాలు బలపరుస్తున్నాయని స్వామి అన్నారు.

ఇస్లామిక్ స్టేట్ నుంచి తక్షణమే ముప్పు పొంచి ఉన్నట్లు భావించడం తొందరపాటు అవుతుందని 'రా' మాజీ అధికారి తిలక్ దేవేషర్ వ్యాఖ్యానించారు.

అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని అన్నారు.

శ్రీలంక ప్రభుత్వంలోని విభేదాల ఫలితంగా ఏర్పడిన భద్రతా లోపాల వల్ల దాడుల కుట్రదారులు విజయవంతమయ్యారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు.

ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటంలో భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తోందని, అమెరికా వంటి దేశాలతో నిఘా సమాచారాన్ని పంచుకుంటోందని గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)