ఐపీఎల్ 2019: చెలరేగిన డివిలియర్స్, స్టోయినిస్... రాయల్ చాలెంజర్స్‌కు వరసగా మూడో విజయం

  • ఆదేశ్ కుమార్ గుప్తా
  • బీబీసీ కోసం
బెంగళూరు విన్

ఫొటో సోర్స్, AFP

ఐపీఎల్-12లో బుధవారం డివిలియర్స్ మొదట 82 పరుగులు చేయడమే కాదు, తర్వాత పట్టిన మూడు అద్భుతమైన క్యాచ్‌ల‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన సొంత మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను 17 పరుగులతో ఓడించింది.

పంజాబ్ ముందు 203 పరుగుల భారీ లక్ష్యం ఉంది. కానీ అది నిర్ధారిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేయగలిగింది.

పంజాబ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు క్రిస్ గేల్ 23, కేఎల్ రాహుల్ 42 రన్స్ చేయగా.. నికొలస్ పూరన్ 46, డేవిడ్ మిలర్ 24 రన్స్ చేసి అవుటయ్యారు.

బెంగళూరు బౌలర్ ఉమేష్ యాదవ్ 36 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు, నవదీప్ సైనీ 33 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు.

ఫొటో సోర్స్, TWITTER@KL RAHUL 11

7వ స్థానానికి బెంగళూరు

అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ధారిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది.

బెంగళూరు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ 43 రన్స్ చేయగా, ఏబీ డివిలియర్స్ 82, మార్కస్ స్టోయినిస్ 46 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు.

ఏబీ డివిలియర్స్ తన 82 రన్స్ కేవలం 44 బంతుల్లో చేశాడు. ఇందులో 3 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.

మార్కస్ స్టోయినిస్ కూడా 36 బంతుల్లో 46 పరుగుల చేశాడు. మూడు సిక్సర్లు కొట్టాడు.

పంజాబ్ బౌలర్ మహమ్మద్ షమీ 53 రన్స్‌కు ఒక వికెట్, హార్డస్ విల్జోయిన్ 51 రన్స్‌కు ఒక వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయి 82 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన డివిలియర్స్ తర్వాత ఫీల్డింగ్‌లో కూడా మెరుపులు మెరిపించాడు. బ్యాటింగ్‌లో జోరుమీదున్న క్రిస్ గేల్, డేవిడ్ మిలర్, నికొలస్ పూరన్ క్యాచ్‌లు పట్టాడు.

బుధవారం గెలిచిన తర్వాత బెంగళూరు పాయింట్స్ పట్టికలో 8వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు 11 మ్యాచ్‌ల తర్వాత 4 విజయాలు, 7 ఓటమిలతో దానికి 8 పాయింట్స్ ఉన్నాయి.

మరోవైపు పంజాబ్ 11 మ్యాచుల్లో 5 విజయాలు, 6 ఓటమిలతో పది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

సత్తా చూపిన డివిలియర్స్

ఇప్పుడు ఏబీ డీవిలియర్స్‌ ప్రపంచంలోని మిగతా బ్యాట్స్‌మెన్ల కంటే ఎందుకు ప్రత్యేకమో చూద్దాం.

అంతకు ముందు చిన్నస్వామి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు డివిలియర్స్ బ్యాట్ ఝుళిపిస్తే మంచి మంచి బౌలర్లు ఎలా చేతులెత్తేస్తారో కళ్లారా చూశారు.

బెంగళూరు స్కోరు ఒక వికెట్ నష్టానికి 35 పరుగుల దగ్గర ఉన్నప్పుడు ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్‌కు దిగాడు.

అప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ 13 రన్స్ చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో మిడాఫ్‌లో మందీప్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

తర్వాత డివిలియర్స్, పార్థివ్ పటేల్ బెంగళూరు స్కోరును 71 రన్స్ వరకూ చేర్చారు. అదే స్కోరు దగ్గర పార్థివ్ పటేల్ అశ్విన్ బౌలింగ్‌లో మురుగన్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images

పార్థివ్ పటేల్ 24 బంతుల్లో 43 రన్స్ చేశాడు. కానీ 81 రన్స్ చేరేలోపే బెంగళూరు 4 వికెట్లు కోల్పోయింది. పార్థివ్ పటేల్ తర్వాత మొయిన్ అలీ 4, అక్షదీప్ నాథ్ 3 రన్స్ చేసి అవుటయ్యారు.

అదే సమయంలో డివిలియర్స్‌కు మార్కస్ స్టోయినిస్ జత కలిశాడు. వీరిద్దరూ మొదట ఆచితూచి ఆడడం మొదలుపెట్టారు. క్రీజులో కుదురుకోగానే పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

చివరి రెండు ఓవర్లలో 48 రన్స్ చేసిన డివిలియర్స్, స్టోయినిస్ స్టేడియంలో సిక్స్, ఫోర్లతో విధ్వంసం సృష్టించారు.

ఫొటో సోర్స్, Getty Images

షమీ ఒకే ఓవర్లో 21 పరుగులు

19వ ఓవర్ మహమ్మద్ షమీ వేశాడు. అందులో డివిలియర్స్ మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. షమీ ఆ ఓవర్లో 21 రన్స్ ఇచ్చాడు. మొదటి రెండు సిక్సర్లు మిడాఫ్‌పై బాదినా, మూడో సిక్సర్ చాలా కష్టమైనది. అది డివిలియర్స్ మాత్రమే కొట్టగలడు.

మహమ్మద్ షమీ యార్కర్ వేయాలనుకున్నాడు. కానీ బంతి నేరుగా ఫుల్ టాస్ వచ్చింది. ఆఫ్ స్టంప్ వైపు వంగిన డివిలియర్స్ హెల్మెట్ తాకుతుందేమో అనిపించిన బంతిని మిడ్ వికెట్ వైపు పంపించాడు.

షాట్ టైమింగ్ ఎంత పక్కాగా ఉందంటే.. బంతి నేరుగా బౌండ్రీ లైన్ బయటకెళ్లి పడింది.

ఆ షాట్ చూసిన కామెంట్రేటర్ "ఈ స్టైల్లో ఆడతాడు కాబట్టే డివిలియర్స్‌ను 'మిస్టర్ 360 డిగ్రీ' అంటారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మార్కస్ స్టోయినిస్

స్టోయినిస్ జోరు

20వ ఓవర్ హర్డస్ విల్జోయిన్ వేశాడు. ఆ ఓవర్లో 27 రన్స్ వచ్చాయి.

కానీ ఈసారీ స్టోయినిస్ అద్భుతాలు చేశాడు. అతడు ఈ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. ఇదే ఓవర్ మొదటి బంతిని స్ట్రయిక్ చేసిన డివిలియర్స్ దాన్ని సిక్స్‌కు పంపాడు.

అలా ఈ రెండు ఓవర్లలో వచ్చిన 48 రన్స్ సాయంతో డివిలియర్స్, స్టోయినిస్ ఐదో వికెట్‌కు 68 బంతుల్లో 121 రన్స్ జోడించారు.

డివిలియర్స్ 82, స్టోయినిస్ 46 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు.

తన అద్భుత ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడిన డివిలియర్స్ 10 రన్స్ లోపే 3 వికెట్లు పడినప్పుడు పరిస్థితి ఘోరంగా అనిపించిందని చెప్పాడు.

"అప్పుడు 160 రన్స్ చేస్తే చాలనుకున్నాం. కానీ స్టోయినిస్‌ భాగస్వామ్యంతో పెద్ద స్కోర్ చేయగలిగాం".

వరసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన బెంగళూరు తన కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖంలో చిరునవ్వులు తీసుకొచ్చింది.

బెంగళూరు ఇప్పటికీ తన మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్ చేరుకోగలదా, లేదా అనేది అప్పుడే చెప్పలేం. కానీ అది ఈలోపు ఏ జట్టును ఓడించినా వారు కచ్చితంగా కష్టాల్లో పడతారనేది మాత్రం వాస్తవం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)