సీజేఐపై లైంగిక ఆరోపణల కేసు: త్రిసభ్య విచారణ కమిటీలో జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా

జస్టిస్ ఇందూ మల్హోత్రా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపే కమిటీ నుంచి ఎన్‌వీ రమణ వైదొలిగారు. ఆయన స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రాను నియమించారు.

గొగోయ్‌కు ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న మహిళ ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఎన్‌వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యులుగా ఉన్నారు.

అయితే, కమిటీలో ఎన్‌వీ రమణకు స్థానం కల్పించడంపై సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళ ఇటీవల అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

''సీజేఐ ఇంటికి రమణ ఎప్పుడూ వస్తుంటారు. వారిద్దరికీ మంచి స్నేహం ఉంది. కుటుంబ సభ్యుల్లాంటి బంధం ఉంది'' అని ఆమె ఆరోపించారు. దీంతో గురువారం ఈ విచారణ కమిటీ నుంచి ఎన్‌వీ రమణ వైదొలిగారు.

ఫొటో సోర్స్, Reuters

కుట్రకోణంపై విచారణకు ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీ

మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక కుట్ర ఉందంటూ న్యాయవాది ఉత్సవ్ బైన్స్ చేసిన ఆరోపణలపై విశ్రాంత న్యాయమూర్తి ఏకే పట్నాయక్ విచారణ చేపట్టనున్నారు.

ఈ అంశంపై విచారణకు జస్టిస్ పట్నాయక్ నేతృత్వం వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విచారణలో పట్నాయక్‌కు సహకరించాలని సీబీఐ డైరెక్టర్, ఐబీ చీఫ్‌లను కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

సీజేఐపై ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక కుట్ర ఉందటూ కోర్టులో ఉత్సవ్ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఫొటో సోర్స్, Getty Images

కాగా ఈ కేసును ప్రభావితం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ తాను ఆరోపించిన అంశాలను, ఆధారాలను పట్నాయక్ కమిటీకి ఇవ్వాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉత్సవ్ బైన్స్‌కు సూచించింది.

ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేసిన మహిళ కేసును వాదించాలని, ఈ అంశంలో మీడియా సమావేశం నిర్వహించాలని కొందరు వ్యక్తులు తనకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని, ఉత్సవ్ బైన్స్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కుట్రలో భాగంగానే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, ఈ ఆరోపణల కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తుందని ఉత్సవ్ ఆరోపిస్తున్నారు.

కేసు విచారణలో భాగంగా గురువారం జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ.. ''అత్యున్నత న్యాయస్థానం కథ ముగిసిపోతున్నట్లుగా గత మూడు, నాలుగేళ్లుగా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. మేం నిజాన్ని నిగ్గు తేలుస్తామని ప్రజలు విశ్వసించాలి. కొందరు బలవంతులు, తాము మాత్రమే ఈ దేశాన్ని పాలిస్తామని భావిస్తున్నారా?'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

రంజన గొగోయ్‌పై ఫిర్యాదు చేసిన మహిళ, తన ఆరోపణలను పేర్కొంటూ మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు ఏప్రిల్ 19న లేఖ రాశారు. తన ఆరోపణలపై విచారణ కోసం విశ్రాంత సుప్రీం న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీ వేయాలని అందులో అభ్యర్థించారు.

గతేడాది, అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించారు. వారిలో జస్టిస్ గొగోయ్ కూడా ఒకరు. న్యాయ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉందని రంజన్ గొగోయ్‌తోపాటు నలుగురు న్యాయమూర్తులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)