అమిత్ షాకు ఆర్ఎస్ఎస్ లేఖ నిజమేనా? ఎన్నికల నుంచి ప్రగ్యా ఠాకూర్‌ను తప్పించాలని సంఘ్ కోరిందా? - ఫ్యాక్ట్ చెక్

  • 27 ఏప్రిల్ 2019
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్

భోపాల్‌ నుంచి ప్రగ్యా ఠాకూర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఆర్ఎస్ఎస్ ఉత్తరం రాసిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ సర్క్యులేట్ అవుతోంది. ఆ ఉత్తరం ఆర్ఎస్ఎస్ నేత సురేష్ సోని పేరుపై ఉంది. ఈ ఉత్తరం నిజమా?

బీబీసీ దర్యాప్తులో ఈ ఉత్తరం నిజం కాదని, ఇది నకిలీ అని తేలింది.

మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రగ్యా ఠాకూర్ ముద్దాయిగా ఉన్నారు. మాలేగావ్‌లో జరిగిన ఈ పేలుళ్లలో 37మంది చనిపోగా, 125మంది గాయపడ్డారు. అయితే, ఈ కేసుతో తనకు సంబంధముందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక మాలేగావ్ పేలుళ్లు ఫైల్ ఫొటో

''పుల్వామా దాడి వల్ల ఒనగూరాల్సిన రాజకీయ ప్రయోజనాలు భోపాల్ బీజేపీ అభ్యర్థి వల్ల అందడం లేదు. ఈ సమయంలో అభ్యర్థిని మార్చడం తెలివైన పని'' అని ఆ ఉత్తరంలో ఉంది.

మా వాట్సప్ పాఠకులు, ఈ ఉత్తరం కచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి ఉత్తరం ఫొటోను మాకు పంపారు.

కానీ ఈ ఉత్తరం నకిలీదని తేలింది.

''సోషల్ మీడియాలో ఇలాంటిదేదో షేర్ అవుతోందని నాకు తెలుసు. కానీ అలాంటి ఉత్తరం ఏదీ నేను రాయలేదు. ఆ ఉత్తరం నిజం కాదు'' అని సురేష్ సోని బీబీసీతో అన్నారు.

ఆ ఉత్తరంలో ఏముంది?

ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులకు సంబంధించి ఈ ఉత్తరాన్ని రాశారని ఆరోపణలు వస్తున్నాయి.

''లోక్‌సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు సంబంధించి..'' అని ఆ ఉత్తరంలో ఉంది.

Image copyright UGC

కాంగ్రెస్ పార్టీ 47మంది మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపిందని, కాంగ్రెస్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న బీజేపీ 45మంది మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపిందని సురేష్ సోని హెచ్చరించినట్లు ఆ ఉత్తరం చెబుతోంది.

2019 మార్చి 8నుంచి 10వరకు గ్వాలియర్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధుల సమావేశంలో మహిళల అభ్యర్థిత్వంపై చర్చ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపిత చర్చల ఆధారంగా ఈ ఉత్తరం ఉంది.

ఉత్తరం చివరి పేరాలో... ''హిందూ దేశంలో, పిల్లల పెంపకం మహిళల బాధ్యత. మహిళలు తమ ప్రాథమిక విధిని విస్మరించి, రాజకీయాలకు ఆకర్షితులైతే.. దాని ప్రభావం సంస్కృతి, ఆచారాలను కాపాడాల్సిన బాధ్యతపై పడుతుంది'' అని ఉంది.

గతంలోని నకిలీ ఉత్తరాలు

ఆర్ఎస్ఎస్ పేరిట నకిలీ ఉత్తరాలు వెలుగు చూడటం ఇది మొదటిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి నకిలీ ఉత్తరమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

లఖ్‌నవూ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్ఎస్ఎస్ నేత సర్కార్యవాహ్ భయ్యాజీ జోషీ.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్‌కు ఉత్తరం రాశారని ఆ వైరల్ పోస్ట్ సారాంశం.

Image copyright UGC

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఓఎస్‌డీ ప్రవీణ్ కక్కర్, కమల్‌నాథ్ మాజీ సలహాదారు ఆర్.కె.మిగ్లానీలపై ఏపక్రిల్ 7న, 2019న ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి.

భోపాల్, ఇండోర్, గోవా, దిల్లీ నగరాల్లో మొత్తం 52 ప్రాంతాల్లో దాడులు జరిగాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు తెలిపారు.

ఈ దాడుల్లో లెక్కలు చూపని 14.6 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 281 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు కూడా దొరికాయి.

ఈ దాడులకు కొందరు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు, వారి మద్దతుదారులకు సంబంధం ఉందని ఆ నకిలీ ఉత్తరంలో ప్రస్తావించారని, ఈ ఉత్తరం తమ పరువును దెబ్బతీసేలా ఉందని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే భయ్యాజీ జోషి పేరుతో ఈ ఉత్తరాన్ని సృష్టించి సర్క్యులేట్ చేస్తున్నారని, ఓ ప్రకటనలో ఆర్ఎస్ఎస్ తెలిపింది.

''రానున్న ఎన్నికల్లో లబ్ది పొందడానికే కొన్ని అసాంఘిక శక్తులు ఇలాంటి నకిలీ వార్తలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. దీన్ని మనం వ్యతిరేకించాలి'' అని ఆర్ఎస్ఎస్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు