బిల్కిస్ బానో: 'దేశంలో హింసకు తావులేకుండా ప్రేమ, శాంతి వర్ధిల్లాలి'

  • 27 ఏప్రిల్ 2019
బిల్కిస్ బానో Image copyright Getty Images
చిత్రం శీర్షిక బిల్కిస్ బానో

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిస్తూ.. బానోకు రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఆమె ఏమంటున్నారో ఆమె మాటల్లోనే...

నా పోరాటాన్ని, నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానం అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.

నాకు అండగా నిలిచిన ప్రజలకు, కోర్టుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయితే, నాకు న్యాయం నా స్వరాష్ట్రంలో లభించి ఉంటే నేను మరింత సంతోసించేదాన్ని.

నేను గుజరాతీ మహిళను, గుజరాత్‌లో పుట్టాను. గుజరాత్‌ బిడ్డను నేను. నాకు హిందీలో సరిగా మాట్లాడటం కూడా రాదు, గుజరాతీలో మాట్లాడటమే నాకిష్టం. కానీ, మా రాష్ట్రంలో నేను భయంతో బతకాల్సి వచ్చినప్పుడు, ప్రభుత్వం నాకు సాయం చేసేందుకు ముందుకు రానప్పుడు నిరాశచెందాను.

నేను ఎన్నడూ పాఠశాలలో అడుగుపెట్టలేదు, అక్షరాలు దిద్దలేదు. అప్పట్లో అమ్మాయిలను బడికి పంపేవారు కాదు.

చిన్నప్పుడు పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. జుట్టు దువ్వుకోవడం, కళ్లకు కాటుక (కాజల్) పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ, గత 17 ఏళ్ల కాలం కష్టంగా గడిచింది. చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకోలేకపోతున్నాను.

అప్పట్లో మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. మా అమ్మ, అక్కాచెల్లెల్లు, సోదరులు, నాన్న అందరం కలిసి చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ, ఇప్పుడు మేము ఒంటరివాళ్లమయ్యాం.

మాకు పెళ్లి అయినప్పుడు కలిసి జీవించాలనుకున్నాం. అంతా కలిసి కష్టపడి కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ, 2002లో జరిగిన అత్యంత భయానక ఘటనతో మా ఆశలన్నీ చెదిరిపోయాయి. నేను, మా కుటుంబం తీవ్రమైన క్షోభను అనుభవించాల్సి వచ్చింది.

మా కుటుంబానికి చెందిన 14 మంది అత్యంత దారుణంగా చంపేశారు. అప్పుడు నేను గర్భవతిని, నాపై అత్యాచారం చేశారు. ఏడ్చాను, వేడుకొన్నాను, అయినా వదల్లేదు. నా కళ్లముందే నా చిన్నారి కూతురు సలేహాను చంపేశారు.

ఆ క్షోభను మాటల్లో వర్ణించలేను. సలేహా మా తొలి సంతానం. మా బిడ్డకు మా సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కూడా చేయలేకపోయాం.

తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించేందుకు సమాధి కూడా లేదు. ఆ ఘటనతో మా కుటుంబం అంతా చిన్నాభిన్నమైంది.

Image copyright DAKSHESH SHAH

మా జీవితంలో పురోగతి సాధించాలని ఆశించాం. కానీ, ఆ ఘటనతో మా జీవితాలు వెనక్కి వెళ్లాయి.

పట్టాల మీద రైలు వెళ్తుండటాన్ని మాత్రమే చూశాను, కానీ రైల్వే స్టేషన్‌ను ఎన్నడూ చూడలేదు.

గోద్రా స్టేషన్‌లో అత్యంత క్రూరమైన ఘటన జరిగినప్పుడు, నేను నా భర్తతో ఉన్నాను. కానీ, ఆ ఘటన తర్వాత ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు.

మా కుటుంబంలో 14 మంది హత్యకు గురయ్యారు, మేము దిక్కులేనివాళ్లమయ్యాం. ఆ బాధ, నిరాశే మాకు బలంగా మారింది.

గతంలో సినిమాలు చూసేవాళ్లం. కానీ, ఈ 17 ఏళ్లలో నేను ఒక్క సినిమా కూడా చూడలేదు. నా భర్త యాకూబ్ మాత్రం తన స్నేహితుడి బలవంతపెడితే ఒక మూవీ చూశాడు.

మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాకపోవడమే ఈ 17 ఏళ్లో నాకు ఉపశమనం కలిగించిన విషయం.

Image copyright Getty Images

ఇంత సుదీర్ఘ న్యాయ పోరాటం ఎందుకు? దానిని పక్కకు పెట్టేసి, మీ జీవనోపాధి మీద దృష్టిపెట్టండంటూ చాలామంది సూచించారు. వాళ్లంతా మాకు దగ్గరివారే. మేము ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చూసి వాళ్లు అలా సలహా ఇచ్చారు.

కొన్నిసార్లు వాళ్లు చెబుతున్నది సబబే అనిపించింది. కానీ, నా భార్త వెనక్కి తగ్గలేదు. మనం పోరాడుతున్నది న్యాయం కోసం, అది మన జీవితం సాఫీగా సాగడం కంటే అది చాలా ముఖ్యమైనది, అది సాధించేవరకూ ముందుకెళదాం అని ఆయన అంటుండేవారు.

17 ఏళ్ల పోరాటంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, సమాజం, మహిళా హక్కుల సంఘాలు, సీబీఐ, మానవ హక్కుల కమిషన్‌తో పాటు వివిధ వర్గాల ప్రజలు మాకు అండగా నిలిచారు.

ఇన్నేళ్లుగా మేము ఎంత ఇబ్బందిపడినా, మాకు మన దేశ న్యాయవ్యవస్థ మీద విశ్వాసం పోలేదు. ఏదో ఒకరోజు నాకు న్యాయం జరుగుతుంది, నా విశ్వాసం నిజమవుతుందని అనుకునేదాన్ని.

ఇప్పుడు నాకు న్యాయం లభించింది. కానీ, 14 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధను మాత్రం మరచిపోలేకపోతున్నాను. రోజంతా ఏదో పని చేస్తూ బిజీగా గడుపుతాను, కానీ రాత్రి సమయాల్లో ఆ చేదు జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి.

కేసు కొనసాగుతున్నంత కాలం, నన్ను ఎవరో చూస్తూనే ఉన్నారని, నిరంతరం నా వెంట వస్తున్నారని అనిపించేది. ఇప్పుడు మాకు న్యాయం జరిగింది.

ఇప్పుడు మా పిల్లలతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. నా బిడ్డ లాయర్ అవ్వాలని, న్యాయం కోసం పోరాడుతున్నవారికి సాయం చేయాలని కోరుకుంటున్నాను.

దేశంలో ద్వేషం మరియు హింసకు తావులేకుండా ప్రేమ, శాంతి వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.

(బీబీసీ ప్రతినిధి మేహుల్ మక్వానాకు బిల్కిస్ బానో, ఆమె భర్త యాకూబ్ రసూల్‌లకు మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)