లోక్‌సభ ఎన్నికలు 2019: పార్టీలన్నీ సోషల్ మీడియాపై ఎందుకు దృష్టిసారిస్తున్నాయి?

  • 28 ఏప్రిల్ 2019
సోషల్ మీడియా

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా పేరు గాంచిన భారతదేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాను భారీ స్థాయిలో ఉపయోగించుకోవడం ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా ఉంది.

ప్రతి పార్టీ సోషల్ మీడియాలో తన ఉనికిని బలంగా చాటుకోవాలనే ప్రయత్నిస్తోంది. చౌక ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్లు, చౌక డేటా ప్యాక్‌ల మూలంగా దేశంలోని కోట్లాది సామాన్య ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని నేతలందరూ ప్రయత్నిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి దెవీనా గుప్తా అందిస్తున్న కథనం.

ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని బల్బీర్ సింగ్ ఆశిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఇది ఆయన తొలి రోడ్ షో.

కానీ ఓటర్ల వద్దకు చేరుకోగలగాలంటే ఒక్క ర్యాలీలతోనే పని జరగదు. ఈ విషయం ఆయన మద్దతుదారులకు బాగా తెలుసు. అందుకే ర్యాలీతో పాటుగా వాళ్లు తమ నాయకుడి వీడియోలను, ఫొటోలను ఆన్‌లైన్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: పార్టీలన్నీ సోషల్ మీడియాపై ఎందుకు దృష్టిసారిస్తున్నాయి?

భారత్‌లో 2014 ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటిసారి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించారు. కానీ 2019 ఎన్నికల్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ పతాక స్థాయికి చేరింది.

రాజకీయ ప్రసంగాల లైవ్ ప్రసారాల కోసం ప్రత్యేకమైన యాప్స్ వచ్చేశాయి.

దేశంలో ప్రస్తుతం 30 కోట్ల స్మార్ట్‌ఫోన్లున్నాయి. రాజకీయ నేతలు, పార్టీలూ స్మార్ట్ ఫోన్ల ద్వారానే ఓటర్లు, కార్యకర్తల వద్దకు చేరుకోగలుగుతున్నాయి.

ఈసారి రాజకీయ పార్టీలన్నీ తమ తమ సోషల్ మీడియా సెల్స్ పైనే చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించి ఓటర్లను ఆకర్షించడమే వాటి లక్ష్యం.

చిత్రం శీర్షిక అంకిత్ లాల్

"దేశంలో జరిగే ఎన్నికల్లో గెలుపు, ఓటముల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంటుంది. అందుకే, అంతిమ ఫలితాలను నిర్ణయించడంలో సోషల్ మీడియాదే కీలక పాత్ర అవుతుంది. సోషల్ మీడియా తీరుతెన్నుల్లో కూడా చాలా మార్పులొచ్చాయి. మొదట్లో లింక్, ఫొటోలు, టెక్స్ట్ బాగా ఉపయోగించేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని వీడియోలు ఆక్రమించాయి" అని ఆప్ సోషల్ మీడియా ఇంఛార్జ్ అంకిత్ లాల్ అన్నారు.

చిత్రం శీర్షిక బీబీసీ ప్రతినిధి దెవీనా గుప్తా

కానీ ఈ మీడియాను ఎన్నికల్లో ఉపయోగించడంలో ఎదురవుతున్న ముఖ్య సమస్యలు - ఫేక్ అకౌంట్లు, ఫేక్ న్యూస్.

అబద్ధాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ‌లో వాట్సాప్.. టిప్‌లైన్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా ఫార్వార్డ్ చేసిన మెసేజ్ నిజమో, కాదో తెలుసుకునేందుకు వీలుంటుంది.

కానీ ఆన్ లైన్ మీడియా అనేది భ్రమలతో నిండింది, అలసిపోయేలా చేస్తుంది అన్న అభిప్రాయం కొందరు ఓటర్లలో, బడా రాజకీయ నేతల్లో బలంగానే ఉంది.

చిత్రం శీర్షిక రమిత్ వర్మ

సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే రమిత్ వర్మ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు.. వినోదాన్ని కలిగించే మీమ్స్, వీడియోల ద్వారా రాజకీయ వైరుధ్యాలను అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు.

"చాలా బాగా రూపొందించిన వీడియోలకు ఫేస్‌బుక్‌లో గంట సేపట్లోనే 1,000 షేర్లు, 30 వేల దాకా వ్యూస్ వస్తాయి. యూట్యూబ్‌లో మంచి వీడియోకు మొదటి 48 గంటల్లో 1,50,000 వేల వ్యూస్ వస్తాయి. ఆ తర్వాత అవి వాట్సాప్‌లో వేగంగా వ్యాపిస్తాయి" అని పీయింగ్ హ్యూమన్ వ్యవస్థాపకుడు రమిత్ వర్మ తెలిపారు.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య కసరత్తు ప్రస్తుతం భారత్‌లో కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల కోలాహలంలో సోషల్ మీడియా ఓటర్లకు సహాయం చేస్తోందా లేక భ్రమల్లో పడవేస్తోందా అన్ని విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు.

అయితే, రంగుల హరివిల్లులాంటి ఈ ఎన్నికల్లో 46 కోట్ల వినియోగదారులున్న సోషల్ మీడియా రంగైతే విభిన్నంగానే ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం