గంగా ప్రక్షాళన ప్రాజెక్టు తర్వాత నది మరింత కలుషితమైపోయిందంటున్న కాంగ్రెస్, ఇది నిజమేనా - BBC Fact Check

  • 28 ఏప్రిల్ 2019
గంగా నది Image copyright SM VIRAL POST

మోదీ ప్రభుత్వ ''నమామి గంగే'' కార్యక్రమాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఇటీవల కొన్ని ఫొటోలను షేర్ చేశాయి. దూరం నుంచి గంగా నది స్వచ్ఛంగా కనిపిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫొటో, వ్యర్థాలతో నది కలుషితంగా కనిపిస్తున్నట్లుగా ఉన్న మరో ఫొటోను పంచుకున్నాయి.

నది పరిశుభ్రమైనట్లు బీజేపీ చూపెడుతోందని, వాస్తవానికి పరిస్థితి మరింత దిగజారిందన్న వ్యాఖ్యలను ఈ ఫొటోలకు జోడించాయి.

గంగా నదిని ప్రక్షాళన చేస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించాయి.

'జాయేగా తో మోదీ హీ', 'నమామి గంగే', 'దేశ్ కీ భూల్ కమాల్ కా ఫూల్' అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఖాతాలు ఈ పోస్ట్‌లను పెట్టాయి.

''రూ.25 వేల కోట్లతో మోదీ ప్రభుత్వం గంగా ప్రక్షాళన ప్రాజెక్టు చేపట్టినా ఆ నది మరింత కలుషితమైపోయింది'' అన్న వ్యాఖ్యతో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ విభాగం ఈ ఫొటోలను ట్వీట్ చేసింది.

గుజరాత్ యూత్ కాంగ్రెస్ కూడా ఇలాంటి ఫొటోలనే షేర్ చేసింది.

ముంబయి కాంగ్రెస్ ప్రదేశ్ సేవాదళ్, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ కూడా తమ అధికారిక ట్విటర్ ఖాతాల్లో ఈ ఫొటోలను పెట్టాయి.

అయితే, ఈ రెండు చిత్రాలూ బీజేపీ అధికారంలోకి రాక ముందు తీసినవేనని బీబీసీ పరిశీలనలో తేలింది.

మొదటి చిత్రం

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు మొదటి చిత్రం 2012లో తీసినట్లు వెల్లడైంది.

'పిక్సబే' అనే అంతర్జాతీయ ఫొటో షేరింగ్ వెబ్‌సైట్‌లోనూ అది కనిపించింది. 'ఒరియోటిక్కీ' అనే ఓ యూజర్ దాన్ని 2012 ఫిబ్రవరిలో పోస్ట్ చేశారు.

2012లో కేంద్రంలో కాంగ్రెస్, ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీఎస్‌పీ అధికారంలో ఉన్నాయి.

రెండో చిత్రం

రెండో చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసినప్పుడు 2015 నుంచి 2018 మధ్య అనేక సార్లు 'అవుట్‌లుక్ మ్యాగజైన్' దాన్ని 'ఫైల్ ఫొటో'గా వాడినట్లు వెల్లడైంది. ఆ మ్యాగజైన్ ఫొటో ఎడిటర్ 2011లో ఆ చిత్రాన్ని తీశారు.

గంగా నది గురించి మరో రకమైన కథనాన్ని ప్రచారం చేసేందుకూ బీజేపీ నాయకులు, మద్దతుదారులు కూడా ఈ చిత్రాన్ని వాడుకున్నారు.

2009 నుంచి 2019 మధ్య గంగా నదిని శుభ్రపరిచే ప్రక్రియ ఇలా సాగిందంటూ బీజేపీ తమిళనాడు ప్రధాన కార్యదర్శి వనతీ శ్రీనివాసన్ ఈ ఫొటోలను షేర్ చేశారు.

2011లో అవుట్‌లుక్ ఫొటో ఎడిటర్‌గా ఉన్న జితేంద్ర గుప్తాను మేం సంప్రదించాం.

''2011 మధ్యలో గంగా నది పరిస్థితిపై ఫొటో స్టోరీ చేసేందుకు వారణాసికి వెళ్లినప్పుడు ఆ చిత్రం తీశాను'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

2011లో కేంద్రంలో కాంగ్రెస్, ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీఎస్‌పీ అధికారంలో ఉన్నాయి.

గతంలోనూ ఇలాంటి ప్రచారాలు

'ప్రియాంకా గాంధీ టీమ్' అధికారిక ఖాతా అని పేర్కొంటూ ఓ ట్విటర్ ఖాతా కూడా ఈ చిత్రాలను షేర్ చేసింది.

ఈ ఫోటోలను ఉపయోగించుకుని కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

2018 అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్ యూత్ కాంగ్రెస్ అధికారిక ఖాతా ''బీజేపీస్ ఫేక్ గంగ వర్సెస్ ఇండియాస్ రియల్ గంగా'' అన్న వ్యాఖ్యతో ఈ ఫోటోలను పోస్ట్ చేసింది.

Image copyright Getty Images

వాస్తవ పరిస్థితి ఏంటి?

2014లో మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక చేపట్టిన అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో గంగానది ప్రక్షాళన ఒకటి. రాబోయే మూడేళ్లలో గంగానదిని శుభ్రం చేస్తామని ఆనాటి నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన శాఖ మంత్రి ఉమా భారతి కూడా ప్రకటించారు. మరి గంగ నిజంగానే కాలుష్యం నుంచి విముక్తి పొందిందా? బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తున్న కథనం.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)