IPL 2019: కోహ్లీ జట్టు కథ ముగిసింది.. బెంగళూరును ఓడించి ప్లేఆఫ్ చేరిన దిల్లీ

  • 29 ఏప్రిల్ 2019
విరాట్ కోహ్లీ Image copyright RoyalChallengersBangalore/facebook

ఐపీఎల్-12లో ఆదివారం జరిగిన రెండు మ్యాచుల్లో దిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తమ ప్రత్యర్థులపై గెలిచి ప్లేఆఫ్ అంటే చివరి నాలుగు జట్లలో స్థానం దక్కించుకుంటాయా, లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

చివరికి దిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి ప్లేఆఫ్‌కు చేరుకుంది. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరడానికి ఇంకా వేచిచూడాల్సుంటుంది.

ఆదివారం ఆడిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 34 పరుగుల తేడాతో ఓడించింది.

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 233 పరుగులు భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ముంబై ఆటగాడు హార్దిక్ పాండ్యా 34 బంతుల్లో ఆరు ఫోర్లు, 9 సిక్సర్లతో 91 రన్స్ చేశాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు.

కోల్‌కతా జట్టులో సునీల్ నారాయణ్, హారీ గర్నీ, ఆండ్రూ రసెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆండ్రూ రస్సెల్

కోల్‌కతా భారీ టార్గెట్

అంతకు ముందు టాస్ ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. మొదటి నుంచే ధాటిగా ఆడుతూ నిర్ధారిత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.

ఓపెనర్లు శుభమన్ గిల్, క్రిస్ లిన్ తర్వాత ఆండ్రూ రసెల్ కోల్‌కతాను బలమైన స్థితిలో నిలిపారు.

క్రిస్ లిన్‌తో కలిసి మొదటి వికెట్‌కు 96 రన్స్ జోడించిన శుభమన్ గిల్ ముంబై బౌలర్లకు మొదటి నుంచే చుక్కలు చూపించాడు.

45 బంతులు ఆడిన శుభమన్ గిల్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 రన్స్ చేశాడు. ఇటు లిన్ 29 బంతుల్లో 54 రన్స్ చేశాడు.

ఆ తర్వాత ఫాంలో ఉన్న ఆండ్రూ రసెల్ తన బ్యాట్ పదును చూపించాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

జట్టు వరస ఓటమిలు భరించలేక బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన రస్సెల్ తను మూడో స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలనని నిరూపించుకున్నాడు.

అంతకు ముందు మ్యాచుల్లో కూడా బ్యాట్ ఝళిపించిన రస్సెల్ ఆదివారం, ధాటిగా ఆడేందుకు పూర్తి అవకాశం లభించడంతో రెచ్చిపోయాడు.

ఈ గెలుపుతో నైట్ రైడర్స్ 12 మ్యాచుల్లో 5 విజయాలు, 7 ఓటమిలతో 10 పాయంట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

మరోవైపు ముంబై ఇండియన్స్ 12 మ్యాచుల్లో 7 విజయాలు, 5 ఓటమిలతో 14 పాయింట్లతో పట్టికలో ఇప్పటికీ మూడో స్థానంలో ఉంది.

ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో అందరూ భయపడ్డట్టే జరిగింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక శుభమన్ గిల్

కోహ్లీ టీమ్ అవుట్

సొంత మైదానం ఫిరోజ్‌షా కోట్లలో ఆడిన క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ ఆశలకు ముగింపు పలికింది.

దిల్లీ చేతిలో 16 పరుగుల తేడాతో పరాజయం పాలవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి నాలుగు జట్లలో చేరడానికి ఉన్న అన్ని సమీకరణాలూ, అవకాశాలకూ తెరపడింది.

ప్రస్తుతం 12 మ్యాచుల్లో 4 విజయాలు, 8 ఓటమిలతో బెంగళూరు కేవలం 8 పాయింట్లు సాధించి పట్టికలో చివరి స్థానంలో ఉంది.

విజయం కోసం 188 రన్స్ చేయాల్సిన బెంగళూరు నిర్ధారిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 రన్స్ మాత్రమే చేయగలిగింది.

అంతకు ముందు టాస్ గెలిచిన దిల్లీ మొదట బ్యాటింగ్ చేయాలని డేరింగ్ డెసిషన్ తీసుకుంది. నిర్ధారిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక విరాట్ కోహ్లీ

బెంగళూరు ఓపెనర్లు పార్థివ్ పటేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి వికెట్‌కు కేవలం 5.5 ఓవర్లలో 63 రన్స్ జోడించి మంచి ప్రారంభం ఇచ్చారు.

పార్థివ్ పటేల్ కేవలం 20 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 39 రన్స్ చేసి రబాడా బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు.

పార్థివ్ డగవుట్‌లోకి వెళ్లి తన ప్యాడ్ కూడా విప్పుండడేమో.. మరో ఓపెనర్ కోహ్లీ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో మిడ్ వికెట్‌లో ఉన్న రూథర్‌ఫర్డ్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చేశాడు.

విరాట్ కోహ్లీ 17 బంతుల్లో 23 రన్స్ చేశాడు. ఆ తర్వాత దిల్లీ బౌలర్లు మ్యాచ్‌పై పట్టుబిగిస్తూ వచ్చారు.

బెంగళూరు జట్టులో ఏబీ డివిలియర్స్ 17, శివం దుబె 24, గుకీరత్ సింగ్ మాన్ 27, మార్కస్ స్టొయినిస్ 32 (నాటౌట్‌) రన్స్ చేశారు. కానీ అవి మ్యాచ్‌ను గెలిపించలేకపోయాయి.

దిల్లీ బౌలర్ కేగిసో రబడా 31 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, స్పిన్నర్ అమిత్ మిశ్రా 29 రన్స్ ఇచ్చిరెండు వికెట్లు పడగొట్టారు.

Image copyright Getty Images

జోరు చూపించిన దిల్లీ

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(52), ఓపెనర్ శిఖర్ ధవన్(52) హాఫ్ సెంచరీలతో రెండో వికెట్‌కు 68 రన్స్ భాగస్వామ్యం అందించారు.

శిఖర్ ధవన్ 37 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఫాంలో ఉన్న ఇతడు ఆదివారం వరసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు.

ధవన్ ఇంతకు ముందు రాజస్థాన్ రాయల్స్‌పై 54, పంజాబ్‌పై 56 పరుగులు చేశాడు.

ఇవి కాకుండా ఇంతకు ముందు కోల్‌కతాపై 97 రన్స్ చేసిన గబ్బర్ నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత హైదరాబాద్‌తో 7, ముంబైతో 35 పరుగులు మాత్రమే చేశాడు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 37 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక భాగస్వామ్యం అందించాడు. ఇది అతడికి ఐపీఎల్‌లో మూడో హాఫ్ సెంచరీ

ఈ విజయంతో దిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచుల్లో 8 విజయాలు, 4 ఓటమిలతో మొత్తం 16 పాయింట్లతో ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది.

గత చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అంతకు ముందే ప్లేఆఫ్‌కు చేరుకుంది.

ఇంతకు ముందు 2012లో కూడా దిల్లీ ప్లేఆఫ్ చేరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా

'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'.. బాలీవుడ్ సినిమాపై పొరుగు దేశంలో ఆగ్రహం

హైదరాబాద్ ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు మైనర్లని చెప్తున్న 'బోనఫైడ్' సర్టిఫికెట్లు.. ఎన్‌హెచ్‌ఆర్సీకి అందించిన కుటుంబ సభ్యులు

మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్‌ ప్రశ్న, సమాధానం ఏంటి

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం