సీసీఎంబీ పరిశోధన: బ్యాక్టీరియా అసలు పెరగకుండా, పెద్దవి కాకుండా అదుపుచేసే దిశగా ముందడుగు

  • 30 ఏప్రిల్ 2019
బ్యాక్టీరియా విచ్ఛిన్నం కావడం Image copyright CCMB

బాక్టీరియాలపై పోరాటంలో ముందడుగు వేసింది హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబి. బ్యాక్టీరియా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఎంజైమును కనుగొన్నారు. దీనివల్ల యాంటీ బ్యాక్టీరియా మందుల్లోనూ, ఈ మందులను తట్టుకుని ముదిరిపోతున్న బ్యాక్టీరియాలను అదుపు చేయడంలో ఎంతో ప్రగతి వచ్చే అవకాశం ఉంది.

అసలీ పరిశోధన ఏంటి?

బాక్టీరియా అనేది ఒక కణం (సెల్). ప్రతీ బ్యాక్టీరియా చుట్టూ గోడలాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే సెల్ వాల్ అంటారు. ఈ గోడ ఒక మెష్ లాగా ఉంటుంది. బ్యాక్టీరియా పరిమాణంలో పెరగడానికీ, బ్యాక్టీరియాల సంఖ్య పెరగడానికి కూడా ఈ కణపు గోడలే కారణం. కానీ ఇది ఎలా తయారువుతుందన్న ప్రక్రియపై స్పష్టత లేదు.

బ్యాక్టీరియాలు పెద్దగా ఎదిగి రెండుగా విడిపోయి అలా వాటి సంఖ్య పెరగిపోతుంది. ఇలా పెద్దగా ఎదగడానికీ, రెండుగా విడిపోవడానికీ ఈ గోడే కీలకం. ఇప్పటి వరకూ ఈ గోడ ఎలా తయారువుతుందన్న ప్రక్రియపై స్పష్టత లేదు. తాజాగా ఆ బ్యాక్టీరియా గోడ ఎలా పెరుగుతుందో కనిపెట్టారు సీసీఎంబీ వారు.

బ్యాక్టీరియా పెరిగే ప్రతీసారీ ఈ మెష్‌ని కొన్ని ఎంజైములు కట్ చేస్తాయి. అప్పుడు కొన్ని ప్రోటీన్లు గుంపులుగా ఏర్పడి కొత్త తరహా షుగర్స్, పెప్టైడ్లను కలుపుకుని ఈ మెష్‌లో చేరే ఒక క్లిష్టమైన ప్రక్రియతో ఈ గోడ ఏర్పడుతుంది. ఆ గోడ పెద్దది అయ్యాక మరికొన్ని ఎంజైములు మెష్‌ను కలుపుతాయి.

ఈ పరిశోధన ఎందుకు అవసరం?

బ్యాక్టీరియాల వల్ల అనేక జబ్బులు వస్తాయి. కలరా వంటి ప్రాణాంతకమైనవి కూడా అందులో ఉన్నాయి. యాంటీబయోటిక్స్ అని మనం పిలిచే మందులన్నీ ఈ బ్యాక్టీరియాలను ఎదుర్కోవడానికి వాడేవే.

కానీ క్రమంగా ఆ బ్యాక్టీరియా అనే జీవులు ఈ యాంటీబయోటిక్స్‌ని కూడా తట్టుకునేలా తయారయిపోతున్నాయి. దీంతో మనం వాడే మందులు పని చేయక, మోతాదు పెంచేయాల్సి వస్తోంది. అది మరో కొత్త సమస్య.

చిత్రం శీర్షిక పరిశోధన చేసిన పవన్, మంజులా, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా

ఈ పరిస్థితుల్లో అసలు బ్యాక్టీరియాలను ఎలా అదుపు చేయాలన్న ప్రశ్నకు సమాధానాల్లో ఒకటి ప్రస్తుత పరిశోధన. పెన్సిలిన్ సహా చాలా రకాల యాంటీ బయోటిక్స్, బ్యాక్టీరియా కణం గోడపై దాడి చేస్తాయి. దాన్ని విచ్ఛిన్నం చేసి, ఆ మెష్ లాంటి నిర్మాణాన్ని విడదీస్తాయి. దీంతో బ్యాక్టీరియాలు నాశనం అవుతాయి.

‘‘కానీ ఇప్పుడు ఆ బ్యాక్టీరియా సెల్ వాల్ నిర్మాణం ఎలా జరుగుతుందో సీసీఎంబీ గుర్తించింది. ఏఏ ఎంజైములు ఈ పని చేస్తున్నాయో తేల్చింది. ఇప్పుడు ఆ ఎంజైములను అదుపు చేసే మందులు కనిపెడితే, అప్పుడిక బ్యాక్టీరియాలను అదుపు చేయడం సులువు అవుతుంది’’ అంటూ పరిశోధన గురించి వివరించారు పవన్ అనే శాస్త్రవేత్త.

యాంటీ బ్యాక్టీరియాల పరిశోధనలో సీసీఎంబీ ఒక పునాది వేసింది. దాని ఆధారంగా ఫార్మా రంగం మరో పరిశోధన, అంటే వీళ్లు కనిపెట్టిన ఎంజైమును కంట్రోల్ చేసే మందులు కనిపెడితే అప్పుడు బ్యాక్టీరియా వ్యాధుల పోరాటంలో మానవాళికి మరో కొత్త అస్త్రం దొరికినట్టు అవుతుంది.

ఇప్పటి వరకూ పెరిగిపోయిన, పెద్దవైపోయిన బ్యాక్టీరియాలను అదుపు చేసే మందులు మాత్రమే ఉన్నాయి. ఇకపై బ్యాక్టీరియా అసలు పెరగకుండా, పెద్దవి కాకుండా చూసే మందులు కనిపెట్టడానికి ఆస్కారం కల్పించారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు.

సీసీఎంబీకి చెందిన డా. మంజుల ల్యాబ్‌లో, డా. పవన్ ఈ పరిశోధన చేశారు.ఈ పరిశోధన అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురితం అయింది.

సీసీఎంబీలో పదేళ్ల నుంచి ఈ పరిశోధన జరుగుతోంది. తాజా పరిశోధన ఈ కొలీ బ్యాక్టీరియాపై జరిపారు. ఇదే తరహాలో కొన్ని ఎంజైములను 2012లో గుర్తించింది ఈ సంస్థ. వాటికి ఎంఇపి ఎస్, ఎంఇపి ఎం, ఎంఇపి హెచ్ అనే పేర్లు పెట్టారు. తాజా ఎంజైముకు ఎంఇపి కె అనే పేరు పెట్టారు. ఎంఇపి అంటే మురియం ఎండో పెప్టిడేస్ అని అర్థం.

వి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)