‘విజయవాడ ఏమైనా ఉత్తర కొరియానా? ఏపీకి రావాలంటే వీసాలు తీసుకోవాలా?’ - రామ్‌గోపాల్‌ వర్మ: ప్రెస్ రివ్యూ

  • 30 ఏప్రిల్ 2019
Image copyright RGV/facebook

విజయవాడలో సమావేశం పెట్టడానికి వీల్లేదు అంటే ఆంధ్రప్రదేశ్‌లోకి రాకూడదు అని అర్థమా? విజయవాడ ఏమైనా ఉత్తర కొరియానా? ఏపీకి రావాలంటే మేం వీసాలు తీసుకోవాలా? అని రామ్‌గోపాల్‌ వర్మ ప్రశ్నించారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

మే 1న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా విజయవాడలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయాలనుకున్న ఆ చిత్ర బృందాన్ని అక్కడి పోలీసులు అడ్డుకుని హైదరాబాద్‌కు పంపించేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం రామ్‌గోపాల్‌ వర్మ మీడియాతో మాట్లాడారు.

''నేనింకా షాక్‌లో నుంచి బయటకు రాలేకపోతున్నాను. పోలీస్‌ వ్యవస్థకు లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు ఉంటాయి. దాన్ని పాటించడం దేశ పౌరులుగా మన బాధ్యత. పోలీసులు ప్రెస్‌మీట్‌ వీలులేదని చెప్పడం సివిల్‌ సొసైటీలో ఓ పద్ధతి. కానీ మమ్మల్ని చుట్టుముట్టి బయటకు లాగి విజయవాడలో ఎంట్రీ వీలులేదు అన్నట్టు ప్రవర్తించారు. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అని అక్కడి అధికారులను అడిగితే పేర్లు చెప్పడం లేదు. వాళ్ల పై అధికారులు కావొచ్చు, గవర్నమెంట్‌ అఫీషియల్స్‌ కూడా అయ్యుండొచ్చు. మనం నియంతృత్వ రాజ్యంలో ఉంటున్నామా? ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా? నేనో ఆఫీసర్‌ని 'రోడ్డు మీద కాకుండా ఓ ఫ్రెండ్‌ ఇంట్లో కొందరు పాత్రికేయులతో మాట్లాడతాను' అని అడిగాను.

విజయవాడ లోపలికి రానివ్వం, ఉండనివ్వం అంటే అది ఆంధ్రప్రదేశా? నార్త్‌ కొరియానా? అంటే అక్కడికి వెళ్లాలంటే వీసాలు తీసుకోవాలా? క్రిమినల్‌ బ్యాగ్రౌండ్‌ చెక్‌ చేయించాలా? ప్రెస్‌మీట్లనే ఆపేశారు మరి థియేటర్లలో సినిమాను ఆడనిస్తారా?

నన్ను బంధించిన ఆ ఏడు గంటల్లో 'బిహైండ్‌ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అనే కథను రాశాను. ఈ సినిమా పార్ట్‌ 2లో ఆ కథ వస్తుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

జేఈఈలో తెలుగు విద్యార్థుల హవా

ఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షలో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తా చాటారని, టాప్‌-10లో ఏకంగా నాలుగు ర్యాంకులు సాధించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు 24 మంది ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు ఉండగా.. ఏపీ నుంచి ఇద్దరు ఉన్నారు.

తెలంగాణకు చెందిన విద్యార్థులు 5, 7, 8, 19వ ర్యాంకులతో మరోసారి సత్తా చాటగా.. ఏపీకి చెందిన విద్యార్థులు 9, 21 ర్యాంకులు తెచ్చుకున్నారు. వీరిలోనూ ఈసారి అబ్బాయిలదే పైచేయి కావడం విశేషం.

తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఆరు ర్యాంకుల్లోనూ ఐదింటిని అబ్బాయిలే సాధించారు. జేఈఈ మెయిన్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించింది.

దిల్లీకి చెందిన సుభాన్‌ శ్రీవాత్సవ మొదటి ర్యాంకు సాధించగా.. కర్ణాటకకు చెందిన కెవిన్‌ మార్టిన్‌ రెండో ర్యాంకు తెచ్చుకున్నాడు.

తెలంగాణకు చెందిన బట్టిపాటి కార్తికేయ ఐదో ర్యాంకు సాధించి రెండు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచాడు. అలాగే, తెలంగాణకు చెందిన ఆడెల్లి సాయి కిరణ్‌ 7వ ర్యాంకు, విశ్వంత్‌ 8వ ర్యాంకు, జయంత్‌ ఫణి సాయి 19వ ర్యాంకు సాధించారు.

ఏపీ నుంచి కొండా రేణు 9వ ర్యాంకు, బొజ్జా చేతన్‌ రెడ్డి 21వ ర్యాంకు సాధించారు.

Image copyright Getty Images

తెలంగాణ ఐటీ ఎగుమతులు రెట్టింపు

ఐదేళ్లలోనే తెలంగాణలో ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ప్రచురించింది.

2013-14 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.52వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల విలువ ఐదేండ్లలో రెట్టింపయ్యింది. ఐటీ ఎగుమతుల్లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 17% వృద్ధిరేటు నమోదైంది. దాని ప్రకారం తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.1,09,219 కోట్లకు చేరింది.

ఉద్యోగాల కల్పనలోనూ 14.2% వృద్ధిని సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇదేరంగంలో దేశ సగటు కంటే రెట్టింపు వృద్ధిని నమోదుచేసింది.

జాతీయ స్థాయిలో ఐటీ ఎగుమతుల్లో వృద్ధి 10% ఉంటుందని సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంచనావేయగా, జాతీయ సగటు కంటే తెలంగాణ 17 శాతం వృద్ధిని సాధించింది. ఏటా ఎస్టీపీఐ, ఎస్‌ఈజెడ్‌ల నుంచి గణాంకాలను స్వీకరిస్తారు. ఆ రెండు వేదికల నుంచి వచ్చిన గణాంకాల ఆధారంగా ప్రస్తుత ఏడాది ఎగుమతుల లెక్కలను క్రోడీకరిస్తారు.

తెలంగాణకు ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. తద్వారా ఐటీ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసేలా వ్యవహరించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ వల్ల ఉద్యోగాల్లో భారీగా కోతలు పడుతాయనే అపోహలు వ్యాపించాయి. ఇలా ప్రతికూల ధోరణులు ఉన్నప్పటికీ హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఏటేటా వృద్ధి పథంలోనే సాగింది. దేశ సగటును మించిన వృద్ధి సాధించిందని నమస్తే తెలంగాణ రాసింది.

నరేంద్ర మోదీ Image copyright Getty Images

40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో 'టచ్‌'లో ఉన్నారని, ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన వెంటనే వారు ఆ పార్టీని విడిచిపెడతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని ఈనాడు పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

హుగ్లీ జిల్లా శ్రీరాంపుర్‌, ఉత్తర 24 పరగణాల జిల్లా బారక్‌పుర్‌లలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి విమర్శలు చేశారు.

''దీదీ! ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మీ ఎమ్మెల్యేలు మీ పార్టీని వీడుతారు. మీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన మరుక్షణమే వారు పార్టీని వీడుతారు. మీ అధికార పీఠం కదులుతోంది'' అని వ్యాఖ్యానించారు.

ఓడిపోతామని తెలిసే మమతా బెనర్జీ సహనాన్ని కోల్పోతున్నారని విమర్శించారు. తృణమూల్‌ గూండాలు ప్రజలను ఓటేయనీయడం లేదని ఆరోపించారు. భాజపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనీయడం లేదని అన్నారు.

''మమతా దీదీ! మీరు అనుభవిస్తున్న పదవిని ప్రజాస్వామ్యమే ఇచ్చింది. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవొద్దు. రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్‌ను ఓడించాలని పశ్చిమ బెంగాల్‌ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు'' అని అన్నారు.

ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మమతా బెనర్జీ కలలు నెరవేరవని మోదీ వ్యాఖ్యానించారు.''దీదీ! మీకు దిల్లీ చాలా దూరం'' అని వ్యాఖ్యానించారు. ప్రధాని కావాలని ఆమె కనీసం కల కూడా కనలేరని అన్నారు. ''కేవలం కొన్ని సీట్లతో మీరు దిల్లీ చేరుకోలేరు. దిల్లీ చాలా దూరం. దిల్లీకి వెళ్లాలనుకోవడం ఓ సాకు మాత్రమే. మేనల్లునికి రాజకీయ పగ్గాలు అప్పగించడమే ఆమె లక్ష్యం'' అని మోదీ విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)