మే డే - అంబేడ్కర్: "మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?"

  • 1 మే 2019
బీఆర్ అంబేడ్కర్ Image copyright Dr. Ambedkar Foundation

ఒక నిరుద్యోగి ఉద్యోగం కోరుకుంటాడా, హక్కులు కోరుకుంటాడా? భారత్‌లో కులవ్యవస్థ కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కార్మికుల హక్కులు, సంక్షేమం, ఐక్యత కోసం సుదీర్ఘకాలం కృషిచేసిన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఈ అంశాలపై ఏమన్నారు?

"ఒక నిరుద్యోగికి ఎంతో కొంత వేతనమున్న, నిర్దిష్టమైన పనిగంటలు లేని ఒక ఉద్యోగం ఆఫర్ చేశారు. అతడికి ఒక షరతు పెట్టారు. ఉద్యోగ సంఘంలో చేరే హక్కు, భావ ప్రకటనా హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇతర హక్కులు ఉండవని చెప్పారు. ఇప్పుడు ఆ నిరుద్యోగి ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టం. ఆకలి భయం, ఇల్లూవాకిలీ కోల్పోతాననే భయం, ఏమైనా పొదుపు చేసుకొనుంటే ఖర్చయిపోతుందేమోనన్న భయం ఆ నిరుద్యోగికి కలుగుతాయి. ఈ భయాందోళనలు చాలా బలమైనవి. వీటివల్ల ఎవరూ తమ ప్రాథమిక హక్కుల కోసం నిలబడలేరు" అని అంబేడ్కర్ చెప్పారు.

కేవలం లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ పౌరుడి ప్రాథమిక హక్కులను ఎలా దెబ్బతీయగలదో సోదాహరణంగా చెబుతూ ఆయన ఒక సందర్భంలో ఇలా రాశారు.

ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ఫలితాలను కార్మిక వర్గం నేటికీ పొందుతోంది.

Image copyright Getty Images

లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ రెండు రాజకీయ ప్రజాస్వామిక సూత్రాలకు విఘాతం కలిగిస్తుందని అంబేడ్కర్ చెప్పారు. వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమాన్యాలు నిర్దేశిస్తాయని, అలాగే జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు.

'కుల వ్యవస్థ పనినే కాదు, కార్మికులనూ విభజిస్తుంది'

భారత సమాజ తీరును లోతుగా పరిశోధించిన అంబేడ్కర్, కులానికి, పనికీ సంబంధముందని గుర్తించారు.

కుల వ్యవస్థ పని విభజనకు సంబంధించినదనే వాదనను ఆయన తిరస్కరించారు. ఈ సమాజం పనినే కాకుండా కార్మికులను కూడా విభజించి చూస్తోందని, ఇది అసహజమైనదని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. కార్మికుల విభజనను హిందూ సమాజ నిర్మాణమే ఆమోదించి, కొనసాగిస్తోందని, ఈ విభజనలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే వర్గీకరణ ఉందని చెప్పారు. కార్మికులను ఇలా చూసే పని విభజన మరే దేశంలోనూ లేదన్నారు.

Image copyright Digvijay Singh
చిత్రం శీర్షిక సమాజం పనినే కాకుండా కార్మికులను కూడా విభజించి చూస్తోందని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని అంబేడ్కర్ చెప్పారు.

పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్ వివరించారు. వ్యక్తి తన సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు.

అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన, తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు.

నాటి పరిస్థితులు ఇప్పుడున్నాయా?

ఈ అంశంపై రచయిత, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి(కస్టమ్స్&ఎక్సైజ్) ఎస్‌ఎన్ బూసితో బీబీసీ మాట్లాడగా- అంబేడ్కర్ కాలంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, దేశంలో కుల వ్యవస్థ నేటికీ కొనసాగుతోందని, గ్రామాల్లో ఇప్పటికీ అంటరానితనం తీవ్రంగానే ఉందని చెప్పారు.

ఎస్‌ఎన్ బూసి 'డాక్టర్ అంబేడ్కర్: ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్(ఆరు సంపుటాలు)', 'మహాత్మా గాంధీ అండ్ బాబాసాహెబ్ అంబేడ్కర్' పుస్తకాలతోపాటు బౌద్ధంపై నాలుగు సంపుటాలు రాశారు.

అంబేడ్కర్ అందరూ సమానులేనని, అందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని చెప్పారని, వాటి సాధనకు కృషిచేశారని ఆయన తెలిపారు.

భారత రాజ్యాంగంలోని 17వ అధికరణ అంటరానితనాన్ని నిషేధించిందని, కానీ కులవ్యవస్థపై నిషేధం లేదని ఆయన ప్రస్తావించారు.

'దళితుడైనందుకే అంబేడ్కర్‌కు అంత గుర్తింపు దక్కలేదు'

కార్మికుల కోసం అనేక చట్టాలను అంబేడ్కర్ తీసుకొచ్చారని, కానీ ఆయనకు లభించాల్సినంత విస్తృతమైన గుర్తింపు లభించలేదనే వాదనపై ఎస్‌ఎన్ బూసి స్పందిస్తూ- ఆయన దళితుడు కావడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు.

అణగారిన వర్గాలు ముఖ్యంగా కార్మిక వర్గాలు ఆర్థిక, సామాజిక దోపిడీకి గురవుతుండటంపై అంబేడ్కర్ ఆవేదన చెందారు. ఈ వర్గాలకు విముక్తి కల్పించేందుకు అప్పటి సైద్ధాంతిక వాదనలను సవాలు చేశారు.

వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్‌లో 1942 జులై నుంచి 1946 జూన్ వరకు అంబేడ్కర్ సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వం ఆయన నాయకత్వంలో, కార్మిక సమస్యలు, పారిశ్రామిక సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించింది. కార్మికులందరికీ సరైన వేతనాలు, సరైన పరిస్థితులను హక్కుగా కల్పించింది.

స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడ్డ తొలి కేబినెట్‌లో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.

Image copyright Getty Images

1923 నాటి కార్మికుల పరిహార చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1943 నాటి కర్మాగారాల చట్టంలలో కార్మికులకు అనుకూలంగా సవరణలు తీసుకొచ్చేందుకు వివిధ స్థాయుల్లో అంబేడ్కర్ చర్యలు చేపట్టారు. పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకించారు. బ్రిటన్ తరహాలో వారానికి 48 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు.

కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా అంబేడ్కర్ కృషితో వచ్చిన నిబంధనలు, మారిన/తెచ్చిన చట్టాలు ఇవీ...

1. పనిగంటలు ఎనిమిదికి తగ్గింపు

2. లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం

3. వేతన చెల్లింపు చట్టం

4. కనీస వేతనాల చట్టం

5. ఉద్యోగుల వేతన సవరణ చట్టం

6. భారత కర్మాగారాల చట్టం

7. భారత కార్మిక సంఘ చట్టం

8. కార్మికుల పరిహార చట్టం

9. కార్మికుల రక్షణ చట్టం

10 ప్రసూతి ప్రయోజనాల చట్టం

11. కార్మిక రాజ్య బీమా(ఈఎస్ఐ) చట్టం

12. మహిళలు, బాల కార్మికుల రక్షణ చట్టం

13. బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్ చట్టం

14. మహిళా కార్మికుల సంక్షేమ నిధి

15. బొగ్గు గనుల్లో భూగర్భ పనుల్లో మహిళల నియామకంపై నిషేధం పునరుద్ధరణ

16. వేతనంతో కూడిన సెలవులు

17. సామాజిక భద్రత

ఆయా నిబంధనలు, చట్టాలు కాల క్రమంలో మారుతూ వస్తున్నాయి.

పనిగంటలు ఎందుకు తగ్గించారంటే...

పనిగంటలను 12 నుంచి ఎనిమిదికి తగ్గించాలని 1942 నవంబరు 27న దిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన నాలుగో భారత కార్మిక సదస్సులో అంబేడ్కర్ తొలిసారిగా ప్రతిపాదించారు. 1945 నవంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఏడో సదస్సు కర్మారాగాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సదస్సులో కేంద్ర, ప్రావిన్షియల్ ప్రభుత్వాలు, యాజమాన్య సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అధిక పనిగంటలతో కార్మికుడికి తగినంత వ్యక్తిగత సమయం లేకుండా చేయడం సరికాదని కార్మిక శాఖ తన మెమోరాండంలో చెప్పింది. వ్యక్తిగత ఎదుగుదలకు, శారీరక సామర్థ్యం పెంపునకు కార్మికులకు వ్యక్తిగత సమయం అవసరమని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కార్మికులు తీవ్రమైన పని ఒత్తిడికి లోనయ్యారని, వారికి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉందని, పనిగంటల తగ్గింపునకు ఇది సరైన సమయమని ఆ సందర్భంగా వివరించింది. తక్కువ పనిగంటలతో ఉపాధి పెరుగుతుందని కూడా చెప్పింది. పనిగంటల తగ్గింపునకు అనుగుణంగా వేతనాల తగ్గింపునకు, డీఏ తగ్గింపునకు(ధరలు పడిపోతే తప్ప) వీల్లేదని మెమోరాండం స్పష్టం చేసింది.

పనిగంటలు, సామాజిక భద్రత ఇప్పుడెలా ఉన్నాయి?

పనిగంటలు, కార్మికుల సంక్షేమం ఇప్పుడెలా ఉన్నాయనేదానిపై 'ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్(ఫర్ఐటీ)' అధ్యక్షుడు కిరణ్ చంద్రను బీబీసీ సంప్రదించగా- నేటి తరం పరిశ్రమలతో 'ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల నిద్ర, ఎనిమిది గంటల సామాజిక జీవనం' అనే విధానం గందరగోళంలో పడిపోయిందని విచారం వ్యక్తంచేశారు.

ఇప్పడు ఉద్యోగుల్లో అత్యధికులకు పని ప్రదేశానికి వెళ్లి వచ్చేందుకే కనీసం నాలుగు గంటలు పడుతోందని, ఇలా పనిగంటలు 12కు పెరిగాయని చెప్పారు.

Image copyright Getty Images

'వెట్టిచాకిరీగా మారింది'

గృహవసతి, ఆరోగ్యం, విద్య విషయాల్లో సామాజిక భద్రత కొరవడటంతో ఉద్యోగమనేది వెట్టిచాకిరీగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఐటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఆధ్వర్యంలో రెండేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలితాలిస్తోందని, పరిస్థితిలో మార్పు వస్తోందని కిరణ్ ఆశాభావం వ్యక్తంచేశారు. నేటి తరం కార్మిక వర్గం సంఘటితమవుతోందని, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తోందని తెలిపారు.

కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు అంబేడ్కరే

విధాన స్థాయిలోనే కాకుండా రాజకీయ స్థాయిలోనూ అంబేడ్కర్ కార్మిక సంక్షేమానికి కృషి చేశారు. కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయ నాయకుడు ఆయనే.

1936 ఆగస్టులో అంబేడ్కర్ 'ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(ఐఎల్‌పీ)'ని స్థాపించారు. తమది కార్మికుల పార్టీ అని ఐఎల్‌పీ ప్రకటించుకొంది. కార్మిక వర్గాల సంక్షేమమే పరమావధిగా కలిగిన కార్మిక సంస్థగా ఐఎల్‌పీ 1937లో వెలువరించిన విధానపత్రంలో తనను తాను అభివర్ణించుకొంది.

1937లో జరిగిన ప్రావిన్సియల్ ఎన్నికల్లో ఐఎల్‌పీ 17 స్థానాల్లో పోటీచేసి, 14 చోట్ల విజయం సాధించింది. పోటీచేసిన 13 రిజర్వుడు స్థానాల్లో 11 చోట్ల, పోటీచేసిన నాలుగు జనరల్ సీట్లలో మూడు చోట్ల గెలిచింది.

ఐఎల్‌పీ కార్మికులు, చిన్నరైతుల కోసం పెద్దయెత్తున అనేక పోరాటాలు చేసింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ

ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు