హనుమంతుడిని, మహిళలను కన్హయ్య కుమార్ అవమానించారా: Fact Check

  • 1 మే 2019
కన్హయ్య కుమార్ Image copyright Reuters

బిహార్‌లోని బెగూసరాయ్ లోక్‌సభ స్థానంలో సీపీఐ తరపున పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్ ప్రసంగం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

25 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. ''హనుమంతుడు శ్రామిక వర్గ దేవుడు. మనకు అంతటా కనిపిస్తాడు. వేరొకరి భార్య అపహరణకు గురైందని లంకను దహనం చేశాడు. స్నేహితుడైన సుగ్రీవుడి కోసం రాముడు మోసం చేసేందుకూ సిద్ధమయ్యాడు. విలువల కన్నా స్నేహం గొప్పది'' అని కన్హయ్య కుమార్ వ్యాఖ్యానించినట్లుగా ఉంది ఆ వీడియోలో.

హనుమంతుడిని, మహిళలను కన్హయ్య అవమానించారంటూ ఈ వీడియోను ట్విటర్‌లో 'చౌకీదార్ స్క్వింటీ' అనే పేరుతో ఉన్న యూజర్ పోస్ట్ చేశారు.

''ఈ వ్యాఖ్యలు హిందువులకే కాదు మహిళలకూ వ్యతిరేకం. మహిళలు వేధింపులకు గురవుతున్నప్పుడు నిల్చొని చూసేది ఇలాంటి మనుషులే'' అన్న క్యాప్షన్‌ను దీనికి జోడించారు.

ఈ వీడియోను ట్విటర్‌లో 50 వేల మందికిపైగా వీక్షించారు. వేల మంది షేర్ చేశారు. ఫేస్‌బుక్‌లోనూ ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.

Image copyright facebook/Screengrab

అయితే, ఈ వీడియో తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లు బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.

కన్హయ్య ప్రసంగం అసలు వీడియో నుంచి కేవలం కొన్ని భాగాలను మాత్రమే తీసుకొని తప్పుడు అర్థం వచ్చేలా 25 సెకన్ల వీడియో క్లిప్‌ను రూపొందించినట్లు తేలింది.

పూర్తి వీడియోను 'న్యూస్ ఆఫ్ బిహార్' అనే యూట్యూబ్ ఛానెల్ 2018, మార్చి 30న పోస్ట్ చేసింది.

ఆ ఛానెల్ వెల్లడించిన వివరాల ప్రకారం చంపారన్‌లోని మోతిహరిలో తొమ్మిదిన్నర నిమిషాల పాటు కన్హయ్య ఈ ప్రసంగం చేశారు.

''వేరొకరి భార్య అపహరణకు గురైందని హనుమంతుడు లంకను దహనం చేశాడు. అలాంటి హనుమంతుడి పేరును వాడుకుంటూ మన వాళ్ల ఇళ్లను వారు తగలబెడుతున్నారు. శ్రీరాముడి సంప్రదాయాలు పాటించే దేశం మనది. శబరి ఎంగిలి చేసిన పండును తింటాం. సవతి తల్లి కోసం జీవితంలోని సుఖాలను వదులుకుంటాం'' అని కన్హయ్య ఈ వీడియోలో అన్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శిస్తూ.. ''యోగి అడవి నుంచి కాషాయ వస్త్రాలు ధరించి వచ్చారు. ఇప్పుడు సీఎం కుర్చీ కోరుకుంటున్నారు. ఆయన రామ భక్తుడినని చెప్పుకుంటుంటారు. రాముడు సింహాసనాన్ని వదిలి అడవులకు వెళ్లాడు. తేడాను అందరూ అర్థం చేసుకోవాలి. విలువల కన్నా స్నేహం ముఖ్యమని రాముడు అనుకున్నాడు. అలాంటిది ఆయన పేరుతో వీళ్లు మనుషుల మధ్యలో గోడలు సృష్టిస్తున్నారు'' అని కన్హయ్య వ్యాఖ్యానించడం ఆ వీడియోలో ఉంది.

ఆ 25 సెకన్ల క్లిప్‌ను చూపిస్తూ హిందూ దేవుళ్లు, మహిళలను కన్హయ్య అవమానించారంటూ జరుగుతున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేదే.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు