హాజీపూర్ బాలికల హత్యలు: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’

  • 1 మే 2019
నిందితుడు శ్రీనివాస రెడ్డి
చిత్రం శీర్షిక నిందితుడు శ్రీనివాస రెడ్డి

హాజీపూర్ హత్య కేసు మిస్టరీ వీడింది. వరుసగా మైనర్ బాలికలపై హత్యా నేరాలకు పాల్పడుతోన్న మర్రి శ్రీనివాస రెడ్డి అలియాస్ శ్రీనివాస్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసులు చెప్పారు..

రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌కి చెందిన మర్రి శ్రీనివాస రెడ్డి లిఫ్టు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 28 ఏళ్ల ఇతను ఇప్పటి వరకూ నాలుగు మర్డర్లు చేశాడు. ఒక వేధింపుల కేసు ఉంది.

హాజీపూర్‌కి చెందిన 14 ఏళ్ల అమ్మాయి స్కూలుకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ కేసుతోనే మొత్తం శ్రీనివాస రెడ్డి బండారం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 25వ తేదీన ఆమె కీసరలోని తన స్కూలు నుంచి బొమ్మల రామారం చేరుకుంది. అక్కడ నుంచి హాజీపూర్ వెళ్లేందుకు ఎదురుచూస్తూ దగ్గర్లో ఉన్న చింత చెట్టు దగ్గర నుంచుంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన శ్రీనివాస్ ఆమెకు లిఫ్టు ఇచ్చాడు. అక్కడ నుంచి ఊరు వెళ్లే దారిలో, రోడ్డు పక్కనే ఉన్న తన పొలం వద్దకు తీసుకెళ్లి ఆమెకు ఊపిరాడకుండా చేసి స్పృహ తప్పిన తరువాత బావిలోకి విసిరేసాడు. తానుకూడా బావిలోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడి చేసి, చంపేసి అక్కడే పూడ్చి పెట్టాడు. బయటకు వచ్చాక అక్కడ పడి ఉన్న ఆమె స్కూలు బ్యాగును తన పక్క పొలంలో ఉన్న బావిలో పారేశాడు.

చిత్రం శీర్షిక బాలికలను చంపి, పారేసిన బావి ఇదే

2015లో బాలికపై అత్యాచారం, హత్య

2015లో 11ఏళ్ల అమ్మాయి తన అమ్మమ్మ గారి ఊరైన హాజీపూర్ వచ్చినప్పుడు కూడా శ్రీనివాస రెడ్డి ఇలానే లైంగిక దాడి చేసి గోనె సంచిలో చుట్టి తన పక్క పొలంలోని బావిలో పడేశాడు. ఆ అమ్మాయి తప్పిపోవడంపై ఫిర్యాదు చేసిన తల్లితండ్రులు నాలుగేళ్లు పోలీసుల చుట్టూ తిరిగి ఆశలు వదులుకున్నారు. ఆమెను మీరే ఏదో చేశారంటూ బంధువులతో గొడవలు కూడా పెట్టుకున్నారు వారు. చివరకు ఆ పాప చనిపోయినట్టు ఇప్పుడు తెలిసింది. ఈ ఘటన 2015 ఏప్రిల్ 23న జరగ్గా, ఆమె శరీరంలోని ఎముకలు ఆ బావిలో నుంచి మంగళ వారం బయటకు తీసారు. ఇంకా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు పోలీసులు.

అదే ఏడాది మహిళపై వేధింపులు

2015 సెప్టెంబరులో శ్రీనివాస రెడ్డిపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఒంటరిగా పశవువులను కాస్తున్నప్పుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. ఆమె పెద్దగా కేకలు వేసి తప్పించుకుంది. దీనిపై ఆ మహిళ, భర్తతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో చార్జిషీటు కూడా నమోదయింది.

2016లో మరో మహిళపై దాడి, హత్య

2016 లో కర్నూలులో లిఫ్టు బాగు చేయడానికి వెళ్లినప్పుడు తన తోటి వారితో కలసి ఒక మహిళను తాముండే చోటుకు పిలిపించుకుని, లైంగిక దాడి చేసి, తరువాత ఆమెను చంపేసి, అపార్టుమెంటు వాటర్ ట్యాంకులో పాడేశారు. ఈ కేసులో శ్రీనివాసును 2017లో కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసు నుంచి శ్రీనివాస్ ఎలా బయటకు వచ్చాడన్నది తెలియాల్సి ఉంది.

మార్చిలో అమ్మాయిపై అత్యాచారం, హత్య

2019 మార్చి 9న హాజీపూర్‌కే చెందిన ఒక అమ్మాయిని ఇలాగే లిఫ్టు ఇచ్చి ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి, తరువాత ఊపిరాడకుండా చేసి చంపేసి తన పొలంలోని బావిలోనే పూడ్చేశాడు. అయితే ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్లిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు, ఫిర్యాదు చేయలేదు. తాజా విచారణలో ఈ విషయం తేలింది.

చిత్రం శీర్షిక నిందితుడు శ్రీనివాస రెడ్డి గురించి మీడియాకు సమాచారం ఇస్తున్న రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్

ఇవన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయి?

ప్రస్తుత కేసు విచారణ రెండో రోజు అంటే ఏప్రిల్ 24వ తేదీన పోలీసు జాగిలాలు శ్రీనివాస రెడ్డి పొలం దగ్గరకు వచ్చాయి. కానీ ఎటువంటి క్లూ దొరకలేదు. తరువాత అక్కడ కొన్ని మొక్కలు, చిన్న చెట్ల కొమ్మలు విరిగి ఉండడం చూసి పోలీసులకు అనుమానం వచ్చి మళ్లీ పరిశీలిస్తే శ్రావణి మృతదేహం దొరికింది.

ఆదివారం పోలీసుల మరిన్ని ఆధారాల కోసం మృతదేహాలు దొరికిన ప్రాంతంలో కొలతలు వేస్తూ, ఇతర వస్తువులను వెతుకుతూంటే, మార్చి 9వ తేదీన హత్యకు గురైన బాలిక మృతదేహం దొరికింది.

అటు 2015లో హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని మరో బావిలో వేసినట్టు శ్రీనివాస రెడ్డే పోలీసులకు చెప్పడంతో ఆ బావిలో కూడా మంగళవారం వెతికించారు పోలీసులు. అక్కడ ఆ బాలిక శరీరంలోని ఎముకలు దొరికాయి.

కన్నేసిన అమ్మాయిలికి లిఫ్టు ఇవ్వడం కోసమే...

హైదరాబాద్ శివార్లలో కీసర తరువాత బొమ్మలరామారం ఉంది. ఇక్కడి నుంచి హాజీపూర్ గ్రామానికి వెళ్లేందుకు పొలాల మధ్య రోడ్డు ఉంటుంది. ఈ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ఆకుకూరలు కూరగాయలు హైదరాబాద్కు ఎగుమతి అవుతాయి. చదువుకునే వారు, రకరకాల పనులు ముగించుకుని తిరిగి వెళ్లే వారికి అదే ఊరికి చెందిన తెలిసినవారు లిఫ్ట్ ఇవ్వడం ఇక్కడ మామూలుగా జరుగుతుంది.

సరిగ్గా ఇదే విషయాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు నిందితుడు శ్రీనివాస్. తాను కన్నేసిన అమ్మాయిలకి లిఫ్టు ఇవ్వడం కోసమే ఏదో పని ఉన్నట్టుగా అక్కడ తిరుగుతుండేవాడు. అతను శరీరాలు పూడ్చిన బావులు వంద అడుగుల పైనే లోతు ఉండడం, చుట్టూ కంప చెట్లు ఉండడంతో అక్కడ శరీరాలు పూడ్చిన విషయం అంత తేలిగ్గా బయటపడదు.

మరోవైపు హాజీపూర్ గ్రామంలో పరిస్థితి ఇప్పుడు సద్దుమణిగింది. గురువారం నుంచి ఆ గ్రామంలో ఆందోళనకర పరిస్థితి, ఉద్రిక్తత కొనసాగుతూ వచ్చాయి. గురువారం శ్రావణి తప్పిపోయింది అన్న ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఆ మరునాడు సంఘటనా స్థలానికి వచ్చిన డీసీపీపై కూడా దాడికి దిగారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. గతంలో మిస్సింగ్ ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరాలు జరిగేవి కాదని కొందరు గ్రామస్తులు బీబీసీతో అన్నారు.

చిత్రం శీర్షిక కొత్తగా నిర్మించిన శ్రీనివాస రెడ్డి ఇంటిని వీలైనంత ధ్వంసం చేసి వస్తువులు చెల్లా చెదురు చేసి, గుమ్మాలు, కిటికీలు, ఇతర వస్తువులు తగలబెట్టారు గ్రామస్తులు

శ్రీనివాస్ ఇంటిని తగలబెట్టిన గ్రామస్తులు

నిందితుడు శ్రీనివాసే అని తెలియడంతో మంగళవారం ఉదయం శ్రీనివాస రెడ్డి ఇంటిని తగలబెట్టారు గ్రామస్తులు. కొత్తగా నిర్మించిన ఆ ఇంటిని వీలైనంత ధ్వంసం చేసి వస్తువులు చెల్లా చెదురు చేసి, గుమ్మాలు, కిటికీలు, ఇతర వస్తువులు తగలబెట్టారు గ్రామస్తులు. అంతకుముందు రోజే, నిందితుడి కుటుంబ సభ్యులు ఇల్లు వదలి వెళ్లిపోయారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ ఇంటిని చూడడానికి వస్తున్నారు. ఘటనా స్థలం దగ్గర పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్లూ గుమి గూడారు. తమ గ్రామం గురించి చెడుగా రాశారంటూ కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఇబ్బంది పెట్టవద్దంటూ మీడియాతో వాగ్వాదానికి దిగారు.

నిందితుడి నుంచి మోటార్ సైకిల్, రెండు ఫోన్లు, లిఫ్టు బాగు చేసే టూల్ కిట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాధితుల బట్టలు, స్కూలు బ్యాగ్, నోట్ బుక్స్, ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

‘‘ప్రస్తుతం విచారణ సరైన దిశలోనే నడుస్తోంది. శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నాం. ఈ కేసులో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేశాం. కల్పన ఎముకులకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తాం. అతని మానసిక విశ్లేషణ కూడా చేస్తాం. గ్రామంలోని బెల్టు షాపులు మూసేశాం. గ్రామంలోకి గంజాయి వెళుతోందన్న ఆరోపణలపై ఆరా తీస్తున్నాం. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టరును కోరాం. అతను ఇంకా ఇతర కేసుల్లో ఏమైనా ఉన్నాడా అనేది చూస్తున్నాం. ఆదిలాబాద్, వేములవాడల్లో అతను కొంత కాలం పనిచేశాడు. కాబట్టి అక్కడ ఇలాంటి అమ్మాయిల మిస్సింగు కేసులున్నాయా అని ఆరా తీస్తున్నాం. అతనొక పర్వర్టెడ్. ముందు ఊపిరాడకుండా చేసి స్పృహ తప్పడం లేదా చనిపోయాక లైంగికి దాడి చేస్తాడు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయి. తాను టార్గెట్ చేసిన వ్యక్తుల(అమ్మాయిల)ను ముందుగా రెక్కీ చేసి దాడి చేస్తాడు’’ అంటూ వివరించారు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం