కాంగ్రెస్ కార్యకర్త బురఖా ధరించి దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించాడా? :Fact Check

  • 2 మే 2019
స్క్రీన్ గ్రాబ్ Image copyright SM VIRAL POST

బురఖా ధరించిన ఓ వ్యక్తిని కొందరు లాక్కెళ్తున్నట్లుగా ఉన్న రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త అని, షమీనా అనే మహిళ పేరుతో ఓటు వేసేందుకు ప్రయత్నించి దొరికిపోయారని క్యాప్షన్‌ పెట్టి ఆ ఫొటోలను కొందరు పోస్ట్ చేశారు.

'నరేంద్ర మోదీ ఫర్ 2019 పీఎం' లాంటి మితవాద ఫేస్‌బుక్ పేజీలు వీటిని పోస్ట్ చేశాయి. 11 వేలకుపైగా మంది వీటిని షేర్ చేశారు.

గతంలోనూ ఇవే ఫొటోలు ఫేస్‌బుక్‌లో వేల సార్లు షేర్ అయ్యాయి.

అయితే, ఈ పోస్ట్‌ల్లోని ఆరోపణలు నిజం కాదని బీబీసీ పరిశీలనలో తేలింది.

అసలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలతో వీటికి ఏ సంబంధమూ లేదు. ఇవి 2015లో తీసినవి.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఈ ఫొటోలు 2015 అక్టోబర్‌లో వివిధ వార్తా కథనాల్లో ప్రచురితమైనట్లు వెల్లడైంది.

ఫొటోల్లో కనిపించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో గుడిలోకి గోమాంసం విసిరేస్తూ పట్టుబడ్డారని, ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారై ఉండొచ్చని అనుమానిస్తున్నారని స్కూప్‌వూప్ 2015, అక్టోబర్ 1న ప్రచురించిన వార్తా కథనంలో పేర్కొంది.

సోషల్ మీడియాలో అప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయని, అనంతరం అన్ని ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్ట్‌లను తొలగించారని కొన్ని కథనాలు తెలిపాయి.

అయితే, ఆ వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారా, కాదా అన్న విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించుకోలేకపోయింది.

లోక్‌సభ ఎన్నికల తొలి దశ తర్వాత ఏప్రిల్ 11న కూడా ఇవే ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అయ్యాయి.

అప్పుడు బీజేపీ కార్యకర్త దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించారన్న క్యాప్షన్‌తో వీటిని పోస్ట్ చేశారు.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)