దళితుడు ఖరీదైన కారులో వెళ్లినందుకు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు దాడి చేశారా? : Fact Check

  • 3 మే 2019
బీజేపీ జెండా Image copyright narendramodi/facebook

ఆరోపణ: దళిత వ్యక్తి ఖరీదైన కారులో వెళ్లినందుకు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు అతనిపై దాడి చేశారు

బీబీసీ అధ్యయనం: ఈ ఆరోపణ అసత్యం

ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు ఒక దళితుడిపై దాడి చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే అనిల్ మనుషులుగా ఆరోపిస్తున్న కొందరు, ఈ వీడియోలో ఒక వ్యక్తిపై రాడ్లతో దాడి చేస్తూ కనిపిస్తారు.

మా వాట్సప్ పాఠకులు దీని కచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి వీడియోను బీబీసీకి పంపారు.

1:30నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోతోపాటు ఒక మెసేజ్ కూడా విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది.

''బీజేపీ ఎమ్మెల్యే అనిల్ ఉపాధ్యాయ్ చేసిన ఈ దాడి గురించి మోదీ ఏం సమాధానం చెబుతారు? ఈ వీడియోను వైరల్ చేయండి. దళితులు ఖరీదైన కార్లలో తిరగడాని అవకాశం లేదని దేశం మొత్తానికి అర్థమవుతుంది'' అని ఆ మెసేజ్ సారాంశం.

''ఒక దళితుడిపై ఎమ్మెల్యే అనిల్ ఉపాధ్యాయ్‌ మనుషులు దాడి చేశారు. అందుకు కారణం, ఆ వ్యక్తి.. ఖరీదైన కారులో ప్రయాణించడమే!'' అని ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను వేలసార్లు షేర్ చేశారు.

మా అధ్యయనంలో, అనిల్‌పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేలింది.

Image copyright facebook

ఈ వీడియో ఎక్కడిది?

ఈ వీడియో రెండేళ్ల క్రితం నాటిది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదు. మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినపుడు, ఈ సంఘటనకు సంబంధించి 2017 ఏప్రిల్ 4న పబ్లిష్ అయిన పలు వీడియో వార్తాకథనాలు కనిపించాయి. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందినది.

వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన హార్దిక్ భర్ద్వాద్ అని, వార్తాకథనాలు తెలిపాయి.

కుటుంబ సమస్యల కారణంగా హార్దిక్‌పై తన అత్తింటివారు దాడి చేశారు. హార్దిక్ కారును కూడా వారు ధ్వంసం చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన గురించి గుజరాత్ పోలీసులతో కూడా మేం మాట్లాడాం.

''ఈ సంఘటన గాంధీనగర్ సెక్టార్-7లో జరిగింది. కుటుంబ తగాదాల్లో భాగంగా దాడి జరిగింది. హార్దిక్ తనను కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆయన భార్య ఆరోపించింది'' అని ఒక సీనియర్ పోలీస్ అధికారి బీబీసీతో అన్నారు.

''భర్త వేధింపులను పుట్టింటివారికి చెప్పినపుడు వారు నడిరోడ్డుపై హార్దిక్‌ను చితకబాదారు. తర్వాత ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు'' అన్నారు.

ఇది పూర్తిగా కుటుంబ తగాదా అని, ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తోందని ఆయన అన్నారు.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)