లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు

  • 9 మే 2019
అనాటో మొక్క గింజలు

లిప్‌స్టిక్ రంగుల్లో మెరిసే పెదాలను, ఆ రంగు పెదాల నుంచి జాలువారే నవ్వులను చూసేవుంటారు.. కానీ ఆ పెదాలకు రంగులద్దిన లిప్‌స్టిక్‌లు ఎలా తయారవుతాయి? వాటిని వేటితో తయారు చేస్తారు?

ఎంతోదూరం కాదు.. తూర్పుగోదావరి జిల్లాలో కిషోర్ అనే ఓ యువరైతు.. ఆ ప్రాంతంలో కొత్త వ్యవసాయానికి తెరలేపారు. లిప్‌స్టిక్ తయారీకి అవసరమయ్యే గింజలను పండిస్తున్నారు.

ప్రకృతి సహజంగా ఇచ్చే రంగులతో అనేక పూలు పూస్తుంటాయి. ఆ కోవకే చెందుతుంది అనాటో మొక్క. సింధూరీ, జాఫ్రా అని పిలిచే ఈ మొక్క కాయలు, గింజల నుంచి వచ్చే రంగును లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కిషోర్ అనే యువకుడు ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయం గురించి, మార్కెటింగ్ గురించి కిషోర్‌ను బీబీసీ పలకరించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఆంధ్రాలో లిప్‌స్టిక్ గింజల సాగు

'ఇంటర్‌నెట్‌ ద్వారా మెరిసిన ఆలోచన'

కిషోర్ భీమవరంలో ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టమని కిషోర్ చెబుతున్నారు.

ఏంబీఏ తరువాత తనకు కెనడాలో ఉద్యోగ అవకాశం వచ్చినా, తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక, ఇక్కడే ఉండి ఈ వ్యవసాయం ప్రారంభించానని కిషోర్ అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఇష్టమని, ఆ వ్యవసాయాన్నే కెరీర్‌గా మలుచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.

అందరిలా వ్యవసాయాన్ని బతకడం కోసం కాకుండా, సేద్యాన్ని ఒక పరిశ్రమగా మార్చి, ఎవరూ పండించని వాణిజ్య పంటలను పండిస్తే లాభం ఉంటుందని భావించారు.

దానికి సంబంధించిన పరిశోధన కూడా ప్రారంభించారు. ఇంటర్‌నెట్‌లో వెతకగా ఆయనకు అనాటో మొక్క గురించి తెలిసింది.

నేచురల్ కలర్‌గా ఉండే అనాటో మొక్క గింజలను లిప్‌స్టిక్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని తెలిసింది. దానితోపాటు ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ ఈ అనాటో మొక్కలను వాడతారు.

అంతేకాదు, తూర్పు గోదావరి జిల్లాలో పలు ఏజెన్సీ ప్రాంతాల్లో, తమ ఇంటి అవసరాల కోసం గిరిజనులు ఈ మొక్కలను పెంచుకుంటారు. గిరిజనులు ఈ పంటను సింధూరి, జాఫ్రా అనే పేర్లతో పిలుస్తారు.

ఈ మొక్కలను తానే పెద్ద మొత్తంలో ఎందుకు సాగుచెయ్యకూడదని భావించారు కిషోర్. గంగవరం మండలం బర్రిమామిడి గ్రామంలో 50 ఎకరాల్లో జాఫ్రా మొక్కలను పెంచడం ప్రారంభించారు.

ఒడిదుడుకులు తప్పలేదు

ప్రారంభంలో తాను చాలా ఇబ్బంది పడినట్లు కిషోర్ చెబుతున్నారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఈ జాఫ్రా పంట ఎక్కువగా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ పంట సాగు చాలా తక్కువ.

ఈ జాఫ్రా పంట గురించి పూర్తిగా చెప్పే వాళ్లు కూడా పెద్దగా లేరు. పూర్తిగా ఇంటర్నెట్ మీద అధారపడ్డ కిషోర్ క్రమక్రమంగా జాఫ్రా పంటపై పట్టు సాధించారు.

పెద్ద స్థాయిలో భూమి, అందునా పూర్తి నీటి సదుపాయాలు కలిగి, పొడిగా ఉండే భూమి జాఫ్రా పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది.

సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పంట చేతికి వస్తుంది. ఒక్కసారి నాటిన జాఫ్రా మొక్క దాదాపు 25 సంవత్సరాల పాటు కాపు ఇస్తూనే ఉంటుందని కిషోర్ చెబుతున్నారు.

మొదటి రెండేళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడినా, తర్వాత కాస్త వెసులుబాటు కలిగినట్లు ఆయన చెబుతున్నారు.

'సంతలో కిలో వంద.. అంతర్జాతీయ మార్కెట్‌లో వెయ్యి'

జాఫ్రా పంటకు సరైన మార్కెటింగ్ లేదు. గిరిజనులు వారాంతపు సంతల్లో వీటిని అమ్ముతుంటారు. కిలో జాఫ్రా గింజలు రూ.80 నుంచి రూ.100వరకు ధర పలుకుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు వెయ్యి నుంచి 1200 వరకు పలుకుతుందని కిషోర్ చెబుతున్నారు.

కొనుగోలుదారులు తుని నుంచి వచ్చి వీటిని కొనుక్కుని వెళతారని, గిరిజన కార్పొరేషన్ వాళ్లు కూడా వీటిని కొనడం లేదని, స్థానిక వ్యాపారులు కిలోల చొప్పున కొంటారని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పెద్దమొత్తంలో అమ్ముతామని స్థానిక కొనుగోలుదారుడు మూలా స్వామి అన్నారు.

ఇప్పుడిప్పుడే ఈ జాఫ్రా పంట మీద కొత్తవారు ఆసక్తి చూపిస్తున్నారని, ఎవరైనా ఈ పంట కోసం ముందుకువస్తే వారికి సూచనలు ఇస్తానని కిషోర్ చెబుతున్నారు.

ఈ సేద్యంలో కచ్చితంగా విజయం లభిస్తుందని, ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు.

‘‘ఇందులో కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా భవిష్యత్తులో లాభాలు వస్తాయి’’ అని కిషోర్ అన్నారు.

కాగా, తాము గత రెండేళ్ల నుంచీ అనాటో గింజలను కొనుగోలు చేస్తున్నామని గిరిజన కార్పొరేషన్ తెలిపింది.

అనాటో గింజల కొనుగోలుకు కేజీకి 95 రూపాయలు కనీస మద్దతు ధర కూడా ప్రకటించామని జీసీసీ వైస్ ఛైర్మన్ బాబూరావు నాయుడు బీబీసీతో అన్నారు.

(ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్ ; షూట్& ఎడిట్: నవీన్ కుమార్ .కె ;డ్రోన్ వీడియో: అజయ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)