చార్మినార్‌పై ఊడిన సున్నం పెచ్చులు

  • 2 మే 2019
చార్మినార్‌పై ఊడిన సున్నం పెచ్చు Image copyright UGC
చిత్రం శీర్షిక చార్మినార్‌పై ఊడిన సున్నం పెచ్చు

చార్మినార్ పెచ్చులు ఊడుతోంది. చార్మినార్లోని ఒక మినార్ (నాలుగు స్తంభాల్లో ఒకటి) నుంచి సున్నం (పాత కట్టడాల్లో సున్నపు మిశ్రమాన్ని సిమెంటులా వాడేవారు) పెచ్చులు ఊడి కిందపడ్డాయి.

చార్మినార్‌కి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత 20-30 సంవత్సరాల్లో అనేకసార్లు చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ అప్పుడెప్పుడూ జరగనట్టుగా, ఈసారి 2 మీటర్లపైనే వెడల్పున్న భాగం ఊడి పడింది.

నిజానికి చార్మినార్ ప్రధాన కట్టడానికి సమస్య లేకపోయినా, చుట్టూ ఉండే సున్నపు మిశ్రమంతో చేసిన అలంకరణలు, అదనపు నిర్మాణాలు కొంత కాలంగా దెబ్బతింటూ వస్తున్నాయి. భారత పురావస్తు శాఖ దీనికి మరమ్మతులు చేపడుతూనే ఉంది.

1591లో నిర్మించిన ఈ కట్టడంపై 17వ శతాబ్దంలో ఒకసారి పిడుగుపడి ఒక మినార్ మొత్తం కూలిపోయింది. అప్పట్లో దాన్ని తిరిగి నిర్మించారు. తిరిగి 1924లో ఏడో నిజాం హయాంలో మరమ్మతులు చేశారు.

Image copyright UGC

ఇటీవలే చార్మినార్ మినార్ల రిపేర్లు పూర్తయ్యాయి. కానీ ఆ వెంటనే, ఇంత పెద్ద సున్నపు భాగం ఊడిపడడం చర్చకు కారణమైంది. ప్రస్తుతానికి మరింత నష్టం జరగకుండా పెచ్చులూడిన భాగం చుట్టూ మెష్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.

చార్మినార్‌కి జరిగే నష్టాన్ని ఆపడం కోసం కట్టడం పైకి ఎక్కే అవకాశం ఆపేశారు. గతంలో చార్మినార్‌ను ఆనుకునే వాహనాలు వెళ్లేవి. ఇప్పుడు చార్మినార్ చుట్టూ ఉన్న రోడ్డు బాగు చేసి, చార్మినార్‌ని పూర్తిగా ఆనుకుని ద్విచక్ర వాహనాలు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. చార్మినార్ చుట్టూ ఎప్పుడూ పర్యటకులతో పాటు స్థానిక చిరు వ్యాపారులు, కొనుగోలుదార్లతో రద్దీగా ఉంటుంది. అయితే తాజా ఘటన వల్ల ఎవరికీ ఏ హానీ జరగలేదు.

మరింత సున్నపు మిశ్రమం కిందపడకుండా తాత్కాలికంగా మెష్ ఏర్పాటుచేశారు.

Image copyright UGC

"ఇది మొదటిసారి కాదు, కానీ ప్రమాదం ఏమీ లేదు"

చార్మినార్ పెచ్చులూడడం ఇదే మొదటిసారి కాదు. ఎనిమిది నుంచి పదిసార్లు వరకూ ఇలా జరిగింది. కానీ ఈసారి చాలా పెద్ద భాగం ఊడి పడింది. దాదాపు అరటన్ను పైనే ఉంటుంది దాని బరువు. దీనివల్ల మొత్తం చార్మినార్ భద్రతకు ముప్పు ఉంటుందని ఏమీ చెప్పలేం. అలాగే పురావస్తు శాఖ వారి పనిని కూడా తప్పు పట్టలేం. బహుశా సున్నపు మిశ్రమం వాడాల్సినదాని కంటే 10 నుంచి 12 శాతం తక్కువ నాణ్యత ఉండేది వాడి ఉంటారు అనుకుంటున్నా. అన్నిటికీ మించి ఇది ఒక ఉద్వేగపూరిత అంశం. చార్మినార్ అంటేనే హైదరాబాద్ గుర్తింపు. అందుకని కొంచెం బాధగా ఉంటుంది. అయితే చార్మినార్ మొత్తానికి మాత్రం ఏం ప్రమాదం లేదు అని బీబీసీతో చెప్పారు చరిత్రకారులు సఫీయుల్లా.

ఇది కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)