కేసీఆర్ వ్యాఖ్యలు నియమావళి ఉల్లంఘనేనని స్పష్టం చేసిన ఈసీ: ప్రెస్‌ రివ్యూ

  • 4 మే 2019
Image copyright kcr/fb

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని ఈనాడు తెలిపింది.

బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని హితవు పలికింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌కే రుడోలా ఉత్తర్వులు జారీ చేశారు.

మార్చి 17న కరీంనగర్‌లో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నట్లు ఫిర్యాదు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 9వ తేదీన ఆయనకు సంజాయిషీ నోటీసు ఇచ్చింది.

ఫిర్యాదుదారు తన ప్రసంగాన్ని అపార్థం చేసుకున్నారని ఎన్నికల సంఘానికి పంపిన సమాధానంలో కేసీఆర్‌ పేర్కొన్నారు. 'రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను గౌరవించడం, భారత రాజ్యాంగ లౌకికతత్వాన్ని కాపాడటంతోపాటు, దాన్ని బహిరంగంగా, ప్రసంగాల్లో చూపాల్సిన బాధ్యత ఒక గుర్తింపు పొందిన ప్రాంతీయపార్టీ అధ్యక్షుడిగా, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌పై ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష ప్రతిపాదికన విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించకూడదు. కానీ కరీంనగర్‌ సభలో కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆ నియమావళిని ఉల్లంఘించింది' అని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మతపరమైన భావాల ఆధారంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించకూడదని, కానీ ఇక్కడ ఆ నిబంధన ఉల్లంఘన కూడా జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారని ఈనాడు వెల్లడించింది.

Image copyright chandrababu/fb

‘మోదీ మాటలు ఈసీకి సంగీతమే’

వచ్చేవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని ఆంధ్రజ్యోతి తెలిపింది. ఎన్నికల కోడ్‌ పేరిట 'బిజినెస్‌ రూల్స్‌'ను ఉల్లంఘిస్తున్న అధికారుల తీరుపై చర్చిస్తామని తెలిపారు. శుక్రవారం చంద్రబాబు ఉండవల్లి ప్రజా వేదికలో మీడియాతో మాట్లాడారు.

నరేంద్ర మోదీ మళ్లీ గెలవరని ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా అందరికీ అర్థమైందని అన్నారు. దీంతో తాజాగా రెండు పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీలేంటన్నది ఇప్పుడే వెల్లడించనని... మరికొన్ని పార్టీలు కూడా వాటితో కలిసి వస్తాయని అన్నారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో జాతీయ రాజకీయాలపై ఏమైనా మాట్లాడారా? అని ప్రశ్నించగా...తుపాను సాయంపై రెండుసార్లు మాట్లాడానని బదులిచ్చారు. ఇక... మోదీ ఏం మాట్లాడినా ఈసీకి సంగీతంలాగే ఉంటుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని పశ్చిమ బెంగాల్‌లో మోదీ ప్రకటించినా పట్టించుకోలేదన్నారు. ఇక... ఫణి తుఫాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో వేగంగా స్పందించి ప్రజలకు సాయం అందించేందుకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని అడిగితే... తాపీగా తుఫాను తీరం దాటాక అనుమతి ఇచ్చిందని తెలిపారు.

అంతకుముందే తుఫానుపై అధికారులతో సమీక్ష చేసి సమన్వయం చేశామని తెలిపారు. ''మొన్నటివరకు అధికారులుగా ఉన్నవారే ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమితులయ్యారు. మోదీ వారిని నియమించినంత మాత్రాన హద్దులు దాటి ప్రవర్తించకూడదు. రాష్ట్ర సీఈవోకు కూడా ఇదే వర్తిస్తుంది'' అని అన్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright Telanganacmo/fb

నెలాఖర్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అదే సంఖ్యలో కీలక పదవులలో ఉన్న వారు అవసరం. దీంతో జూన్‌ 2లోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని, ప్రభుత్వంలోని కీలకమైన పదవులన్నీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం.. వంటి అంశాల ఆధారంగా మంత్రులుగా ఎవరెవరికి అవకాశం వస్తుందనేది పూర్తి స్పష్టత రానుంది.

మరోవైపు కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరి చేరిక ఖాయమైంది. ఈ నేపథ్యంలో 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ శాసనసభ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కానుంది.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే విస్తరణకు ముహూర్తం ఖరారవుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకుతోడు కొత్తగా వస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కల్పించేలా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వంలో సీఎంతోపాటుగా 17 మంది మంత్రులు ఉంటారు. ప్రస్తుత మంత్రివర్గంలో 11 మంత్రులే ఉన్నారు. మరో ఆరుగురు కొత్తగా మంత్రులు చేరే అవకాశం ఉంటుంది. గత ఏడాది డిసెంబరు 13న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడు కేసీఆర్‌ సీఎంగా, మహమూద్‌ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. 2 నెలల తర్వాత (ఈ ఏడాది ఫిబ్రవరి 18న) మంత్రివర్గ విస్తరణ జరిగింది. అప్పుడు మరో 10మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో మరో ఆరుగురు మంత్రులుగా చేరే అవకాశం ఉందని సాక్షి తెలిపింది.

ఏపీఎస్ఆర్టీసీ Image copyright APsrtc/fb

ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్‌

ఏపీఎస్‌ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్‌ మోగించేందుకు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతృత్వంలోని కార్మిక సంఘాల ఐకాస సిద్ధమవుతోందని ఈనాడు తెలిపింది.

ఈ మేరకు ఈ నెల 9వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. అదే రోజున దశలవారీ ఆందోళన కార్యక్రమాల వివరాలనూ ప్రకటించనుంది. గతేడాది డిసెంబరులో ఐకాస ఇచ్చిన సమ్మె నోటీసుపై ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య, ఆర్టీసీ ఎండీ ఎన్‌.వి.సురేంద్రబాబు నేతృత్వంలో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఇచ్చిన లిఖితపూర్వక హామీల్లో ఒకటైన 2013 వేతన సవరణకు సంబంధించిన తొలివిడత బకాయిలను ఉగాది నాటికి విడుదల చేయవలసి ఉంది. నేటికీ విడుదల చేయలేదని, ఆ అంశంతో పాటు మరికొన్ని ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసు ఇవ్వనున్నామని ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పలిశెట్టి దామోదరరావులు తెలిపారు.

విజయవాడలోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో శుక్రవారం కార్మిక సంఘాల ఐకాస సమావేశం జరిగింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కో-కన్వీనర్లు సీహెచ్‌.సుందరయ్య, వరహాలనాయుడు, ఓస్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌ తదితరులు సమావేశంలో చర్చించి సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారని ఈనాడు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)