గడ్చిరోలి: నక్సల్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో పోలీసులే సమిధలవుతున్నారా

  • 4 మే 2019
ప్రమోద్ బోయర్
చిత్రం శీర్షిక ప్రమోద్ బోయర్

'పమ్యా' ఇక ఎప్పటికీ తిరిగిరారు. శుక్రవారం అతని అస్థికలను వైన్‌గంగా నదిలో స్నేహితులు నిమజ్జనం చేశారు. నది ఒడ్డున నిర్వహించిన అంతిమ సంస్కారాలకు బంధవులు, స్నేహితులు హాజరయ్యారు.

నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లా కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్సా ఇప్పుడు మౌనంగా ఉంది. ప్రమోద్ భోయర్‌(పమ్యా)ది ఇదే గ్రామం. ఆయన ఇంటి ముందు ఊరువాళ్లంతా గుమిగూడారు.

1992 సెప్టెంబర్‌లో ఇదే తరహాలో కురుఖేదాలో మావోయిస్టులు బాంబు పేల్చడంతో వడ్సా గ్రామం తన బిడ్డ (ప్రదీప్ భోయర్) ను కోల్పోయింది.

ప్రమోద్ లాగే ప్రదీప్ కూడా మహారాష్ట్ర పోలీస్. తమ ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే ఉద్యోగం చేస్తూ ఒకే విధంగా మరణించడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేకాదు ప్రదీప్.. ప్రమోద్‌కు మామ అవుతారు.

ప్రమోద్ కుటుంబంలో రెండేళ్ల నుంచి విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నాళ్ల కిందట ఆయన తండ్రి మహదేవ్ జీ చనిపోయారు. తర్వాత కొన్ని రోజులకే సోదరుడు రవీంద్ర కన్నమూశారు.

రెండేళ్ల కిందటే ప్రమోద్‌కు పెళ్లైంది. మూడునెలల కిందట ఆ జంటకు పుట్టిన కవలల్లో ఒకరు చనిపోయారు.

మే 1 న ఇంటి నుంచి వెళ్లిన ప్రమోద్ ఇక మళ్లీ తాను ఇంటికి రాననే విషయం తెలిసి ఉండదు.

చిత్రం శీర్షిక ప్రమోద్ కుటుంబ సభ్యులు

ఆ కుటుంబాన్ని పోషించేవారే లేరు...

వాడ్సాలోని షాపులను స్వచ్ఛందంగా మూసివేసిన వ్యాపారులు ప్రమోద్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

కొడుకు మృతిని తట్టుకోలేక ఇంట్లో ఏడుస్తున్న ప్రమోద్ తల్లి కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేరు. కొన్నాళ్ల వ్యవధిలోనే ఆమె ముగ్గురు చావులను చూడాల్సి వచ్చింది.

నేను ఆమెను మాట్లాడించే సహాసం చేయలేకపోయాను. ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ''మాకిప్పుడు ఏం జరుగుతుందో?..పోషించేవారు ఎవరూ ఇంట్లో లేరు?" అని ఆమె బాధపడ్డారు.

ఆ ఇంట్లోనే వంటగదిలో రోదిస్తున్న ప్రమోద్ భార్యను చుట్టూ ఉన్న మహిళలు ఓదారుస్తున్నారు.

ప్రమోద్ స్నేహితులు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. వారిలో ఒకరు మాట్లాడుతూ, ''చాలా రోజుల నుంచి నువ్వు సెలవు తీసుకోవడం లేదు. ఇప్పుడు ఒక నెల సెలవు తీసుకో అని అంటే వచ్చే నెల సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటా అని చెప్పారు. కానీ, ఇంతలోనే ఈ దారుణం జరిగింది. పమ్యా వమ్మల్ని వదిలి వెళ్లిపోయారు'' అని పేర్కొన్నారు.

అధికారుల తీరుపై ఆగ్రహం

నది ఒడ్డున ప్రమోద్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అక్కడే ఆయన బావమరిది విజయ్ మెష్రం ఇతరులు గుమిగూడి ఉన్నారు. పోలీసుఅధికారుల తీరుపై వారు చర్చించుకున్నారు.

మావోయిస్టుల దాడి ఘటనలో పోలీసుల తప్పుకూడా ఉంది అని మహారాష్ట్ర డీజీపీ చేసిన ప్రకటనపై వారు చర్చించారు.

మావోయిస్టుల దాడిలో ఎప్పుడూ పోలీసులే బలవుతున్నారు? కానీ, సీనియర్ అధికారులకు ఎందుకు ఏమీ జరగడం లేదు అని ప్రశ్నించారు.

మావోయిస్టులు కురుఖేదాలో భారీ విధ్వంసానికి పాల్పడుతారని డీఎస్పీకి ముందే సమాచారం అందినప్పుడు ఎందుకు 15 మందిని ఒకే వాహనంలో ఆ ప్రాంతానికి తరలించారు అని మెష్రం ఆరోపించారు.

ల్యాండ్‌మైన్లు, బాంబుల వల్ల తమను భయం వెంటాడుతోందని కురుఖేదా వాసులు అంటున్నారు.

చిత్రం శీర్షిక మహారాష్ట్రలో పోలీసు కాన్వాయ్‌పై మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 16 మంది మరణించారు

నిబంధనలను ఉల్లంఘించారా?

గడ్చిరోలిలోని కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్‌ఫేర్ కాలేజ్ డైరెక్టర్, బ్రిగేడియర్ బీకే పన్వార్ బీబీసీతో మాట్లాడుతూ, ''అడవిలో సెర్చ్ ఆపరేషన్ చేయాల్సినప్పుడు పాటించాల్సిన నిబంధనలను పోలీసులు, అధికారులు ఉల్లంఘిస్తున్నారు.'' అని అన్నారు.

మావోలు ఇదే తరహాలో దాడులు చేస్తున్నా వాటి నుంచి పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోవడం లేదు అని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతి ఘటనలోనూ క్షేత్రస్థాయిలోని పోలీసులే బాధితులు అవుతున్నారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు