వేసవి ఎండలు: భారతదేశమే భూగోళం మీద అత్యంత వేడి ప్రాంతమా?

  • 6 మే 2019
వేడి నుంచి ఉపశమనం కోసం ఏనుగుకు స్నానం చేయిస్తున్న మావటి Image copyright Getty Images
చిత్రం శీర్షిక వేడి నుంచి ఉపశమనం కోసం ఏనుగుకు స్నానం చేయిస్తున్న మావటి

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44, 45 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోతున్నాయి.

ఉత్తర తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఒంగోలు, కర్నూలు నగరాల్లోనూ ఎండలు భగ్గుమంటున్నాయి.

ఆదివారం రామగుండం, విజయవాడ, ఒంగోలు, నాగ్‌పూర్‌లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవల దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోని బ్రహ్మపురిలో 46.4 డిగ్రీలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Image copyright Getty Images

1901 తర్వాత అత్యంత వేడి సంవత్సరం 2018 అని భారత వాతావరణ శాఖ నిరుడు ప్రకటించింది. ఈ ఏడాది అంతకు మించి దేశంలో సగటున 0.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా.

వాతావరణ సమాచారం అందించే వెబ్‌సైట్ ఎల్ డొరాడో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత శుక్రవారం భూగోళంపైనే అత్యధిక వేడి ప్రాంతంగా సెంట్రల్ ఇండియా పేరు నమోదైంది.

గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అందుకు కారణం నగరాల్లో చోటుచేసుకుంటున్న మార్పులేని నిపుణులు అంటున్నారు.

అందుకే, మధ్య భారత్‌లోని కొన్ని పట్టణాలు ప్రపంచంలోనే 15 అత్యంత వేడి పట్టణాల జాబితాలో చేరాయి.

Image copyright Getty Images

నగరాలు మండిపోతున్నాయి

పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతుండటంతో గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని నగరాలు, పట్టణాలు శరవేగంగా మారిపోతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాల కోసం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. దాంతో, పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి.

తారు, కాంక్రీటు రోడ్లు విస్తరిస్తున్నాయి. భారీ భవనాలు వెలుస్తున్నాయి. ఏసీల వాడకం పెరిగిపోతోంది. ఆ ఏసీల నుంచి వెలువడే వేడి గాలి కలవడంతో బయటి వాతావరణం మరింత వేడెక్కిపోతోంది.

జనాభా అధికంగా ఉన్న నగరాల్లో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఆయా నగరాలను సమీపిస్తుండగానే వేడిలో తేడా తెలిసిపోతుంది. ఆ విషయం ఇప్పటికే మనలో చాలామంది గ్రహించే ఉంటారు.

భారీ భవనాల నిర్మాణాలతో పాటు ఇతర మార్పుల కారణంగా నగరాల్లో గాలి ప్రయాణ వేగం తగ్గిపోతోందని, దాంతో ఉష్ణోగ్రత్తలు పెరిగిపోతున్నాయని పూణెలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్. అమిత్ ధోర్డే అంటున్నారు.

"నగరాల చుట్టూ పంట పొలాలు, పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి. తారు, కాంక్రీటు రోడ్లు విస్తరిస్తున్నాయి. అందుకే నగరాల్లో ఎండలు మండిపోతున్నాయి. మన దేశంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని మా అధ్యయనంలో తేలింది. యూరప్ దేశాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రమే పెరుగుతున్నాయి. గడచిన నాలుగైదు దశాబ్దాల్లో ఇక్కడి నగరాల్లో చోటుచేసుకున్న మార్పులే అందుకు కారణం" అని డాక్టర్. అమిత్ వివరించారు.

ఉష్ణోగ్రత పెరగడానికి భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ప్రధాన కారణమైనప్పటికీ, నగరాల్లో వేడికి ప్రధాన కారణం కాంక్రీటు నిర్మాణాలు పెరిగిపోవడమేనని ప్రొఫెసర్ మానసి దేశాయ్ నొక్కి చెప్పారు.

కాంక్రీటు నిర్మాణాలు, తారు రోడ్లు మధ్యాహ్నం వేడిని గ్రహించి, రాత్రి విడుదల చేస్తాయి. దాంతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా నగరాల్లో వేడి పెరిగిపోతోందని ఆమె అన్నారు.

Image copyright Getty Images

గాలి ప్రవాహ దిశ

గాలి ఏ దిశ నుంచి వీస్తుందన్నది ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులకు ఒక ప్రధాన కారణమని డాక్టర్ రాజన్ కేల్కర్ చెప్పారు. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల నుంచి గాలి వస్తుంటే వేడి ఎక్కువగా ఉంటుంది.

'కోర్ హీట్ జోన్' గా పిలిచే తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో ఏడాది సగటుకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తాము ముందుగానే అంచనా వేశామని భారత వాతావరణ శాఖకు చెందిన అధికారి కృష్ణానంద్ హోసలికర్ చెప్పారు.

Image copyright Getty Images

మన తిండి కూడా మారాలి

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తినే ఆహారంలో, వేసుకునే దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కేల్కర్ అంటున్నారు.

"రాజస్థాన్‌లో చూస్తే అక్కడ తరచూ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సీయస్ దాటుతుంది. ఆ ఎండలను తట్టుకునేలా అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్లు తలమీద వస్త్రం వేసుకోకుండా ఇంటి నుంచి బయట అడుగుపెట్టరు. ఎక్కడ చూసినా తాగునీరు అందుబాటులో ఉండేలా చూస్తారు. తరచూ నీళ్లు తాగుతారు. కొత్తవారు ఎవరైనా అక్కడికి వెళ్లినా వెంటనే నీళ్లు తాగాలని పదేపదే చెబుతుంటారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా వారు తమ జీవనశైలిని మార్చుకున్నారు. వారి నుంచి అందరూ నేర్చుకోవాలి" అని కేల్కర్ సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)